శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి వ్యాసంBack to list

  ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ , రచయిత ,కవి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు IAS గారు ఘంటసాల గ్రామాన్ని సందర్శించి నప్పుడు ఆయన అనుభూతిని పంచుకున్న వ్యాసం

ఆ సాయంకాలం శ్రీకాకుళం నుంచి కూచిపూడి వెళ్తూ మధ్యలో ఘంటసాల వెళ్ళాం. ఘంటశాల ఒకప్పుడు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అని విని ఉండటం వల్ల గతంలో కూడా ఒకసారి వెళ్ళానుగాని, అప్పుడు ఏమి చూసానో గుర్తులేదు. కానీ అక్కడొక మహాచైత్యం ఉందని ఇప్పుడు మాత్రమే తెలిసింది. ఆ చైత్యంతో పాటు అక్కడొక పురావస్తు ప్రదర్శన శాల కూడా ఉంది.

కాని ఆ మూజియం ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. అక్కడి సిబ్బందిని మా కోసం కొద్ది సేపు తెరవగలరా అని అడిగాం గాని, వాళ్ళు తెరవలేమనే చెప్పారు. ఇక ఆ చైత్యం గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటారా అని విచారిస్తున్నలోపలనే ఒక పెద్ద మనిషి చకచకా వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నారు. ఆయన గొర్రెపాటి రామకృష్ణ. కృష్ణా జిల్లా పరిషత్తుకి ఒకప్పుడు వైస్ ఛైర్మన్ గా పనిచేసారు. ఆయన మా కోసమే అక్కడ వేచి చూస్తున్నట్లుగా మమ్మల్ని స్వాగతించి, ఆ చైత్యం దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం వివరించారు. ఆ చైత్యం చుట్టూ ప్రదక్షిణ పథంలో మమ్మల్ని కూడా ఒక చుట్టు తిప్పించారు. మాతో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఆవరణలోనే బోధివృక్షపు స్ఫూర్తితో నాటిన ఒక రావిచెట్టుని కూడా చూపించి అక్కడ కొద్దిసేపు కూచోబెట్టారు.

అంతవరకూ ఎవరేనా సహకరించగలరు. కానీ ఆ రోజు ఆయన చేసిన ఉపకారం ఘంటశాల లో నెలకొన్న జలధీశ్వర స్వామి దేవాలయానికి తీసుకువెళ్ళి చూపించడం. అది మామూలు దేవాలయం కాదని అక్కడ అడుగుపెట్టగానే తెలిసింది. అక్కడి గోడల మీద ఆ దేవాలయ ప్రాశస్త్యాన్ని వివరించే సమాచారం పటం కట్టిపెట్టారు. అందులో కొన్ని పేపరు క్లిప్పింగులు కూడా ఉన్నాయి. వాటిలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఇచ్చిన వివరణలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆ జలధీశ్వరుడు అక్కడ రెండువేల ఏళ్ళుగా నెలకొని ఉన్నాడు. శివపార్వతులిద్దరూ ఒకే అర్చావేదికమీద ప్రతిష్టితులై పూజలందుకుంటున్న ఏకైక క్షేత్రం అదేనని కూడా అక్కడ రాసి ఉంది. ఆ పక్కనే ఒక శాసన స్తంభం కూడా ఉంది. కనీసం గత వెయ్యేళ్ళుగా నాలుగైదు దాన శాసనాలు ఆ స్తంభం మీదనే చెక్కి ఉన్నాయి. ఆ శాసనపాఠాలు అనువాదంతో సహా ఒక బోర్డు మీద అక్కడ రాసిపెట్టారు. ఆ శాసనాలు వివిధ కాలాల్లో ఆ దేవాలయ నిర్వహణకోసం, ధూపదీప నైవేద్యాల కోసం కొందరు భక్తులు సమర్పించిన దానాల్ని వివరిస్తున్నాయి.

రామకృష్ణ గారు అక్కడ దేవాలయంలో మాకోసం పూజలు చేయించారు. ఆ తరువాత శేషవస్త్రాలూ, వేదాశీస్సులూ అందించారు. అంతా కలిసి ఫొటోలు తీసుకున్నాం. ఊహించలేని విషయం, ఇంత దగ్గరలో ఇంత ప్రాచీన క్షేత్రం ఒకటి ఉందనే నాకిప్పటిదాకా తెలియదు.

