​హరిజన దేవాలయ ప్రవేశంBack to list

 1932 సుబ్రహ్మణ్య షష్టి,

కృష్ణాజిల్లా ఘంటసాల సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల ఎద్దడి ఎక్కువగా ఉంది. గుడిలోపల భక్తులే , గుడి బయటా భక్తులే అస్పృశ్యులు బైట నుండే దేవుడికి దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతున్నారు.హరిజనదేవాలయ ప్రవేశం దేశంలోనే ముందుగా కృష్ణాజిల్లాలో ​ప్రారంభం అయ్యింది.ఇతర ప్రాంతాల్లో కన్నా మన జిల్లాలోనే ఎక్కువ దేవాలయల్లోకి హరిజనులని అనుమతించారు. త్యాగధనుల పుట్టిల్లు, బుద్ధుడి ప్రవచనాలని ఆచరించిన పుణ్యభూమి ఘంటసాల ఈ విషయంలో ఆదర్శంగా ఉండాలి ఈ సుబ్రమణ్యేశ్వర షష్టి రోజున హరిజనులని గుడి లోపలి వెళ్ళేలా అనుమతించండి అని అడిగారు వేముల కూర్మయ్య గారు.
ఆంధ్ర ప్రాంత హరిజన సేవా సంఘం కార్యదర్శి , హరిజన నాయకుడు , గాంధేయవాదిగా పేరుబడిన యువనేత వేముల కూర్మయ్య గారు హరిజన దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని కృషి చేస్తున్నారని , ఆయనే స్వయంగా దేవాలయప్రవేశం చేస్తున్నారని, వార్తా పత్రికలు కూడా రాసి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.అంగీకరించే వారి సంఖ్య బానే ఉంది కాని, హరిజనులని దేవాలయంలో చూడటం అనే అంశాన్ని జీర్ణించుకోలేని వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 
కాశీనాధుని వంశంలో , పరమనైష్టిక కుటుంబంలో పుట్టిన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు కూడా హరిజన సేవా సంఘ అధ్యక్ష భాధ్యతలు చేపట్టి ఊరూరా హరిజనులని దేవాలయాల్లోకి అనుమతించాల్సిందిగా ప్రచారం చెయ్యటం , ఆయన ప్రచురిస్తున్న ఆంధ్ర పత్రికలో కూడా దీనికి ప్రచారం కల్పించటం,సంస్కరణవాదులకి ఆనందం, సనాతనులకు ఆగ్రహం కలిగిస్తున్న అంశాలు. 
"మానవుని వెలిబెట్టిన, దేవుని వేలిబెట్టినట్లే" అని నినాదం ఇచ్చారు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు. 
ఘంటసాల సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయ ధర్మకర్త గొర్రెపాటి వెంకయ్య గారు అందరూ చెప్పేది వింటున్నారు. కానీ సంప్రదాయ విరుద్ధ నిర్ణయాలను తీసుకోవటానికి ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి. 
" ఈ రోజు షష్టి సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన రోజు. ఘంటసాల గ్రామంలో సగం మంది మనుషులుని అంటరాని వాళ్ళనే నెపంతో గుడిలోకి రానివ్వకపోవటం అన్యాయం. మేం కూడా ఈరోజున గుడిలోకి రాకుండా గుడి బయటనుండే హరిజనులతో కలిసి కొబ్బరి కాయ కొట్టి దేవుడిని ప్రార్ధించుకుంటాం " అన్నారు పురప్రముఖులు ఘంటసాల లక్ష్మీ నరసింహం పంతులు గారు.
"సంస్కరణలనేవి  ప్రతిఘటన లేకుండా సర్వజనామోదంగా ఉండాలి" అని వాదించారు ధర్మకర్త గొర్రెపాటి వెంకయ్య గారు.
నిజమే ! మేము కూడా ప్రజల్లోనుండే వస్తున్నాం .. హరిజనదేవాలయ ప్రవేశం అనే ఉద్యమం దేశ వ్యాప్తంగా నడుస్తోంది. దేశంలోని చాలా దేవాలయాలు చాలా భాగం ఈ ఉద్యమానికి తోడ్పడుతూ హరిజనులని అంగీకరిస్తున్నాయి అని కూర్మయ్య గారు వివరించారు. 
కాని మా ఊరి ప్రజలు అంగీకరించాలి కదా..? ఎదురు ప్రశ్నించారు వెంకయ్య గారు. నేను ఈ దేవాలయానికి ధర్మకర్త ని మాత్రమే. ప్రజలే దీని పోషకులు - దీని పోషకులని కాదని నేనే నిర్ణయమూ తీసుకోలేనని తన అశక్తతని వెల్లడించారు వెంకయ్య గారు. 
గాంధీ మహాత్ముడి పిలుపుని మీరు అర్ధం చేసుకోండి. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు చెబుతున్న దానిని మీరెందుకు కాదంటున్నారో తెలియటం లేదు అని కూర్మయ్య గారు నిరాశగా అన్నారు. 

