ఆఖరి హత్య Back to list

 ఆఖరి హత్య

1988 - 89 ప్రాంతాల్లో మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది,తర్వాత చూస్తే మరికొందరి ఇళ్ళకి వెళ్ళినపుడు కూడా ఆ ఫోటో కనిపించేది.ఎప్పుడైనా గుడికి వెళ్ళినపుడు గుడి ముందున్న  ఒక స్మారక స్తూపం లోనూ మళ్లీ అదే ఫోటో, అప్పుడు నాకు అయిదేళ్ళు. చాలా కాలం ఆ ఫోటో నన్ను వెంటాడింది.ఆయనెవరో నాకు తెలీదు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు కూడా. కానీ ఆ ఫోటో మాత్రం ఇప్పటికీ ఉరిలో ఎక్కడోచోట నాకు కనిపిస్తూనే ఉంటుంది.కొంచెం ఊహ తెలిసాక ఎవరో ఒక పెద్దాయన్ని అడిగాను ఆయనెవరు అని, సమాధానం తెలిసింది. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం.
 
                                            గొర్రెపాటి వెంకట రత్నం (బుజ్జి)         స్మారక స్తూపం 
 
వెంకట సుబ్బయ్య గారు బౌద్ధ యుగం తో మొదలుపెట్టి,గాంధీ యుగం జమిందారియుగం,సాంఘిక చరిత్ర తో
1966 లో ఘంటసాల చరిత్ర  గ్రంధాన్ని ముగించారు.మరి ఆ తరువాత ఆ గ్రంధాన్ని కొనసాగించాల్సి వస్తే దాన్ని మొదలుపెట్టాల్సింది రాజకీయ చరిత్ర నుంచే ,కానీ 1966 తరువాత ఉరిలో జరిగింది రాజకీయ చరిత్ర మాత్రమే కాదు రక్త చరిత్ర కూడా. 70 వ దశకం నుంచి 1987 వరకు గ్రామం కక్షల తో నూ హత్య ల తోనూ పార్టీ తగాదాలతో నూ అట్టుడికి పోయింది. ఆ పరంపర కి ముగింపు ఈ ఆఖరి హత్య. 30.12.1987 న జరిగిన ఈ ఉదంతం గ్రామం లో అన్నీ కక్షలకి ముగింపు పలికింది.1 జనవరి 1988 న ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే మన ఊరు మాత్రం పోలీసు పహారా లో బిక్కు బిక్కు మంటూ గడిపింది.
ఆ చరిత్రకి ఇప్పుడు జీవిత చరమాంకం లో ఉన్న కొంతమంది కారకులు,మరికొందరు సాక్షులు. కానీ ఆ కక్షలు కార్పణ్యాలు ఇప్పుడు లేవు ఆ మూర్ఖత్వపు పట్టుదలలు లేవు.మనుషుల ఆలోచనల్లోనూ మానసిక పరిణతి లోనూ ఎంతో మార్పు.కానీ గతాన్ని తలుచుకున్నపుడల్లా ఒక్కసారి ఉలిక్కి పడతారు.అప్పటికి ఇప్పటికి ఉరిలో ఎంత తేడా? అప్పట్లో ప్రతి కేసులోనూ ప్రతి గొడవ లోనూ ఉన్న కొంతమంది ఇప్పుడు గడిపే జీవితం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు,మనవడు,మనవరాళ్ళు,వాళ్ళ ముచ్చట్లు, కనీసం పక్కవాడి గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా వారు గడిపే సాధు జీవితం చూస్తుంటే అసలు ఈయనేనా అప్పుడలా ఉండేవాడు అనిపిస్తుంది.అలా అని ఆ గొడవలకి హత్యలకి నేనేమి ప్రత్యక్ష సాక్షి ని కాదు.ఈ వయసులో అవన్నీ ప్రస్తావించి వివాదాల్ని కొని తెచ్చుకోవటం నాకూ ఇష్టం లేదు.కానీ వెబ్ సైట్ రూపకల్పన సమయం లో నేను కలిసిన ఎంతో మంది పెద్దల దగ్గర నేను తెలుసుకున్న విషయాలు ఎంతో ఆసక్తికరం గా ఉండేవి.అవన్నీ ఎప్పటికైనా వెబ్ సైట్ ద్వారా కానీ  గ్రంధ రూపం లో కానీ  తీసుకురావాలి అనిపించేది.కానీ నేను చూడని విషయాలు,ఎవరో చెప్పిన విషయాలు,నేను రాయటం సముచితం కాదు అనిపించింది.కానీ అప్పటి ఘటనలలో అకారణం గా నిందలు పడిన వ్యక్తుల్నీ కలిసాను,మేమే చేసాం అని ఒప్పుకున్న వ్యక్తుల్ని కూడా కలిసాను.
ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే ఈ మధ్య నే ఘంటసాల చరిత్ర గ్రంధాన్ని పునర్ముద్రించిన విషయం మీకు విదితమే.ఆ ప్రయత్నం లో నేను ఉన్నపుడు చాలామంది పెద్దలు ఆ పుస్తకం 1966 దాకా మాత్రమే ఉంది. ఈ 45 ఏళ్ల చరిత్ర ని కూడా దానికి అనుసంధానించి ఒకే పుస్తకం గా చేస్తే బాగుంటుంది అని. నిజమే మరి బావుంటుంది కూడా. కానీ రాసే వాళ్లేరి? ఒకవేళ రాయాలనుకున్నా ఏమి రాయాలి ? ఈ 45 ఏళ్ల లో జరిగిన అన్నీ ఘటనలకి సాక్షులైన వారు పెదవి విప్పితే,రాసిన అంశాలకి బాధ్యత వహిస్తే ఎప్పటికైనా రెండవ భాగం తీసుకురావాలని ఆశ. అదే కనుక జరిగితే ఆ పుస్తకం పేరు
 
ఘంటసాల చరిత్ర - కొన్ని నిజాలు

 Dated : 04.09.2011

This text will be replaced