ఘంటసాల అనే పేరు నేడు మనకొక సుమధుర గాయకుడి ఇంటిపేరుగా మాత్రమే తెలుసు. ఆ గాయకుడి నిలువెత్తు కాంస్య విగ్రహం కూడా ఆ ఊళ్ళో ప్రతిష్టించి ఉంది. కాని, ఘంటశాల నిజానికి బౌద్ధ నామవాచకం. దాని ప్రాచీన నామం 'కంఠక శైల'. గ్రీకు చరిత్రకారుడు, భూగోళ శాస్త్రజ్ఞుడు టాలెమీ దాన్ని 'కొంటకశ్శల' అన్నాడు. ఆ పేరులో 'కంఠకం' సిద్ధార్థుడి అశ్వం పేరు. సిద్ధార్థుడు ఇల్లు వదిలిపెట్టిన అర్థరాత్రి ఆయన్ని రాజపరివారం నుంచి అడవికి చేర్చిన అశ్వమది. ఆ రాత్రి ఆ గుర్రం సిద్ధార్థుణ్ణి ఎక్కించుకుని పరుగులు తీస్తున్నప్పుడు ఆ డెక్కల చప్పుడు వినిపించి నగరం ఎక్కడ నిద్రమేల్కొంటుందో అన్ని గంధర్వులూ, విద్యాధరులూ ఆ డెక్కల కింద చేతులు పెట్టారట. ఆశ్చర్యం, రెండువేల అయిదు వందల ఏళ్ళ తరువాత కూడా, అక్కడ ఘంటసాలలో, ఆ మనోహరఘట్టాన్ని మా కోసం అక్కడి స్థానికులు మరొకసారి స్మరిస్తున్నారు.

గుండెని బెంగటిల్లచేసే ఆ ఘట్టాన్ని అశ్వఘోషుడు 'బుద్ధ చరిత' కావ్యంలో ఇట్లా వర్ణించాడు:

~
అథ స పరిహరిన్నిశీథ చండం పరిజనబోధకరం ధ్వనిం సదశ్వః
విగత హనురవః ప్రశాంతహేషశ్చకిత విముక్త పదక్రమో జగామ.

కనకవలయ భూషిత ప్రకోష్ఠః
కమలనిభైః కమలానివ ప్రవిధ్య
అవనత తన వస్తతోస్య యక్షా
శ్చకిత గతైర్ధధిరే ఖురాన్ కరాగ్రైః (5:80-81)

(అప్పుడు ఆ సదశ్వం తన చప్పుడంతా అణగించుకుంది. లేకపోతే ఆ రాత్రంతా పరివారం నిద్రలోంచి లేచిపోయి ఉండేవారు. దాని దవడలు చప్పుడు చేయడం మానేసాయి. సకిలించడం ఆపేసింది. జాగ్రత్తగా ఒక్కొక్క అడుగే వేసుకుంటో బయటకు అడుగుపెట్టింది.

అప్పుడు యక్షులు సాష్టాంగపడి ఆ నేల మీద తమ చేతులు చాచి ఆ గిట్టల కింద అంగుళుల్ని ఆనించారు. వాళ్ళ ముంజేతులు బంగారు కడియాలతో, వాళ్ళ అరచేతులు తామరపువ్వుల్లాగా అలరారుతూ పులకిస్తున్నాయి. ఆ దృశ్యం చూస్తుంటే వాళ్ళు ఆ గుర్రం పాదాలకింద తామరపూలు పరుస్తున్నారా అన్నట్టుంది.)

~

సిద్ధార్థుణ్ణి అడవిలో వదిలిపెట్టాక, అతడి రథ సారథి చెన్నుడు, ఆ అశ్వం కంఠకమూ ఆయన్నుంచి సెలవు తీసుకునే దృశ్యం బుద్ధుడి జీవితంలోనూ, బౌద్ధ సాహిత్యంలోనూ కూడా మరవలేని ఒక అపురూపమైన దృశ్యంగా నిలబడిపోయింది. మిమ్మల్నిక్కడ ఈ అడవిలో ఇట్లా ఒంటరిగా వదిలిపెట్టి నేను నగరానికి తిరిగివెళ్ళిన తరువాత మీ నాన్నగారికీ, యశోధరకీ ఏమని చెప్పాలి అని చెన్నుడు అడిగినప్పుడు అశ్వఘోషుడు ఆ దృశ్యాన్నిట్లా అక్షరబద్ధం చేసాడు:

~

'కపిలవస్తు పరివారానికి నా మాటగా నువ్విట్లా చెప్పు: ఆయన కోసం మీరు విలపించడం మానండి. ఆయన సంకల్పం వినండి. ఆయనేమంటున్నాడంటే, పుట్టుకనీ, చావునీ జయించి నేను తొందరలోనే నగరానికి తిరిగివస్తాను, లేదా ఆ ప్రయత్నంలో సఫలుణ్ణి కాకపోతే ఇక్కడే నశిస్తాను.'

ఆ మాటలు వింటూనే ఆ అశ్వరాజం ఆయన చరణాల్ని నాకుతూ కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టింది. ఒక అరచేత చక్రం మరొక అరచేత శంఖం గుర్తులుగా కలిగిన ఆ రాకుమారుడు ఆ కంఠకాన్ని దగ్గరగా తీసుకుని దాని మెడమీద చేత్తో రాపాడుతూ, దాని జూలు దువ్వుతూ, సమవయస్కుడైన మిత్రుడితో మాట్లాడుతున్నట్టుగా ఇట్లా అన్నాడు:

కంఠకా, కన్నీళ్ళు విడవకు. మంచి గుర్రం ఎట్లా ఉంటుందో నువ్వొక ఉదాహరణగా నిలబడ్డావు. ఓపిక పట్టు. నువ్వు చూపించిన ఈ కష్టానికి త్వరలోనే ఫలం సిద్ధిస్తుంది...'

అప్పుడు తన రాకుమారుడు వెలిసిపోయిన చీరలు కట్టుకుని, భూమిని పరిపాలించాలన్న కోరిక వదిలిపెట్టి, తపసు చేసుకోవాలన్న కోరికతో అట్లా అడవిలోకి అడుగుపెట్టే దృశ్యం చూసి ఆ సారథి రెండు చేతులూ పైకి చాచి బిగ్గరగా విలపిస్తూ కుప్పకూలిపోయాడు.

మళ్ళా మరొకసారి వెనక్కి చూస్తూ అతడు బిగ్గరగా రోదిస్తూ ఆ కంఠకాన్ని చేతుల్లోకి అందుకున్నాడు. మళ్ళా గొప్ప నిస్పృహతో మరింత రోదించాడు. మరింత మరింత రోదించి నగరం బాట పట్టాడు. కాని వెనుదిరిగింది అతడి దేహమే తప్ప మనస్సు కాదు.

కొన్నిసార్లు అతడు ఆలోచనలో పడి ఆగిపోతున్నాడు. కొన్ని సార్లు ఏడుస్తున్నాడు. కొన్ని సార్లు తొట్రుపడుతున్నాడు, కొన్నిసార్లు పడిపోతున్నాడు. తన విధినిర్వహణ బరువు కింద తన దుఃఖాన్ని అణచుకుని అతడు ఆ దారమ్మట పూర్తిగా దారితప్పినవాడిగా ఏమేమో చేస్తో ముందుకు సాగుతున్నాడు.' (6:51-55, 66-68)

~

బుద్ధుడి జీవితంలోంచీ, బౌద్ధ సాహిత్యంలోంచీ ఎందరో ఎన్నో పేర్లు పెట్టుకుని ఉండవచ్చు. ఎన్నో నగరాలు, భవనాలు, సమావేశమందిరాలు బౌద్ధ పరిభాషను అలంకారంగా ధరించి ఉండవచ్చు. కానీ, ఆ విధేయ రాజాశ్వం పేరు మీద నాకు తెలిసి రెండే పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి బుద్ధచరిత మహాకావ్యం రాసిన అశ్వఘోషుడు. రెండవది ఇప్పుడు ఘంటశాలగా మనం పిలుస్తున్న కంఠక శైల.