ఒక పనిచేయండి ! ఘంటసాలలో జలదీశ్వరాలయం ఊరుమ్మడి దేవాలయంగా ఉంది. మీరు మొదట ఆ అదేవాలయంలో హరిజన ప్రవేశం చేయించండి. ఎటువంటి వివాదము లేకుండా నా దేవాలయాన్ని హరిజనులకి తెరిచే ఉంచుతాను. వ్యక్తిగతంగా నేను మీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను. కాని ధర్మకర్తగా నా పరిమితులు వేరు అని వెంకయ్య గారు తేల్చి చెప్పారు. 
కూర్మయ్యగారు విషయాన్ని ప్రజల్లో తేల్చుకోవటానికే నిర్ణయించారు. 
 
ఘంటసాలలో ప్రముఖులు , గాంధేయవాది , కాంగ్రెస్స్ నాయకులు గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు జైలులో ఉన్నారు. వారు వచ్చేలోగా కొంత ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. 
మళ్లీ వచ్చే షష్టి నాటికి హరిజనులు ఘంటసాల గ్రామంలో దేవాలయ ప్రవేశం చెయ్యకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ కవి పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు ఆవేశంగా ప్రకటించారు.
ఆరోజు షష్టి నాడు ఘంటసాలలో సంస్కరణ వాదులు ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం గుడి బయట హరిజనులతో కలసి కొబ్బరి కాయలు కొట్టారు. 
ఇలా గుడి బయట హరిజనులతో కలిసి కొబ్బరికాయలు కొట్టిన సంగతిని ఊళ్ళో అందరూ గమనిస్తున్నారు. మొత్తం మీద సంచలనం కలిగించాం అనుకున్నారంతా. 
రోజులు గడుస్తున్నాయి, గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు జైలు నుండి విడుదలయ్యాక ప్రజా చైతన్యం కలిగించే కార్యక్రమాలు మరింత ముమ్మరం అయ్యాయి. మరుసటి సంవత్సరం షష్టి కి ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఆరు నూరైనా - నూరు ఆరైనా ఈ షష్టి కి అనుకున్నది జరగపోతే జలదీశ్వరాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ కవి పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు ఆవేశంగా ప్రకటించారు.
 
సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయ ధర్మకర్త గొర్రెపాటి వెంకయ్య గారు మీరు సంతకాల సేకరణ చెయ్యండి. మెజారిటీ ప్రజలు అంగీకరిస్తే ఒక్క సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయమేమిటి - ఘంటసాలలో ఉన్న అన్ని దేవాలయాల్నీ తెరిపించేద్దాం అన్నారు. ఆరోజునుండి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైంది. రాత్రనక పగలనక తిరిగి ఇంటింటికి వెళ్లి ప్రతిఒక్కరినీ కలిసి సంతకాలు పెట్టించారు. 
బ్రాహ్మ్మలు , విశ్వబ్రాహ్మ్మలు ,వైశ్యులు మిగతా అన్ని కులాల వారూ సంతకాలు పెట్టారు. షష్టి కి ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఊళ్ళో అందరూ సంతకాలు చేసినట్లే అని దేవాలయ ధర్మకర్తలని పిలిచి చూపించారు గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు.సంతకాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. నూటికి 85 శాతం మంది అనుకూలంగానూ 15 శాతం మంది వ్యతిరేకంగా సంతకాలు చేశారని ప్రకటించారు బ్రహ్మ్మయ్య గారు.
రేపు సుబ్రహ్మణ్య షష్టి నాడు హరిజనులు కూడా దేవాలయ ప్రవేశం చెయ్యవచ్చని ఘనంగా ప్రకటించారు గొర్రెపాటి వెంకయ్య గారు. ముఖ్యంగా బ్రాహ్మ్మలు , విశ్వబ్రాహ్మ్మలు ,వైశ్యుల కుటుంబాలు ఎక్కువమంది అనుకూలంగా సంతకాలు చెయ్యటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు కూర్మయ్య గారు. 
1933 నవంబర్ 2 న మార్గశిర షష్టి. సుబ్రమణ్యేశ్వరస్వామి వారి ఉత్సవం కాశీనాధుని వీరమల్లయ్య గారు దగ్గరుండి జరిపిస్తున్నారు. చాలామందికి అదొక పుణ్య దినం.. ఎంతోకాలంగా సాటి మనుషుల్ని అంటరాని వాళ్ళుగా ముద్ర వేసి , కనీసం దేవుడికి దణ్ణం పెట్టుకోకుండా చేసిన అమానుషత్వానికి ఊర్లో ఆరోజు తెరబడ్తోంది. దేవుడు మైల పడిపోతాడని కొంతమందికి అదొక పీడకల. 
" కొన్ని శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న సనాతన ఆచారాల్ని కొందరు బొంట్లు - తమకు కీర్తి ప్రతిష్టలు రావాలని , పేపర్లలో ప్రచారం రావాలని ఈ వర్ణ సంకరానికి పాల్పడి మత ద్రోహం చేస్తున్నారు అని గొణిగారు జలధీశ్వరాలయం పురోహితులు ఘంటసాల సుబ్బయ్య గారు.
సుబ్బయ్య గారు ఆ మాట అంటునప్పుడు చాలామంది సనాతనులకు నిజమేననిపించింది. కలికాలం అనుకున్నారంతా. 
తెల్లవారితే షష్టి !
కూర్మయ్య గారి నాయకత్వాన హరిజనులు సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయంలో ప్రవేశించి , స్వామి సన్నిధిలో ప్రార్ధన చేసుకునే అవకాశం కోసం సన్నద్ధంగా నిలబడ్డారు. తెల తెలవారుతుండగానే డిప్యూటి కలెక్టర్ రాజారత్నం నాయుడు గారు పోలీసు బలగాల్ని వెంటబెట్టుకుని ఊర్లోకి వచ్చారు. కూర్మయ్య గారంటే ఎవరు ? అని ప్రశ్నించారు. నేనే అన్నారు కూర్మయ్య గారు. మీరు హరిజనులని రెచ్చగొట్టి హిందూమత ధర్మాలకి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని కంప్లైంట్ వచ్చింది అన్నారు. 
నిజానికి రాజారత్నం నాయుడు గారు సంస్కరణ వాది. కాని ఆయన వృత్తి ధర్మం నేరవేరుస్తున్నాడు.గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు, పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. 
ఇక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉందని మాకు వర్తమానం వచ్చింది, 144 వ సెక్షన్ అమలు చేస్తున్నాం.. ఇక్కడినుండి వెళ్ళిపొండి అని రాజారత్నం నాయుడు కాస్త కఠినంగానే అన్నారు. బ్రహ్మ్మయ్య గారు వెంటనే గ్రామ ప్రజలు సంతకాలు చేసి ఇచ్చిన కాయితాలు చూపించారు. కేవలం 15 శాతం మంది చెప్పిన విషయాలు నమ్మి మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మన్నించకపోవటం అన్యాయం అన్నారు. 
నిజమే ! అన్నారు రాజారత్నం నాయుడు గారు. ఆయనకి జరిగినదంతా అర్ధమైనది. మీకు నా సహాయం ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
కూర్మయ్య గారు ముందు నడవగా , వెనుక వందలాది హరిజనులు సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయంలో ప్రవేశించారు. 
మంచు తెరల్ని చీల్చుకుంటూ , చీకటి రేఖల్ని చిదుముకుంటూ ఉదయభాస్కరుడు ఈ చారిత్రాత్మక సంఘటనకి సాక్షీ భూతంగా ఉండాలని ఉత్సాహంగా ఎదిగొచ్చి తేజోవిరాజితుడై దీక్షగా వీక్షించసాగాడు.
మహాత్ముడు కన్న కలలు ఘంటసాలలో కూడా నిజమైనాయని ఊరిలో అత్యధికులు సంతోషించారు. 
 
