మా గురించిBack to home

​రాను రాను భావితరాలకి మా గ్రామంతో ఉన్న సంభందాలు మృగ్యమైపొతున్న దశలో వారికి ఒక వారధి ని నిర్మించాలన్న ఆలోచన ఈ వెబ్ సైట్ కి నాంది పలికింది. ఉద్యోగ రీత్యా , చదువుల రిత్యా చాలామంది మా ఉరు నుండి విదేశాలకి, దేశంలో ఉన్న పలు ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ఏ దేశమేగినా మాతృభూమి పై మమకారం మాత్రం అందరికీ ఉంటుంది. తమ పిల్లలకి తాము పుట్టిన ఊరు గురించి చెప్పటం ప్రతి తల్లిదండ్రులు చేసే పని.కాని ఇంకా సమగ్రంగా కళ్ళకి కట్టినట్లు చూపించాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేది ఇప్పటి తరానికి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది అవ్వాలి. అప్పుడే అది వారికి చేరుతుంది.దానికి నేను ఎంచుకున్న మార్గం ఇంటర్నెట్. అప్పటికి అసలు గ్రామానికి ఒక వెబ్ సైట్ అనేది ఎవరి ఊహకి అందనిది.ప్రతి సంక్రాంతి కి సొంత ఊరికి వెళ్ళటం అనేది గ్రామంలో ఉన్న యువకులకి అలవాటు. ఏ పండక్కి వచ్చినా రాకపోయినా సంక్రాంతికి మాత్రం అందరూ వస్తారు. ఆ నాలుగు రోజులు ఊరంతా సందడే. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఎక్కడెక్కడో ఉండే చిన్ననాటి స్నేహితులంతా ఆత్మీయంగా కలుసుకునే సందర్భం.2009 జనవరిలో సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు ఈ ఆలోచన వచ్చింది.ఊరికి దూరంగా ఉండే ప్రవాసులకి గ్రామం లో ఉండే సామాజిక , రాజకీయ అంశాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉంటే వారు గ్రామానికి మరింత చేరువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ వారికి తెలుస్తాయి.ఏదైనా వితరణ అవసరం అయినపుడు ఎవరైనా త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది.ఇది మా మొదటి లక్ష్యం.  

