నా ఐరోపా యాత్ర - 24 (పారిస్)Back to list

నా ఐరోపా యాత్ర - 24 (పారిస్)

 ముందు రోజు రాత్రి బాగా ఆలస్యమవటం, ప్రయాణ బడలిక తీరకపోవటంతో మరుసటి రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాం. ఆరోజు నేను చూడాలనుకున్న గుయ్ మెట్ మ్యూజియం కి వెళ్లి అదయ్యాక రాత్రికి బెల్జియం వెళ్ళాలని అనుకున్నాం. అసలు నేను అనుకున్నమ్యూజియం అదో కాదో అనే సందేహంతో పాటు మా ఊరి శిల్పాలు అక్కడ ఉన్నాయో లేదో అనే సందేహం మరొకటి. రామాయణం లో పిడకల వేట లాగా ఈ శిల్పాల గొడవేంటి అనుకుంటున్నారా ? వీటి కధ దాదాపు 90 ఏళ్ల క్రితం జరిగింది.
 


 
1923 లో మా ఘంటసాల గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు. 1927 లో పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధన కారుడు ఆ శిల్పాలన్ని సేకరించి పారిస్ లో గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడు. ఈ మ్యూజియంలో పలు ఆసియా దేశాలలో దొరికిన వేల ఏళ్ల నాటి శిల్పాలు,వంట పాత్రలు, అలనాటి వస్త్రాలు, చైనా , కంబోడియా దేశాల్లో దొరికిన ఎన్నో అపురూప శిల్పాలు భద్రపరిచారు. నేను మా ఊరి చరిత్రని పరిరక్షించే వెబ్సైట్ రూపకల్పనలో చేసిన పరిశోధనలో మూడేళ్ళ క్రితం ఈ విషయం గురించి విన్నాను. 1966 లో ప్రచురితమైన "ఘంటసాల చరిత్ర" అనే మా గ్రామ చరిత్ర పుస్తకంలో అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ఉటంకించారు. కేవలం ఈ శిల్పాలు చూడటానికే ఆయన పారిస్ వెళ్ళినట్లుగా చెప్పారు. ఆ తరువాత ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరూ వెళ్లి చూడలేదు కూడా. నేను కూడా పారిస్ వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు.ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే అనుకున్నాను తప్ప ఎప్పుడూ వెళ్లి చూస్తా అనుకోలేదు.
ఇక మే 1 వ తేదిన ఎంతో ఉత్సాహంగా హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకల్లా మ్యూజియంకి చేరుకున్నాం. మెట్రో స్టేషన్ పేరు లేనా. ఈ స్టేషన్లో దిగితే కింద నుంచి పైకి రాగానే కన్పించే మొదటి బిల్డింగ్ ఇదే. దీనికి ఎదురుగా రాయల్ ప్యాలస్ ఉంటుంది.  కాని ఆ రోజు మేడే అనే సంగతి అక్కడికెళ్ళాక గుర్తు వచ్చింది. ఆరోజు సెలవు దినం కావటంతో లోపలికి అనుమతి లేదు. మా షెడ్యుల్ ప్రకారం ఆరోజు రాత్రికే పారిస్ నుండి బయలుదేరాలి. కాని అంతదూరం వెళ్లి మన ఊరు శిల్పాలని చూడకుండా రావటానికి మనసొప్పలేదు. నేను దిగాలు పడటం చూసి నా శ్రీమతి మరియు మార్చిన్ దంపతులు ఇంకో రోజు ఉండి నీ కోరిక ప్రకారం ఈ మ్యూజియం చూశాకే వెళదాం అన్నారు. అప్పటికప్పుడు ఆరోజు అందుబాటులో ఉన్న హోటల్ బుక్ చేశాం. ఇక ఆరోజుకి మిగతా ప్రదేశాలు చూసి మరుసటి రోజుకి మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నాం. పారిస్ లాండ్ మార్క్ అయిన Arc de Triompe దీనికి పక్కనే నడిచే దూరంలోనే ఉంది. 
Arc de Triompe అనేది ఒక స్థూపం. ఫ్రెంచ్ విప్లవంలో అసువులు బాసిన వ్యక్తుల స్మృతి చిహ్నంగా 1806 లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి 1836 లో నెపోలియన్ హయాంలో పూర్తి చేశారు. ఆ విప్లవంలో చనిపోయిన వారి పేర్లు దీని గోడలపై చెక్కారు. పారిస్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈఫిల్ టవర్ తో పాటు ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం రారు. దీనిలోపల మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుడి సమాధి ఉంది. ఇతని వివరాలు అక్కడ లేవు. ఈ కట్టడం రోడ్డు మధ్యలో ఉంది. దీనికి చుట్టూ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మేము అక్కడికి చేరుకొని కాసేపు ఫోటోలు తీసుకున్నాం. ఆ రాత్రికి మేము బుక్ చేసుకున్న హోటల్ అక్కడికి 40 కిలోమీటర్లు ఉండటంతో 6 గంటలకల్లా బయలుదేరి హోటల్ కి వెళ్ళిపోయాం.  