1933 నవంబర్ 19
ఊర్లో పెద్దలు మతద్రోహానికి పాల్పడి దేవాలయాల్ని అపవిత్రం చేస్తున్నందుకు నిరసనగా జలధీశ్వరాలయం పురోహితులు ఘంటసాల సుబ్బయ్య గారు తన అర్చకత్వాన్ని వదులుకున్నారని , మరింక ఆ దేవాలయంలోకి అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నారని ఊరంతా చెప్పుకున్నారు. ఊళ్ళో మళ్ళీ అలజడి. 
కాశీనాధుని వీరమల్లయ్య గారికి జరిగినదంతా వివరించారు గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు. ఆయన వెంటనే తన కుమారుడుని వెంటబెట్టుకుని ఎలకుర్రు నుండి ఘంటసాల వచ్చారు. ఇక్కడ మరో పురోహితుడు కుదిరేవరకు ఆలయ పూజాదికాలన్ని నువ్వే నిర్వర్తించు అని కుమారుడిని ఆదేశించారు. సమస్య ఇంత త్వరగా పరిష్కారమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తన నిరసన ని ఎవరూ పట్టించుకోలేదని పురోహితుల వారు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. 
అదే రోజు ఘంటసాలలో మరో ప్రముఖులు ఘంటసాల లక్ష్మీ నరసింహంగారి ఇంట్లో వారి తండ్రి ఉద్దండ నరసింహం గారి ఆబ్దికం ఉంది. 
నాన్నగారి ఆబ్దికం జరిపించండి స్వామీ అని ప్రాధేయపడుతూ అడిగారు లక్ష్మీ నరసింహంగారు పురోహితుల వారిని. హరిజనుల దేవాలయ ప్రవేశానికి అనుకూలంగా నువ్వు సంతకం చేశావు కదూ తీక్షణంగా చూస్తూ రౌద్రంగా అడిగారు. 
కాని నాన్నగారు మీకు ఆప్తులు,స్నేహితులు కదా ... ప్రాధేయపడుతున్నట్లు అడిగారు లక్ష్మీ నరసింహం గారు. నువ్వు లక్ష చెప్పు ఆఖరికి ఆ పరమశివుడు దిగొచ్చినా వర్ణ సాంకర్యం చేసిన వారింటికి నేను రాను అని ఖరా ఖండిగా చెప్పారు సుబ్బయ్య పురోహితులు గారు. 
విషయం గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారికి తెలిసింది. 
హుటా హుటిన పురోహితుల వారింటికి వెళ్లారు. "మీరీ విధంగా లక్ష్మీ నరసింహం గారిని వెలివేయటం బాగాలేదు. ఇది న్యాయం కాదు , మీరు దూరదృష్టితో చూడాలి అని బతిమాలారు. భీష్మించుకు కూర్చున్నారు పురోహితులు. 
అయితే మా ఇళ్ళలో పౌరోహిత్యాన్ని కూడా మీరు మానుకోవాల్సి వస్తుందని హెచ్చరికగా అన్నారు బ్రహ్మ్మయ్య గారు. 
మీ ఊరు ఊరంతా ఏకమైనా నాకు లెక్కలేదు - నేనేవరింటికీ వచ్చేది లేదు. నాకు మతధర్మం ముఖ్యం అని తేల్చి చెప్పారాయన. 
త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని కలిసి ఘంటసాలలో స్వకుల పౌరసత్వం కోసం వేదం నేర్చిన కమ్మవారిని తీసుకువస్తాను అంటూ కోపంగా బయలుదేరారు బ్రహ్మ్మయ్య గారు. 
ఘంటసాల లో బ్రాహ్మణెతరులు వేదం నేర్చుకోవటానికి వేదపాఠశాల పెట్టిస్తానని శపథం చేశారాయన.
 
మూలం : ప్రముఖ సాహితీవేత్త శ్రీ జి.వి పూర్ణచంద్ గారి కలం నుండి వెలువడిన శ్రీ వేముల కూర్మయ్య గారి జీవిత చరిత్ర  "దీనజనభాంధవుడు" పుస్తకం నుండి..  
1927 లో ఒక దళిత విద్యార్ధి హాస్టల్ లో చేరాడని తెలియగానే ఆరోజు రాత్రి బెనారస్ హిందూ యూనివర్సిటీ లో ఒక్కళ్ళు కూడా భోజనం చెయ్యలేదు.అదే దళిత విద్యార్ధి నాలుగేళ్ళలో విద్యార్ధి నాయకుడుగా అదే యూనివర్సిటీ లో ఎదిగాడు. ఆయనే వేముల కూర్మయ్య. దక్షిణ భారత దేశంలో పట్టబద్రుడైన తొలి దళితుడు. ఆయన జీవితాన్ని గ్రంధస్తం చేసిన పూర్ణచంద్ గారు ఎన్నో అరుదైన సంఘటనల్ని ఈ పుస్తకంలో వివరించారు.
 
 
 Dated : 22.01.2016