అదీ కాక ఘంటసాల గ్రామం పురాతన బౌద్ధ క్షేత్రం. పురావస్తు శాఖ దీనిని అధికారికంగా ఎప్పుడో ప్రకటించింది. ఇప్పటికీ ఎన్నో అవశేషాలు, శతాబ్దాల నాటి నిర్మాణాలు గ్రామంలో కనపడతాయి.వ్యవసాయ క్షేత్రాల్లో, ఇల్లు కట్టడం కోసం పునాదులు తీసినపుడో శిల్పాలు, శాసనాలు ఇప్పటికీ బయట పడుతూ ఉంటాయి.ఈ భూమండలంలోనే ఎక్కడా లేని విధంగా శివ పార్వతులు ఏక పీఠంపై కొలువున్న  2000 ఏళ్ల నాటి జలధీశ్వరాలయం మా గ్రామంలోనే ఉంది.ఇది జగమెరుగని సత్యం. అమరావతి లోని బౌద్ధ స్తూపం కంటే పురాతనమైన బౌద్ధ క్షేత్రం ఘంటసాల లోనే ఉంది. గ్రామం లో దొరికిన శిల్పాలన్నీ పురావస్తు శాఖ మ్యూజియం నిర్మించి అందులో ఉంచారు.ఇవన్నీ తగిన ప్రచారానికి నోచుకోక మరుగున పడ్డ మాణిక్యంగా ఘంటసాల మిగిలిపోయిందనే ఆవేదన మా గ్రామస్తుల్లో ఉంది.మా ఊరి గతం ఎంత ఘన కీర్తి కలదైనా, చరిత్రకి సంభందించిన సాక్ష్యాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా అవి భావి తరాలకి చేరట్లేదన్నది నిర్వివాదాంశం.గ్రామంలో పుట్టిన చాలామందికే ఈ చరిత్ర తెలియదు. ఇక మిగతా వాళ్ళకేం తెలుస్తుంది. అందుకే మా గ్రామంలో మూలాలున్న ప్రతి కుటుంబానికి, అమెరికాలో పుట్టి పెరిగిన వారి వారసులకి ఈ చరిత్ర తెలియాలంటే ఎప్పటికీ మాసిపోని విధంగా దీనిని భద్ర పరచాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ వెబ్ సైట్ అందుకు వేదికగా ఉండాలి.వెబ్ సైట్ కి మేమెంచుకున్న లక్ష్యాల్లో ఇది రెండవది.  
ఈ చరిత్ర అంతా పొందు పరచాలంటే, ఈ విషయాలన్నిటికీ ఒక ప్రామాణికత కావాలి. చిన్నపుడు ఘంటసాల చరిత్ర అనే ఒక పుస్తకం ఉందని విన్న గుర్తు.మా అన్వేషణ ముందుగా ఆ పుస్తకం కోసం మొదలైంది. ఎన్నో ప్రయాసల అనంతరం మా పొరుగు గ్రామంలో ఉన్న లైబ్రరీలో శిధిలావస్థలో ఉన్న 1947 నాటి ఘంటసాల చరిత్ర పుస్తకం ఒకే ఒక్కటి దొరికింది.ఇది రాసిన వ్యక్తి శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. వారి వారసులు కాని సంభందీకులు కాని ఎవరూ గ్రామంలో లేరు. 65 ఏళ్ల నాటి ఆయన దూర దృష్టికి నేను చలించిపోయాను. సమాచారం అంతగా లేని రోజుల్లో ఎంతో పరిశోధించి 500 పేజీల గ్రంధాన్ని రాయటానికి ఆయన పడ్డ తపన, కష్టం ముందు మేము చేసే ఈ వెబ్ సైట్ నథింగ్ అనిపించింది.ఆ భాష అంతా ఆనాటి వాడుకలో ఉండటంతో అర్ధం చేసుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.అది చదివాక ఈ వెబ్ సైట్ ని ఆయనకే అంకితం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను.హైదరాబాదులో ఉన్న వారి వారసుల చిరునామా కనుక్కుని వారి దగ్గర అనుమతి తీసుకున్నాం. మేము వారిని కలిసి ఈ ప్రతిపాదన చెప్పినపుడు వారు పొందిన సంతోషం, ఇచ్చిన సహకారం మరువలేనిది. ఇన్నేళ్ళ తర్వాత తమ తాత గారికి ఈ తరం గ్రామస్తులు ఇచ్చిన అతి గొప్ప నివాళిగా వారు భావించారు. ఇప్పుడు మా మూడో లక్ష్యం ఈ పుస్తకాన్ని మళ్లీ పునర్ముద్రించి గ్రామంలో ఇంటింటికి అందించటం.

