తెలుగు వెలుగు విద్యార్థిBack to list

తెలుగు వెలుగు విద్యార్థి

ఈ ఆర్టికల్ రాయటం కొంచెం ఆలస్యం అయింది.18 ఏళ్లకే ఫేస్బుక్ ని స్థాపించిన మార్క్స్ జుకర్ బెర్గ్ , కాలేజి రోజుల్లోనే గూగుల్ ని స్థాపించిన లారీపేజ్ ల గురించి ఆశ్చర్యంగా, అద్భుతంగా వర్ణించిన ఎన్నో కధనాలు మీరు చదివి ఉంటారు. కాని ఇవన్నీ సమాచార విప్లవం వచ్చాక గత 15 ఏళ్లలో జరిగిన విషయాలు. 60 ఏళ్ల క్రితం మన ఘంటసాల హైస్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తన 20 ఏళ్ల వయసులో స్థాపించిన ఓ మాస పత్రిక గురించి, 61 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఆ పత్రిక జైత్రయాత్ర గురించి , ఆ విద్యార్ధి గురించి రాయాలని చాలా సార్లు అనుకున్నాను. ఆ వ్యక్తికీ, నేను ఇప్పటివరకూ చేరుకున్న నా వృత్తిగత ప్రయాణానికి విడదీయరాని సంభంధం ఉంది. నా కెరీర్ కోసం నేను వేసిన తొలి అడుగు ఆయన చెయ్యి పట్టుకునే. ఆ తొలి అడుగే నా 10 సంవత్సరాల కెరీర్ ని పరుగులు పెట్టించింది. అందుకే నా ప్రతి అడుగు వెనక ఆయనున్నారు. ఆయనే శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు. 60 ఏళ్ల క్రితం ఘంటసాల హైస్కూల్ విద్యార్ధిగా ఆయన స్థాపించిన ఆ పత్రిక  ‘’తెలుగు విద్యార్ధి ‘’. 


నేను హైదరాబాదు లో చదువుకునే రోజుల్లో మా దూరపు బంధువొకాయన దగ్గరకి వెళ్ళినపుడు మాటల మధ్యలో నేను చదువుతున్న కోర్సు గురించి చెప్తూ, ఫలానా కంపెనీ లో ఇంటర్న్ షిప్ చేస్తే బావుంటుంది అని చెప్పాను. వెంటనే ఆయన ఆ కంపెనీ చైర్మన్ మా బాబాయికి ఫ్రెండ్ అని చెప్పి వెంటనే కోటేశ్వరరావు గారికి కాల్ చేసి నీ దగ్గరకి ఒక కుర్రాడు వస్తాడు బాబాయ్, వాడికి ఏం కావాలో చూడు అని చెప్పారు. ఒక వారం తరువాత 2002 వ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదిన వారి ఇంటి అడ్రస్ పట్టుకుని బయలుదేరాను. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో వారి నివాసం. అప్పట్లో బంజారా హిల్స్ కి ఎక్కువ బస్సులు ఉండేవి కాదు. సెల్ ఫోన్స్ ఉన్నాయి కాని , అప్పటికి అది వాడే స్థోమత నాకు రాలేదు. రోడ్ నంబర్ 1 లో కృష్ణా ఒబెరాయ్ దగ్గర బస్సు దిగి అడ్రస్ కోసం ఫోన్ చేశాను. వారి పెద్దబ్బాయి రమణ ఎలా రావాలో చెప్పారు. అక్కడినుంచి నడుస్తూ ఆ దారిలో కనపడ్డ పబ్లిక్ బూత్ ల అన్నిటి నుండి నుండి ఫోన్ చేస్తూ ఆయన్ని అడ్రస్ కోసం విసిగిస్తూ 2 గంటల తర్వాత ఎలాగోలా ఆ ఆడ్రస్ కి చేరాను. ఆరోజు ఆదివారం, పైన ఎండ, దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచానేమో. వెళ్ళగానే ఎదురుగా సోఫాలో కూర్చున్నారు కోటేశ్వరరావు గారు. మంచి నీళ్ళు తాగాక ఎవరబ్బాయివి నువ్వు అని అడిగారు. నేను చెప్పగానే, ఓర్నీ నువ్వు మా కుటుంబరావు అన్నయ్య మనవడివిరా అన్నారు. ఇంతా జరిగాక కధేంటంటే మా అమ్మకి ఆయన బాబాయి అవుతారు. మా తాత గారికి వాళ్ళకి రాకపోకలున్నా, మాకు అంతగా తెలియదు. పైగా ఆ రోజుల్లో కొత్తపల్లిలో ఉన్న కొల్లూరి వారి కుటుంబాల్లో ఉన్నత విద్య అభ్యసించిన ఏకైక వ్యక్తి ఆయనే. ముందు నుండి ఆయన ఆ గ్రామంలో లేకపోవటంతో మా అమ్మ వాళ్ళకి కూడా ఆయన పెద్దగా తెలియదు.

