సప్త వర్ణాల ఇంద్రధనుస్సుBack to list

                                                      సప్త వర్ణాల ఇంద్రధనుస్సు

అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో విజయాలు ,మైలు రాళ్లు , ప్రశంసల వర్షం గుర్తు రావటంతో పాటు అసలిదంతా చేసింది మేమేనా అనిపిస్తుంది. ఈ ఏడేళ్ల లో ఈ ఇంద్రధనుస్సు కి రంగులద్దిన మహానుభావులందరికీ నా వందనాలు.ముఖ్యంగా నన్ను వెన్నంటి నడిపించిన నా మిత్రులు, మనఘంటసాల టీమ్. వాళ్ళే లేకపోతే ఈ వెబ్ సైట్ లేదు. అసలు వాళ్లలో కొంతమందిని ఈ ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ నేరుగా కలవలేదంటే మీరు నమ్మరేమో.

 

గడచిన ఏడు సంవత్సరాల్లో గ్రామంలో జరిగిన ప్రతి సంఘటన ఈ వెబ్సైట్ లో పొందుపరచబడ్డాయి. ముందు తరాల వారికి ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్ తో అందుబాటులో ఉంది. గ్రామంలో గత 7 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిలో ఈ వెబ్ సైట్ కూడా భాగం పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది మొత్తం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఏడాది మొదట్లోనే మన గ్రామ చరిత్ర గ్రంథ రచయిత , చరిత్రకారులు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి విగ్రహాన్ని గ్రామంలో నెలకొల్పటం అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయం. ఈ వెబ్సైట్ కి ప్రేరణ, స్ఫూర్తి ఆయనే. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి చొరవతో శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారు ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహ నిర్మాణానికి కృషి చేసిన వారిలో శ్రీ మూల్పూరి చెన్నారావు గారు , శ్రీ గొర్రెపాటి చంద్రశేఖర్ గారు , శ్రీ గొర్రెపాటి సురేష్ గారు ముఖ్యులు. ఒక రకంగా ఈ విగ్రహ స్థాపన నా కల. వెబ్సైట్ మొదలైనప్పటినుండి దీనిని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇంతకాలం నన్ను నడిపించింది, ఈ వెబ్సైట్ విషయంలో నన్ను అత్యంత ప్రభావితం చేసింది, వెంకట సుబ్బయ్య గారే. నేను పుట్టేనాటికే ఆయన ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఎందుకో తెలియదు కానీ నా మదిలో ఆయన రూపం ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. ఆయన రచనలు చదివినప్పుడల్లా నా కళ్ళముందు ఆయన సాక్షాత్కరిస్తూ ఉంటారు. ఇది ఏ బంధమో నాకు నిజంగా తెలియదు. వారి వారసుల్ని కలిసినప్పుడల్లా అంతా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. బహుశా వెంకటసుబ్బయ్య గారితో నాది గతజన్మ సంభందమేమో. ఏది ఏమైనా విగ్రహ రూపంలో ఆయన ఈ తరం వారందరికీ రోజూ కనిపిస్తుండటం మాత్రం చాలా సంతోషాన్నిస్తున్న విషయం.

స్వచ్ఛ ఘంటసాల కార్యక్రమానికి వారధి గా నిలిచి గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుబడిన శ్రీ మూల్పూరి చెన్నారావు గారి మరణం గ్రామానికి తీరని లోటు. ప్రతి మనిషికి మరణం అనివార్యమైనా కొంతమంది మాత్రం చరిత్ర పుటలలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. పాత తరం అంతా ఒక్కొకరుగా నిష్క్రమించటం మాత్రం కలచివేసిన అంశం.
గుండేరులో మునిగి మృతి చెందిన నళిని , చైతన్య ల విషాద సంఘటన గ్రామాన్ని నివ్వెరపరిచింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలించటం ఈ సంవత్సరం జరిగిన విషాద సంఘటనల్లో మరిచిపోలేనిది.

ఈ సంవత్సరం గ్రామంలో గత పదేళ్లలో కంటే చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. దాదాపు 27 కోట్ల రూపాయల నిధులు గ్రామానికి వివిధ పనుల రూపేణా అందాయి. రామానగరం నుండి కొడాలి వరకు రెండు వరసల రహదారి , వ్యవసాయ పాలిటెక్నీక్ లతో పాటు పలు మౌలిక వసతులకి అత్యధికంగా నిధులు వెచ్చించారు. ఈ సందర్భంలో మన శాసన సభ్యులు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గారి కృషి అనిర్వచనీయం.

గ్రామ చరిత్రలో మహత్తర ఘట్టం గ్రామ ప్రాచీన వారసత్వ చిహ్నాల ఏర్పాటు. గొర్రెపాటి రామకృష్ణ గారిని చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది, ఈయనకేంటి గ్రామం మీద ఇంత పిచ్చిప్రేమ అని. ఒకదాని తర్వాత ఒకటి భుజాన వేసుకుని విమర్శలని తట్టుకుని గ్రామ వైభవం కోసం నిరంతరం పాటుబడుతూ పట్టుదలగా ఉంటారు. ఈ విగ్రహాల ఏర్పాటు గురించి నాకు 4 ఏళ్ల క్రితం చెప్పారు. అప్పటినుండి పట్టు వదలకుండా వీటి నిర్మాణానికి కృషి చేశారు. గొర్రెపాటి విద్యా ట్రస్ట్ తో పాటు మన గ్రామానికి సంభంధం లేని గాదె సాయిరాం గారు కూడా ఘంటసాల విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. గ్రామానికి పొలిమేరలోనే అత్యంత సుందరమైన ప్రాంతంగా ఈ మూడు విగ్రహాలు నెలకొల్పటం ఈ సంవత్సరంలో చారిత్రిక ఘట్టం.

ఇక స్వచ్ఛ సైనికులది మరో దారి. ఏడాది పైగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా స్వచ్ఛ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న స్వచ్ఛ బృందాన్ని చూస్తునపుడల్లా ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. గ్రామ సర్వతోముఖాభివృద్ధి లో వీళ్లందరితో పాటు ఈ వెబ్సైట్ కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉంటుంది.

ఇక ఈ సంవత్సరం వెబ్సైట్ ని సందర్శించిన వీక్షకుల సంఖ్య 7323. ఎక్కువమంది చదివిన ఆర్టికల్ ఇద్దరు రత్నాలు. వార్తలలో ఎక్కువ మంది చూసింది గుండేరు విషాదం. చాలామంది ఆసక్తి గా చదివింది దోనేపూడి వంశ ప్రారంభం. ఈ సంవత్సరం అమెరికా నుండి 18 శాతం, ఇండియా నుండి 69 శాతం మిగతా దేశాలనుండి 13 శాతం మంది వెబ్సైట్ ని సందర్శించారు. ఎప్పటికప్పుడు వార్తలన్నీ ఫేస్బుక్ పేజీ ద్వారానే ఎక్కువ పబ్లిష్ అవుతున్నాయి. 1500 మంది ఫాలోయర్స్ ఘంటసాల పేజీ కి ఉన్నారు.

మీ ఆదరణతో ఈ వెబ్సైట్ ని మున్ముందు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని తెలియచేస్తూ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

 

Dated : 13.01.2017

This text will be replaced