ఈ రాష్ట్రంలో తొలి శాసన మండలి చైర్మన్ గా పని చేసిన శ్రీయుతులు గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు మా గ్రామస్తులే.అప్పట్లోనే కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన మేధావి. 1980 తోనే ఆయన శకంతో పాటు,ఆయన కూడా తన జీవన ప్రయాణాన్ని ముగించారు. ఇది చాలామందికి తెలియని విషయం. స్వతంత్ర పోరాటంలో, సహాయ నిరాకరనోద్యమానికి మద్దతుగా 1926 లో ఎన్నికలలో ఒక్క ఓటు కూడా వెయ్యకుండా ఖాళీ బాలట్ బాక్సులు పంపిన ఏకైక గ్రామం ఘంటసాల. దీనికి నాయకత్వం వహించింది శ్రీ గొట్టిపాటి బ్రహ్మ్మయ్య, కిసాన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (ఘంటసాల చరిత్ర రచయిత).అప్పట్లో ఇదొక సంచలనం. ప్రతి సంక్రాంతికి కవితా గోష్టులు జరిగేవి, పలువురు రచయితలు కాళోజి నారాయణ రావ్, సంజీవ దేవ్, తదితరులు ఆ గోష్టులలో పాల్గొనేవారు. ఆంధ్రా బాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య, ఆచార్య ఎన్ జి రంగా ప్రభ్రుతులు ఎప్పుడూ గ్రామంతో అనుభంధం కలిగి ఉండేవారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి గ్రామం అంటే ఎంతో అభిమానం.ఘంటసాల లో దొరికిన శిల్ప సంపద గురించి, పారిస్ లో ఉన్న ఘంటసాల శిల్పాలని గురించి ఆంధ్ర ప్రజానీకానికి తెలియజేసింది ఆయనె. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ లో ఉన్న మ్యుజియం కి వెళ్ళారు. కృష్ణా పత్రిక ముట్నూరి కృష్ణారావు గారు ఘంటసాల పురాతన వైభవం గురించి పలు వ్యాసాలు ప్రచురించారు.ఈ తరం మరిచిపోయిన ఈ అరుదైన వ్యక్తులు, ఘటనల గురించి ఈ తరానికి చెప్పాలి అనేది మా నాలుగో లక్ష్యం. 


1962 లోనే అమెరికా కి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డ మా గ్రామస్తులు శ్రీ గొర్రెపాటి రంగానాధబాబు గారు నెలకొల్పిన గొర్రెపాటి విద్యా ట్రస్ట్ మా సంకల్పానికి స్ఫూర్తి. ఈ ట్రస్ట్ ద్వారా పలువురు పేద విద్యార్ధులకి ప్రతి ఏటా స్కాలర్ షిప్ ఇస్తారు. గ్రామంలో పలు మౌలిక సదుపాయాల కోసం ఏటా కొన్ని లక్షలు వెచ్చిస్తారు. ఇప్పటిదాకా 2 కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారా అందించారు.అంతేకాక గ్రామ అభివృద్దికి పలువురు ఎన్ ఆర్ ఐ లు అందించిన వితరణలు గ్రామాభివృద్ధి కి ఎంతో ఉపయోగపడుతున్నాయి. స్కూల్ భవనాలు, దేవాలయాలు, వెనకబడిన వర్గాలకి మరుగు దొడ్ల సదుపాయం ఈ విరాళాల ద్వారానే జరిగాయి. ​​ స్వాతి పత్రిక అధినేత శ్రీ వేమూరి బలరాం గారు మా గ్రామస్తులే.జలదీస్వరాలయ అభివృద్దికి ఆయన అందించిన ఆర్ధిక సహకారం మరువలేనిది. ఐఏఎస్ అధికారిణి శ్రీమతి వేమూరి ఉషారాణి మా గ్రామం హైస్కూలు లోనే చదువుకున్నారు. మా పొరుగు గ్రామం తాడేపల్లిలో ఒక వృద్ధాశ్రమం ఉంది. అది చాలామందికి తెలియదు.దీని ద్వారా వేమూరి రాంబాబు అనే అయన సేవ చేస్తున్నారు. ఇది కూడా మాకు స్ఫూర్తినిచ్చిన అంశం. కాని ఇవన్నీ అందరికీ తెలిస్తే ఇంకొందరు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకి వస్తారనే ఆలోచన మరో అంశం. అందుకే గ్రామంలో అభివృద్దికి ఎవరు సహకరించినా అది అందరికీ తెలియాలి.ఇది మా ఐదో లక్ష్యం. 