ఇంతకీ ఎం చదువుతున్నావ్, ఏం కావాలి నీకు అని అడిగారు. విషయం చెప్పగానే పక్కనే ఉన్న వారి పెద్దబ్బాయి రమణ ని పిలిచి, రేపొద్దున అబ్బాయిని ఆ కంపెనీకి తీసుకెళ్ళు అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం నన్ను 10 గంటలకల్లా ఆ కంపెనీ ముందు ఉండమని చెప్పారు రమణ. నా కల నేరవేరుతోందన్న ఆనందంలో నేను 9 గంటలకే అక్కడ రెడీ గా నిలబడ్డాను. ఆయన చెప్పిన సమయానికి రావటం, నన్ను తీసికెళ్ళి పరిచయం చెయ్యటం, తదనంతరం నా ఇంటర్న్ షిప్ అక్కడే చెయ్యటం జరిగిపోయాయి. ఆ ఇంటర్న్ షిప్ నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న "ప్రగతి" కి కారణం. తరువాతి కాలం లో రమణ గారితో ఆ అనుభంధం అలాగే కొనసాగింది.
 
 
ప్రతి యునివర్సిటీ నోటిఫికేషన్ కోసం, లేదా కోర్సుల వివరాల కోసం గూగుల్ అంతా వెతికేసి చిటికె లో సమాచారం తెలుసుకునే ఈ తరం విద్యార్ధులకి, ఇంటర్ నెట్ లేని రోజుల్లో 60 ఏళ్ల క్రితం ఈ సమాచారం అంతా ఎలా తెలిసేదో అనే సందేహం ఒక్క సారైనా వచ్చుండాలి. ఆ సందేహానికి సమాధానం తెలుగు విద్యార్ధి  .కోటేశ్వర రావు గారు 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు 1953 లో స్థాపించిన ఈ విద్యా మాస పత్రిక లో  విద్యార్ధులకు,  అధ్యాపకులకు బాల బాలికలకు అవసరమైన అన్ని విషయాలు ఉండేట్లు చేయటం, ప్రభుత్వం జారీ చేసే అన్ని జి వొ లనుప్రచురించటమే కాదు, ప్రశ్నలు జవాబులు శీర్షిక పెట్టి చదువరుల ప్రశ్నలకు ఆర్ధిక రంగ నిపుణులైన స్వర్గీయ మామిడి పూడి వెంకట రంగయ్య గారు ,ప్రముఖ న్యాయ మూర్తి స్వర్గీయ ఆవుల సాంబశివ రావు గారి లాంటి వారితో సమాధానాలు ఉండేవి. ’’పద బంధం ‘’ను ఏర్పరచి మన గ్రామానికే చెందిన స్వర్గీయ వేమూరి జగపతి రావు గారితో దాదాపు ముప్ఫై ఏళ్ళు నిర్వహింప చేయటం ఒక సవాలు . విద్యారంగం లో వచ్చే ప్రతి మార్పుకూ ప్రాముఖ్యమిచ్చి వ్యాసాలూ రాయించి అవగాహన కల్పించారు . సైన్సులో సాంకేతిక విషయాలలో శ్రీ సి వి సర్వేశ్వర రావు వంటి ఉద్దండులచేత ప్రత్యెక వ్యాసాలూ రాయించటం మరో ఆకర్షణ . సంపాదకీయం లో సమకాలీనతకు అద్దం పట్టారు కొల్లూరి . ఎన్నో విలువైన గ్రంధాలను తక్కువ ధరకే ముద్రించి అందు బాటులోకి తెచ్చారు . దాతలను,శాశ్వత చందా దారులను ప్రోత్సహించి ప్రోత్సహించి గ్రంధాలయాలకు విద్యా సంస్థలకు తెలుగు విద్యార్ధి అందేట్లు చేశారు . చందాలు కట్టినా కట్టక పోయినా ,ప్రతి హైస్కూల్ కు పత్రికను ప్రతి నెలా పంపేవారు. యువకుడి గా ఉండి విద్యార్ధుల కోసం ఒక మాస పత్రిక పెట్టాలనే ఆలోచన రావటమే అరుదు . వచ్చిన ఆలోచనను ‘’తెలుగు విద్యార్ధి ‘’గా రూపొందించి అవిచ్చిన్నం గా అరవై ఒక్క ఏళ్ళుగా నడపటం అనితర సాధ్యం. 
 