మరుసటి రోజు మే 2 న పొద్దునే పదిగంటల కల్లా లేనా స్టేషన్ చేరుకున్నాం. మ్యూజియమ్  ప్రవేశ రుసుము  8 యూరోలు. టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండియా, కంబోడియా దేశాల శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక ఫ్లోర్ లో రెండు దేశాల చొప్పున మొత్తం నాలుగు అంతస్తుల్లో వివిధ ఆసియా దేశాలలో వర్ధిల్లిన బౌద్ధం, హిందూ మతాల అవశేషాలు, వేల ఏళ్ల నాటి నాగరికత కి గుర్తులైన రాతి పాత్రలు, పలు దేవతల విగ్రహాలు, శిధిల శిల్పాలు ప్రజల సందర్శనార్ధం  ఉంచారు. గుయ్ మెట్ అనేది ఒక ప్రత్యేకమైన మ్యూజియం, కేవలం ఆసియాకి సంభందించిన అవశేషాలని మాత్రమే అక్కడ చూడవచ్చు. ప్రతి శిల్పం దగ్గరా అది దొరికిన ప్రదేశం, సేకరించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఆత్రుతగా ఘంటసాల అనే పేరు కోసం వెతికాను. అమరావతి పేరు ముందు కనిపించింది. నాకంటే ముందే నా శ్రీమతి ఘంటసాల పేరు ఉన్న రెండు శిల్పాలని గుర్తించింది. అవి చూడగానే నా సంతోషం అలవి కానిది. సేకరించిన వ్యక్తి పేరు, సంవత్సరం యధాతధంగా ఉన్నాయి.హెడ్ ఫోన్స్ సాయంతో ఆ శిల్ప వృత్తాంతాన్ని వినవచ్చు. ఆ రెండు శిల్పాల్ని ఫోటో తీసుకుని మిగతా శిల్పాలు చూస్తుండగా అవన్నీ అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో దొరికినవే. కొద్దిగా ముందుకి వెళితే మధ్య ప్రదేశ్, తమిళనాడు,కేరళ ప్రాంతపు అవశేషాలు కనిపిస్తాయి. కొద్దిగా పక్కకి తిరిగితే ఘంటసాల గ్రామం పేరుతో మరో శిల్పం కనిపించింది. మొత్తం మూడు శిల్పాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. చాలా సేపు అక్కడే గడిపి అన్నీ ఫోటోలు వీడియో తీసుకున్నాను. 


ఒకరకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే కరెక్ట్ అనిపించింది. దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తారు. వారంతా మా గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత గర్వంగా కూడా అనిపించింది. శంఖంలో పోస్తేనే ఏదైనా తీర్ధం అవుతుంది. మా గ్రామానికి సంభందించిన మరిన్ని శిల్పాలు మద్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి. ఎక్కడి ఘంటసాల, ఎక్కడి పారిస్ ? 90 ఏళ్ల క్రితం తరలించిన మా ఊరి శిల్పాలని చూడగలగటం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. అవి చూసి బయటకి వచ్చాక గుండెలనిండా నింపుకున్న సంతోషం, ఉప్పొంగిన హృదయంతో నేను ఆకలి కూడా మర్చిపోయాను. మార్చిన్ ఇక తిందామా అనటంతో భోజనం సమయం అయ్యిందని గుర్తొచ్చింది. పక్కనే ఉన్న హోటల్ లో భోజనం చేసి అక్కడినుండి లౌవ్ర్ మ్యూజియం వెళ్దాం అనగానే ముగ్గురూ నన్ను తినేసేలా చూశారు. ఇప్పటిదాకా చూసిన మ్యూజియంలు చాలలేదా అంటూ విసుక్కున్నారు. నిజమే మరి నాకు ఉన్న ఆసక్తి వాళ్ళకి ఉండాలిగా. ఇప్పటికీ భార్గవి కి నాతో ఎక్కడికన్నా రావాలంటే అదే భయం. మ్యూజియంకి వెళ్ళను అంటేనే ఎక్కడికైనా వస్తాను అంటుంది. అందుకే నేను బిజినెస్ ట్రిప్ లు వెళ్ళినపుడు ఇలాంటివన్నీ కవర్ చేస్తుంటా. మేమిద్దరం వెళితే కేవలం హాలిడే స్పాట్స్ మాత్రమే. లౌవ్ర్ మ్యూజియం లోనే డావిన్సి గీసిన మోనాలిసా చిత్రం ఉంది నాకేమో అది చూడాలని కోరిక. మిగతా వాళ్ళెవరికి ఓపిక లేదు. సరే కనీసం బయట నుండి అయినా ఆ మ్యూజియం చూద్దాం అని ఒప్పించి అక్కడికి తీసికెళ్ళాను. అక్కడికెళ్ళాక ఒక బెంచి చూసుకుని, ఈ బొమ్మలూ, చిత్రాలూ, శిల్పాలూ ఏం చూసుకుంటారో చూసుకుని ఇక్కడికే రండి..నా వల్ల కాదు అని భార్గవి అక్కడే కూర్చుంది.తనతో పాటు కాషా , మాక్సిం కూడా కూలబడ్డారు. మార్చిన్ కొంచెం ఇలాంటివంటే ఆసక్తి ఉన్నవాడే, మేమిద్దరం కలిసి ఆ ఆవరణలో కాసేపు తిరిగి ఫోటోలు తీసుకున్నాము. ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద మ్యూజియం. తిండి నిద్ర లేకుండా ఒక్కొక్క మాస్టర్ పీస్ ను  మూడంటే మూడు సెకన్లు చూస్తూ వెళితే ఆ మొత్తం  మ్యూజియం చూడటానికి మూడు నెలలు పడుతుందంట. 
నేను తరువాత బిజినెస్ ట్రిప్ లో మళ్ళీ పారిస్ వెళ్ళినపుడు ఈ మ్యూజియం కి వెళ్లి చూసి వచ్చాను.అప్పుడు తీసుకున్నదే ఈ మోనాలిసా ఫోటో. 