ఆ పేరులో శైల దేన్ని సూచిస్తున్నది? శైల అంటే పర్వతమే కాని, నేరుగా ఆ వాచ్యార్థం కాదు మనం చూడవలసింది. ఒకప్పుడు బుద్ధుడి నిర్వాణం తర్వాత, బుద్ధుడి బోధల సారాంశం ఏమై ఉండవచ్చునో చర్చించుకోవడానికి బుద్ధసంగీతులు నిర్వహించారు. అందులో రెండవ బుద్ధ సంగీతిలో మహాసాంఘికులనే ఒక వర్గం బుద్ధుడి బోధనలు కేవలం వ్యక్తి విముక్తిని మాత్రమే సూచించడం లేదనీ,మొత్తం సంఘమంతా కూడా విమోచన చెందాలన్నదే బుద్ధుడి ఆశయమనీ వాదించారు. ఇప్పుడు చరిత్రకారులు ఏమి చెప్తున్నారంటే, ఆ మహాసాంఘికులు ఆంధ్రదేశానికి చెందిన బౌద్ధులనీ, అది కూడా కృష్ణానదీ పరీవాహకప్రాంతానికి చెందిన శాఖ అనీ. వాళ్ళల్లో కూడా మళ్ళా నాలుగైదు శాఖలున్నాయి. అందులో అపర శైల శాఖ అనీ, పూర్వ (ఉత్తర) శైల శాఖ అనీ రెండు ముఖ్య విభాగాలున్నాయి. అందులో పూర్వశైల శాఖకి చెందిన బౌద్ధ గణం ఘంటశాల ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారనీ, వారి పేరు మీద కంఠక శైలలోని 'శైల' వచ్చిందనీ ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్నారు.

అంటే మహాసాంఘికులు మధ్య ఆంధ్రదేశంలో పరుచుకున్న వివిధ పర్వతాల మీద తమ ఆరామాలు కట్టుకుని ఎవరి ఆలోచనకు అనుగుణంగా వారు బుద్ధుడి బోధనల్ని మననం చేస్తూండేవారని మనం భావించవచ్చు. అందుకనే బౌద్ధధర్మంలోని పద్ధెనిమిది శాఖలూ కూడా ఒకప్పుడు అమరావతి లో ఉండేవారని కూడా మనకు తెలుస్తున్నది.

బౌద్ధం గురించి మాట్లాడేటప్పుడు భారతీయ బౌద్ధం, చీనా బౌద్ధం, జపనీయ బౌద్ధం అంటో వివరించడం పరిపాటి. కాని ఆంధ్ర బౌద్ధం అనే నాలుగవ ముఖ్యవిభాగం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అందులోనూ కృష్ణానదీ పరీవాహకప్రాంతంలోని బౌద్ధమే లేకపోతే మహాయానం అంత ప్రాచుర్యంలోకి వచ్చి ఉండేది కాదు. ఆంధ్రదేశంలో కూడా ఉత్తరాంధ్రలోని బౌద్ధం థేరవాదాన్ని అనుష్టిస్తూండగా, కృష్ణాప్రాంతంలోని బౌద్ధం మహాయానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. అసలు కృష్ణాతీరపు మట్టిలోనే ఈ సామాజిక స్పృహ అంతర్భాగమని అనుకోవలసి ఉంటుంది. ఇరవయ్యవశతాబ్దంలో ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టు భావజాలం మళ్ళా ఈ ప్రాంతంలోనే ప్రాచుర్యం పొందడమే ఇందుకు నిరూపణ.

ఘంటశాల ఒకప్పుడు ముఖ్యరేవుపట్టణమనీ వర్తకులు అటు బౌద్ధాన్నీ, ఇటు జలధీశ్వరస్వామినీ కూడా సమానంగా కొలిచేవారనీ శాసనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఆ ఊరు వెళ్ళి వచ్చి రెండు వారాల పైనే అయ్యింది గాని, రెండువేల ఏళ్ళ కిందట పూర్వసాగర తీరంలో ఓడలు లంగరు వేసినప్పుడు రోమన్ వర్తకులూ, యాత్రీకులూ రేవు దిగి ఘంటశాలలోకి నడిచి వస్తున్న దృశ్యాలే ఇంకా నా కళ్ళముందు కదలాడుతున్నాయి. అక్కడి మహాచైత్యానికి తన దానాలతో నిర్మిస్తున్న ప్రదక్షిణ ప్రాకారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఉపాసిక బోధిశ్రీ నా కళ్ళముందు కనిపిస్తున్నట్టే ఉంది.

 

 

Dated : 02.08.2020