గ్రంధాలయ రధసారధి Back to list

మన ఊరి గ్రంధాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది నాకొక బడి,స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు 8 వ తరగతి చదువుతున్నపుడే  గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు.

 ప్రస్తుతం గ్రంధాలయం తూర్పు వీధి రామాలయం పైన అంతస్తు లో కొనసాగుతోంది.

 అందరూ పేపర్ చదువుతుంటే చందమామ,బొమ్మరిల్లు లో బొమ్మలు చూడటం, అటు తరువాత ఊసుబోక చదివేవాళ్ళను చూడటం, ఆపై ట్వింకిల్ పుస్తకాల సీరియల్స్, పంచతంత్రం, గలివర్ యాత్రలు, సింధుబాద్ సాహసాలు, పరమానందయ్య శిష్యుల కధలు, బొమ్మలకధలు, పిల్లల రామాయణం, బొమ్మల భారతం లాంటి వాటి నుండి ఎగురుకుంటూ వారపత్రికలు, మాసపత్రికలు లాంటి పుస్తకాలకు అలవాటుపడటం,ఠంచనుగా వారం వారం చదవటం తెలుసు. వాటి తరువాత తరమైన మదుబాబు,పానుగంటి లాంటి డిటెక్టివు పుస్తకాలు ,శెలవుల్లోనూ రోజుల తరబడి కూర్చొని చదవటం. మా వాళ్ళు చదువు చదవక పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నానని కోప్పడటం తెలుసు.ఇవాళ ఈ మాత్రం అయినా రాయగలుగుతూ ఉన్నానంటే అది మన గ్రంధాలయం చలవే.ఒకప్పుడు జలధీశ్వరాలయం ముందు కింద అంతస్తులో ఉండేది , 1999 లో నేను హైదరాబాద్ వచ్చేనాటికి అసలు నేను చదవని పుస్తకం మన లైబ్రరీ లోనే లేదేమో.ఒక్క ఘంటసాల చరిత్ర పుస్తకం తప్ప. అప్పటికే ఘంటసాల చరిత్ర గ్రంధం దాదాపు శిధిలావస్థకి చేరుకుంది ,ఎన్ని సార్లు అడిగినా ఆ పుస్తకము మాత్రం ఇచ్చేవారు కాదు. ఈ మధ్య ఆ గ్రంధాన్ని పునర్ముద్రించి ,ఆవిష్కరించినపుడు నా మదిలో మెదిలిన వ్యక్తి  రంగారావు గారు.ఎప్పుడూ ఆ కిటికీ పక్కనే కూర్చుని ఉండే అయన రూపం ఇప్పటికి కళ్ళలో మెదుల్తూనే ఉంది.ఇప్పుడు ఆ ప్రదేశం లో లైబ్రరీ లేకపోయినా అయన అక్కడే కూర్చుని ఆశీర్వదిస్తునట్లు అనిపించింది.

గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఈ గ్రంధాన్ని రాస్తునప్పుడు ఆయనకి లేఖకుడు గా పని చేసిన వ్యక్తి రంగారావు గారే. పుస్తకం ఆసాంతం చిత్తు ప్రతిని వ్రాసింది ఆయనే. ఇప్పుడు ఉంటే ఎంత సంతోషించేవారో. రంగారావు గారు లేని లైబ్రరీ ని అసలు ఉహించలేరు ఎవరూ.ప్రతి పుస్తకాన్ని కంటి పాపలా కాపాడే రంగారావు గారు లైబ్రరీ రంగారావు గారు గానే అందరికి తెలుసు.అయన రిటైర్ అవటం కుడా నాకు గుర్తే. ఇటివలే తెలుగురావు పాలెం కు చెందిన నా ఆత్మీయుడు గుత్తికొండ కళ్యాణ్ ఈ Website ప్రస్తావనకి వచ్చినపుడు రంగారావు గారితో తనకున్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నాడు.అది తన మాటల్లోనే ....

 

 కొండపల్లి రంగా రావు గారి  పేరు నేను విన్నప్పుడు నాకు ఒకరకమైన అనుభూతి కలుగుతుంది.సరిగ్గా పుష్కర కాలం క్రితం,నా 19 ఏళ్ళ వయస్సు లో నేను డిప్లొమా పూర్తి చేసుకొని ఘంటసాల వర్లు ఐ.టి.సి లో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను.అప్పటికి ఇంకా బయట ప్రపంచం తెలియని చిన్నతనం.కానీ దాదాపు నా వయస్సు ఉన్న లేదా నా కన్నా పెద్ద వారు ఐన విద్యార్ధులకు అన్ని విషయాలలో మోరల్ గా నిలిచి,వారిని  ప్రయోజకులను చేయాల్సిన వృత్తి ధర్మం. అప్పుడు రంగారావు గారు లైబ్రరియన్ గా రిటైర్ అయ్యి, వర్లు గారి కోరిక మీదకు కాలేజీ A .O గా పని చేస్తున్నారు.అప్పుడు నాకు అయన అందించిన ప్రోత్సాహం ,మద్దతు నేను ఎప్పటికి మరవలేనివి.  నా మీద,నా వ్యక్తిత్వం మీద అంతులేని నమ్మకం చూపించేవారు. సదా అన్ని విషయాలలో నాకు తగిన సలహాలు,సూచనలు ఇస్తూ, అయన జీవిత  పాఠాలు,అనుభవాలు నాకు చెపుతూ,నా ఉన్నతి కి మార్గదర్సులై నిలిచారు. ఈనాటి నా ఉన్నతికి అయన ఆశీస్సులు కూడా ఒక కారణం అని నమ్ముతాను.ఎప్పటికి ఆయనను మరవలేను.కాకపోతే నాకు 19 సం. వయస్సు లోనే నా మీద అచంచలమైన నమ్మకం ఉంచిన రంగారావు గారు, ఇప్పుడు 30 సం.వయస్సు లో, అన్ని విషయాలలో ఆయనకోరుకున్న ప్రయోజకుడినైన నన్ను చూసి ఆనందించటానికి మన మధ్య లేరు అనేదే చిన్న భాధ.  

నిజాన్ని నిర్భయం గా చెప్పటం, ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం, ఎనలేని నిజాయితీ,తన పనిని తాను సిన్సియర్ గా చేయటం, ఇవి నాకు ఆయనలో నచ్చినవి, నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్న లక్షణాలు.
 
ఇవీ కళ్యాణ్ మాటలు.....
 
ఆ మధ్య మన ఊర్లో ఓ పెద్దాయన అన్నారు ,జీన్స్ లు టీ షర్ట్స్ వేసుకునే కుర్రకారు కి అసలు తెలుగే రావట్లేదు అని.(ఆయన ఆ మాట అన్నపుడు నేను జీన్స్ వేసుకునే ఉన్నా)ఎలా వస్తుంది మరి ,ఇప్పుడంతా ఇంగ్లిష్ మయం,పుస్తకాలంటే హారిపోట్టర్,సిడ్ని షెల్టన్ నవలలు మాత్రమే.ఒకప్పటి చందమామ,బొమ్మరిల్లు ,పంచతంత్రం,ఇప్పుడు లేవు.అవి చదివే తీరిక కూడా ఇప్పుడు ఎవరికీ లేదు కూడా.
 
 

Dated : 11.09.2011

This text will be replaced