గొర్రెపాటి విద్యాట్రస్టుBack to home

 

  శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయ భాస్కరమ్మ దంపతులు

ప్రతిభ ఉండి చదువుకోవటానికి తగిన ఆర్ధికస్తోమత లేని విధ్యార్ధులను ప్రోత్సహించాలనే సదుద్దేశం తో నెలకొల్పబడిన సంస్థ  శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యాట్రస్టు.మన గ్రామంలోనే పుట్టి ఇక్కడే చదువుకుని ఉన్నతవిద్యాభ్యాసానికై అమెరికాకి పయనమై అక్కడే స్థిరపడిన మన ఊరి వ్యక్తి శ్రీ గొర్రెపాటి రంగనాథబాబు గారు పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలనే తపన తో కుటుంబ సభ్యుల సహకారంతో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరిట 1987 లో ఈ ట్రస్టు ని నెలకొల్పారు.అప్పట్లో లక్ష రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వాటి పై వచ్చే వడ్డీ తో హైస్కూలు విధ్యార్ధులకు బహుమతులు మరియు మెరిట్ స్కాలర్ షిప్ లు ఇవ్వటం మొదలు పెట్టారు.అలా మొదలైన ఈ ట్రస్టు ప్రస్థానం తదనంతరం అనేక కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది విధ్యార్ధులకు ఆసరా నిస్తూ గ్రామప్రయోజనానికి విశేషం గా కృషి చేస్తొంది.

                                        కేవలం విద్యా సంభంధమైన విషయాలే కాకుండా గ్రామీణ పరిశుభ్రత మెరుగు పరచాలనే సంకల్పం తో స్వచ్చంధంగా మరుగు దొడ్లు నిర్మించుకునే వెనకబడిన తరగతుల వారికి ఆర్ధికసాయం అందించారు.శివారు గ్రామాల్లో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం,పాఠశాలల తరగతి గదుల నిర్మాణం చేపట్టి ఆయా గ్రామాల అభ్యున్నతి కి కృషి చేస్తున్నారు.అంతే కాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ లు,అర్హులైన వారికి వైద్యసాయం,వృద్ధాప్య పింఛన్ లు అందిస్తున్నారు.మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకొవాలనే సంకల్పం తో ప్రతి సంక్రాంతి పండుగ  కి ఎడ్ల పందాలు,మహిళలకు ముగ్గుల పోటీలు,యువత ని ఉత్సాహ పరిచేందుకు కబడ్డీ పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.ఇలా ఈ ట్రస్టు ప్రస్థానం లో మైలురాళ్ళు గా నిలిచిపోయే కార్యక్రమాలెన్నో ఉన్నాయి.

                                ఇవన్ని ఒక ఎత్తు అయితే ఇటీవలే నిర్మించిన బెడ్ రెగ్యులేటర్ ఈ ట్రస్టు కీర్తి కిరీటం లో ఒక కలికితురాయి.గుండేరు పై ఎలికలకుదురు గ్రామం దగ్గర నిర్మించిన ఈ ఆనకట్ట ,వృధాగా పోతున్న నీటిని నియంత్రించించి ఎగువున ఉన్న 6000ఎకరాల ఆయకట్టు కి నీరందిస్తుంది.ఘంటసాల గ్రామమే కాకుండా ఎగువన ఉన్న పాలెం,కొత్తపల్లి,తాడేపల్లి గ్రామాల రైతులకి కుడా ఇది ప్రయోజనకారిగా ఉంది.