పారిస్ కి సంభందించిన మరో ముఖ్య విషయం, ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే. 
ఫ్రెంచ్ చక్రవర్తుల పాలస్ లూ, ఫ్రెంచ్ విప్లవాల, వారి యుద్దాల, విజయాల స్మారక చిహ్నాలు, చర్చిలూ, మ్యూజియం లూ, చివరకి సీన్ నది మీద కట్టిన ప్రతి బ్రిడ్జీ, వందలాది ఏళ్ల చరిత్ర ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుండగా.. గాలేరియాలూ, గట్రా మనం అడుగు పెడితేనే మాసిపోతాయన్నట్టు ఉన్నాయి. భార్గవి అక్కడ ఏదైనా కొందాం అని కొన్ని షాపుల్లోకి వెళ్లి ధరలు చూసి మాట్లాడకుండా బయటకి వచ్చి ఇక నడవండి అంది.పర్లేదు నచ్చింది కొనుక్కోమన్నా వినలేదు. 

ఇక ఆఖరున  వేర్సైల్స్ రాజ భవనం చూడటానికి బయల్దేరాం. ఆరు తరాల ఫ్రెంచ్ చక్రవర్తులు నివసించిన ఆ పాలస్ కోసం పారిస్ నగర శివార్లలో ఉన్న వేర్సైల్స్ నగరానికి వెళ్లాం. అప్పటికే సమయం మించిపోయింది. చీకటి పడుతుండటంతో 6 గంటలకల్లా ప్రవేశం నిలిపివేశారు. కానీ బయట నుండి ఆ రాజ భవనం, వేల ఎకరాల్లో ఉద్యానవనాలూ, బంగారు తాపడాలతో జిగేల్ మంటున్న పాలస్ చూస్తే మతిపోయింది. అసలు దీనిలో నివసించిన వాళ్ళు వారి జీవిత కాలం మొత్తంలో అయినా ఈ పాలస్ మొత్తం చూసి ఉండరని నా గట్టి నమ్మకం. ఆ పాలస్ చుట్టూ ఉన్న రోడ్ మీద మేము కార్ లో తిరగటానికే 30 నిమిషాలు పట్టింది. అక్కడినుండి పారిస్ నగరం వదిలి మా కారు బెల్జియం వైపు సాగిపోతోంది. కానీ నాకు మాత్రం పారిస్ మనస్సులో ఉండిపోయింది. ఎంత అందమైన నగరం, ఏమి కట్టడాలు, గాలరీలు, చర్చిలు, రాజ భవనాలు, వాళ్ల రోడ్ సైడ్ కఫెలూ, మెట్రో లో ప్రయాణాలూ,  ఫాషనబుల్ బట్టల్లో నానా జాతుల వారు, కట్టడాలూ కళ్లల్లో మెదులుతూ ఉండగానే..అనిపించింది పారిస్ మొత్తం చూడటానికి ఒక మనిషి జీవిత కాలం సరిపోదని. 

Dated : 25.10.2015