సగటున ఇంటికొకరు మా గ్రామం నుండి విదేశాల్లో స్థిరపడ్డారు.ఇంట్లో జరిగే ఫంక్షన్లు, బంధువుల పెళ్లిలకి రాలేని పరిస్థితి. అందుకే ఈ వేదిక ద్వారా వారు కోరుకుంటే ప్రతి కార్యక్రమం లైవ్ లో అందించాలనే ఆలోచన మరోటి. దీనికి గ్రామంలో ఉండే వీడియొ గ్రాఫర్ల సహాయం తీసుకున్నాం. వారికి దీనిలో ఉండే సాంకేతిక అవసరాలని తెలియ చెప్పటం ద్వారా తద్వారా వారికి కలిగే లాభం కూడా చెప్పటంతో మా పని సులువు అయ్యింది. ఇప్పుడు ఊర్లో అన్ని పెళ్లి వీడియొ పాకేజిల్లో వెబ్ సైట్ లో లైవ్ అనేది ఒక భాగం. గ్రామంలో జరిగిన దేవాలయ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల వీడియో లన్నీ ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో ఉండాలి అనేది మా ఆరో లక్ష్యం. 


ఇక గ్రామంలో అందరి ఫోన్ నంబర్లు, పేరొందిన ప్రముఖుల వ్యాసాలు, న్యూస్ క్లిప్పింగ్లు ఎప్పటికప్పుడు అప్లోడ్ అయిపోతుంటాయి. ఈ లక్ష్యాలతో మొదటి అడుగు ని ప్రారంభించాం. ముందుగా గ్రామంలో ఉన్న అన్ని ప్రాంతాలని ఫోటో షూట్ చేశాం. అందుబాటులో ఉన్న ప్రవాసుల ఈమెయిలు , ఫోన్ నంబర్లు సేకరించటం మొదలైంది. నాతో పాటు చదువుకున్న చిన్న నాటి మిత్రులు ఆర్ధికంగానూ నైతికంగానూ మద్దతు నిచ్చారు. 

అసలు నన్ను ఒక్కసారి కూడా చూడని, నేనెవరో కూడా తెలియని మా ఊరు ఎన్ ఆర్ ఐ లు ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలిచారు. ప్రతి విషయం ప్రామాణికంగా ఉన్న తర్వాతనే వెబ్ సైట్ లో పెట్టాలి అనుకున్నాం. ఇక విషయ సేకరణకి అన్వేషణ ప్రారంభం అయ్యింది. 80 వ పడిలో ఉన్న పెద్దలు, కాకలు తీరిన కమ్యునిష్టులని కలుసుకున్నాక వారి దగ్గర తెలుసుకున్న విషయాలు ఏ యూనివర్సిటీ లోనూ నేను చదువుకోని పాఠాలు. గ్రామం నుండి శ్రీ గొర్రెపాటి రామ కృష్ణ గారు, శ్రీ వేమూరి విశ్వేశ్వర రావు గారు విషయ సేకరణలో తమ అనుభవాలని జోడించారు. గ్రామం వీడి సిటీల్లో తమ పిల్లల దగ్గర బతుకు వెళ్ళదీస్తున్న పెద్దలని కలుసుకోవటానికి హైదరాబాదు, విజయవాడ లని జల్లెడ పట్టాను. వారు చెప్పిన ప్రతి విషయాన్ని సెల్ ఫోనులో రికార్డు చేసుకుంటూ అన్నిటినీ క్రోడీకరిస్తూ ఒక్కొక్కటిగా వెబ్ సైట్ లో పేర్చుకుంటూ వచ్చాం. గ్రామంలో చాలామందికి అసలు ఇది అర్ధం కాలేదు. వారికి సవివరంగా చెప్పటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.నా మిత్రుడు కి వెబ్ సైట్ డిజైనింగ్ కంపెనీ ఉండటంతో ఎప్పటికప్పుడు వెబ్ సైట్ నిర్మాణం నాకు సులువు అయ్యింది. 2009 లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తవటానికి పట్టిన సమయం సరిగ్గా సంవత్సరం. 2010 సంక్రాంతికి గ్రామ నడిబొడ్డున వందలాది మంది గ్రామస్తుల మద్య సగర్వంగా ప్రారంభించాం. అసలు వెబ్ సైట్ ఏంటో చూద్దాం అని వచ్చిన వారందరికీ దాని ఆవశ్యకతని వివరించటంలో మేము సఫలీక్రుతమయ్యాం. 

