శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలుBack to list

 ఈ నెల 22 నుంచి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు స్థానిక జలధీశ్వరాలయం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గొర్రెపాటి విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారు జ్యోతి వెలిగించి ఈ ఉత్సవాలని ప్రారంభించారు. తొలి రోజున కుమారి పొన్నూరు అనూష చేసిన కూచిపూడి నృత్యం సభికులని విశేషంగా ఆకట్టుకుంది.

తదనంతరం జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల తరపున మనఘంటసాల.నెట్ నిర్వాహకుడు రాజేష్ వేమూరి ని గ్రామస్తులంతా ఘనంగా సత్కరించారు. గ్రామ చరిత్రని అలాగే జలధీశ్వరాలయ విశిష్టతని అంతర్జాలంలో విశ్వ వ్యాప్తం చెయ్యటం ద్వారా గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపుని తీసుకు వచ్చారని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ ప్రశంసించారు. ఈ రెండు సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల నుంచి గుడిని  సందర్శించే వారి సంఖ్య అనేక రెట్లు పెరగటానికి వెబ్ సైట్ ఎంతో దోహదం చేసిందన్నారు. గుడికి అవసరమైన రెండు లక్షల రూపాయల విలువైన ప్రచార చిత్రాలని తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా అందించారని తద్వారా దేవాలయ ప్రచారానికి మరింత సులువైన మార్గం దొరికినట్లయిందని తెలియ చేశారు.

ఉద్యోగ రీత్యా జర్మనీకి పయనం అవుతున్న సందర్భంగా రాజేష్ కి గ్రామస్తులు అభినందనలు తెలియచేసారు. ఊహించని ఈ సత్కారానికి ఒకింత ఉద్విగ్నతతో ప్రసంగిస్తూ, తాను కేవలం హాబీ కోసం చేసిన ఈ సైట్ ఈ స్థాయికి చేరుకుంటుందని అసలు ఊహించలేదన్నారు. తాను ఎక్కడున్నా ఈ వెబ్ సైట్ మాత్రం ఎప్పటిలాగే నిర్వహించబడుతుందని తెలియచేసారు.

 

Dated : 25.04.2012