ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే - 1Back to list

 

 తుమ్మల వేణుగోపాలరావు గారు

 విద్యావేత్త గా, సలహా దారు గా సహాయ కారి గా, నిజాయితీ పరుడి గా, ముక్కుసూటి మనిషిగా, గురువుగా ,సమాజ సేవకుడిగా, ధైర్యశాలిగా,హేతువాది గా వేణుగోపాల రావు గారిని అభిమానించే వేలాది మందిలో నేనూ ఒకడిని. ఆర్ధిక పరిస్థితులు సహకరించక I.T.I మాత్రమే చదివిన నేను ఈ రోజు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నానంటే దానికి తోడ్పాటు అందించిన వ్యక్తుల్లో ముఖ్యుడు తుమ్మల వేణుగోపాలరావు గారు. మాది ఘంటసాల పాలెం గ్రామం. వేణుగోపాల రావు గారిది వారి సతీమణి కృష్ణా బాయి గారిది కూడా అదే గ్రామం అయినా నేను మొట్ట మొదటిసారి ఆయన్ని కలిసింది 1972 అక్టోబర్ 5 న విశాఖపట్నం లో. I.T.I పూర్తి చేసుకుని BHPV లో Apprentice ship Interview కోసం వెళ్ళినపుడు వారిని కలిసాను.నాతో పాటుగా మా పక్కన ఊరు కొత్తపల్లి కి చెందిన  అవిర్నేని వెంకటేశ్వరరావు కూడా ఆ Interview కి వచ్చాడు.ఒక వారం తర్వాత కేవలం ఆరుగురిని మాత్రమే తీసుకున్నట్లు తెలిసింది.ఆ ఇంటర్వ్యూ కి హాజరైన వ్యక్తుల లిస్టు లో నాది 12 వ స్థానం. అదే సమయం లో అయన ఊరు రావడం తో కలిసి విషయం చెప్పాను. ఇక్కడే ఆయన గొప్పతనం గురించి చెప్పాలి. ఆ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ కి కాల్ చేసి మా వాడికి తర్వాత అయినా అవకాశం ఉంటుందా అని మాత్రమే అడిగారు. ఆయన మీదున్న గౌరవంతో  12 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అది నా జీవితం లో నేనెక్కిన మొదటి మెట్టు. తాను రికమెండ్ చేయటం వల్ల అర్హత ఉన్నవాడికి అవకాశం పోతుంది అనుకుంటే అది తన సొంత వాళ్ళైనా సరే అందుకు సమ్మతిన్చేవారు కాదు. ఎవరికీ అవకాశం పోకుండా నా కోసం మరో 5 గురికి సైతం అవకాశం దక్కింది.


ఆ తరవాత అదే కంపెనీ లో ఉద్యోగిగా విశాఖపట్నంలోనే  సెటిల్ అవ్వటం తో అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. వేణుగోపాలరావు గారితో కంటే వారి సతీమణి కృష్ణక్క తో బాగా చనువు ఉండేది. అన్నీ విషయాల్లోనూ మంచి చెడు సలహా చెప్తూ ఉండేది.1975 లో పాలిటెక్నిక్ Night college లో సీట్ కోసం ఎంట్రన్సు రాసాను.కానీ ఎందుకో సీట్ వస్తుందన్న నమ్మకం కలగలేదు. అదే విషయం కృష్ణక్క తో అంటే, ఆవిడ ఆ విషయాన్ని భర్త తో అందట.అప్పుడాయన పిలిచి నేకు సీట్ ఇప్పించటం పెద్ద విషయం కాదు, ఆ ప్రిన్సిపాల్ నాకు తెలుసు, కానీ నీ కోసం నేను అడిగితే, రేపు అయన ఇంకొకరి కోసం నన్ను ఇంజినీరింగ్ సీట్ అడుగుతాడు.(అప్పుడు అయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నారు) ఆయన అడిగిన వాళ్ళకి సీట్ ఇచ్చి మెరిట్ స్టూడెంట్ కి అన్యాయం చెయ్యటం నాకు ఇష్టం లేదు నీకు సబ్జెక్టు కావాలంటే నేనే చెప్తాను మరో సారి ఎంట్రన్సు రాయి. లేదంటే మరో సలహా , Night college అయితే నాలుగేళ్ళు చదవాలి అదే Private గా అయితే రెండేళ్లలో పూర్తి చెయ్యచ్చు అన్నారు.ఆ ప్రకారమే నేను రెండేళ్లలో నే పాలిటెక్నిక్ పూర్తి చేసాను.

భయం ఎరుగని ధైర్యశాలి: సిద్ధార్ధ కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నపుడు స్టూడెంట్స్ అంతా సమ్మె చేశారు.బయట అంతా Management down down , Principal Down Down అని నినాదాలు చేస్తున్నారు.పరిస్తితి ఉద్రిక్తం గా మారటం తో సిబ్బంది అంతా ఆయన్ని బయటికి రావొద్దని వారించారు. అయన వినకుండా ధైర్యం గా ఆ గుంపు మధ్యలోకి వెళ్లి స్లోగన్స్ ఇవ్వటం మొదలు పెట్టారు ఈయన Management, Principal అంటే స్టూడెంట్స్ down down అనాలి.ఆయనే అలా అనటం తో స్టూడెంట్స్ కోరస్ ఇవ్వటం ఆపేశారు.అపుడే వాళ్ళ  సమస్యలు విని ఇలా ఏమన్నా ఉంటే నాతోనే మాట్లాడండి లేదా ఒక లెటర్ లో ఇవ్వండి అని అప్పట్నుంచే కళాశాల లో Complaint & Suggestion BOX విధానాన్ని ప్రవేశ పెట్టారు. 
 
                                                                                                                                                             (సశేషం)
                                                                                                     మరిన్ని విశేషాలు వచ్చేవారం...
 
 
రచయిత గురించి : ఘంటసాల పాలెం గ్రామస్తులైన శ్రీ కొల్లూరి వెంకట కృష్ణారావు గారు గారు గతం లో విశాఖపట్నం BHPV సంస్థ లో మెకానికల్ ఇంజినీర్ గా పని చేశారు.ప్రస్తుతం అమెరికా లో లూసియానా రాష్ట్రం లో Quality Manager గా పని చేస్తున్నారు.