​​నేను ఉద్యోగరీత్యా ​​పలు దేశాల్లో పర్యటిస్తూ ఉండటంతో నాకు ఎప్పటికప్పుడు న్యూస్ తెలిసే అవకాశం లేదు. అందుకే గ్రామంలోనే స్థిరపడ్డ నా సహాధ్యాయి మొవ్వ కిరణ్ కుమార్ అందుకు ఆసరాగా నిలిచాడు. గ్రామంలో జరిగే విషయాలని ఎప్పటికప్పుడు తనే సమాచారం ఇస్తుంటాడు. ఫోటోలని గ్రామంలో ఉండే ఫోటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళే పంపిస్తుంటారు.

సంతృప్తి 

2010 నుండి ఇప్పటిదాకా జరిగిన విశేషాలన్నీ వెబ్ సైట్ లో పొందు పరిచాం. మా గ్రామస్తులతో పాటు మిగతా వారంతా కలిపితే ఇప్పటికి 80 వేలమంది మా వెబ్ సైట్ ని దర్శించారు. దీని స్ఫూర్తితో చుట్టు పక్కల గ్రామాల వారు కూడా తమ గ్రామాలకి వెబ్ సైట్ ఏర్పాటు చేసుకున్నారు. ​వెబ్ సైట్ పెట్టిన ఏడాది కల్లా ఘంటసాల చరిత్ర పుస్తకాన్ని రచయితా కుటుంబ సభ్యుల సహకారంతో 2000 కాపీలు పునర్ముద్రించి ​గ్రామంలో అందించాం. 

​​హైస్కూల్ లో సైన్స్ లాబ్ కోసం మేము పెట్టిన విన్నపానికి గ్రామానికి చెందిన శ్రీలత ఆ సౌకర్యాన్ని కల్పించారు. రామాలయ నిర్మాణానికి ​అమెరికా నుండి ​ గొర్రెపాటి మాధవి స్పందించారు. ఎంతో మంది ఈ వ్రుద్దశ్రామాన్ని సందర్శించి తమ వితరణ ని అందించారు.​గ్రామంలో రుద్రభూమి ఆధునికీకరణ అని పెట్టగానే 25 లక్షల రూపాయల ప్రవాసాంధ్రుల విరాళాలు కమిటీ కి అందాయి. గ్రామ దేవత దేవాలయ ముఖద్వారానికి విరాళాలు వెల్లువెత్తాయి. ​

గ్రామంలో జరిగిన దాదాపు 20 వివాహాలు లైవ్ ద్వారా అందించాం. గ్రామంలో ఏది జరిగినా కొద్ది గంటల్లోనే అందరికీ తెలిసిపోతుంది. మొన్న జరిగిన పంచాయతి ఎన్నికల అప్ డేట్స్ ప్రతి నిముషానికి అందించాం. 90 ఏళ్ల నాడు మా గ్రామం నుండి పారిస్ మ్యుజియం కి తరలిపోయిన బౌద్ధ విగ్రహాలని నేను పారిస్ వెళ్ళినపుడు ఫోటోలు వీడియో ద్వారా అందించటం మరువలేని అనుభూతి. యవ్వనంలో కవిత్వం రాయాలి, వృద్ధాప్యంలో విమర్శలు రాయాలి. నేనింకా యవ్వనంలోనే ఉన్న కాబట్టి ఈ వెబ్ సైట్ లో విమర్శలు వివాదాస్పద విషయాలు ఉండవు. అందుకే నాలుగేళ్ళు గడిచినా ఇప్పటికీ ఒక్క విమర్శకి కూడా తావివ్వలేదు. మున్ముందు మరిన్ని ఉన్నత లక్ష్యాలతో సాగాలన్నదే మా అభిమతం.
 
Rajesh Vemuri
Editor