మన గ్రామానికి పొరుగున ఉన్న కొత్తపల్లి లో 08.10.1933 న జన్మించిన కొల్లూరి, మచిలీ పట్నం కేంద్రంగా తన పత్రికా ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటికీ పత్రిక మచిలీ పట్నం నుండే వెలువడుతుంది. 
ఉపాధ్యాయుల విభాగంలో MLC గా మూడు దఫాలు పని చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగానికి ఆయన చేసిన సేవే ఆయన్ని తమ ప్రతినిధిగా మూడు సార్లు కౌన్సిల్ లో కూర్చోబెట్టింది. MLC కోటేశ్వరరావుగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ సభ్యుడిగా, ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలక వర్గంలోనూ ఆయన పని చేశారు.సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసేవారు. తానూ చదువుకోవటానికి సహాయం చేసిన గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారి మంచితనాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే కొల్లూరి, తానూ ఇతరులకి అదే విధంగా సహాయ పడ్డారు. 
 
1966 లో ముద్రితమైన ఘంటసాల చరిత్ర లో కోటేశ్వరరావు గారి గురించి  పండిత వెంకట సుబ్బయ్య గారు రాసిన వాక్యాలు 

ఈ వెబ్ సైట్ రూపకల్పన తరువాత ఆయన్ని అదే ఇంట్లో మళ్లీ కలిశాను. ఘంటసాల గ్రామానికి చెందిన ఎన్నో విలువైన పుస్తకాలు ఆయన లైబ్రరీలో భద్రంగా ఉండేవి. ఆ పుస్తకాల రిఫరెన్స్ కోసం వెళ్ళినపుడు ఆ పుస్తకాలన్నీ రంగా గొడవల సమయంలో అల్లరి మూకల విధ్వంసం లో కాలిపోయాయని చెప్పారు. కాని అవి దొరికే చోటు కూడా ఆయనే చూపించారు. అదే నేను ఆయన్ని కలిసిన ఆఖరి సందర్భం. 

ఘంటసాల చరిత్ర పునర్ముద్రించాక ఆయనకీ కొన్ని కాపీలు ఇవ్వాలని వారింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన మచిలీపట్నంలో ఉండటంతో ఇంట్లోనే ఆ పుస్తకాలు ఇచ్చి వచ్చాను. తరువాత నేను విదేశాలకి వెళ్ళిపోవటం తో ప్రత్యక్షంగా ఆయన్ని కలిసే సందర్భం రాలేదు. 2013 ఫిబ్రవరి లో నా వివాహానికి ఆహ్వానించటానికి మా అమ్మా నాన్నలు బందరులో వారింటికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు..  రాజేష్ పెళ్లి కదా, వాడి పెళ్ళికి నేను తప్పకుండా వస్తాను. నేను వాడికి కేవలం చేసింది చిన్న సహాయం మాత్రమే, తరువాత వాడి ప్రతిభతోనే ముందుకు వెళ్ళాడు.I am proud of him. అని చెప్పటం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఆయన నా వివాహానికి రాలేకపోయారు. నేను ఇటీవల ఇండియాకి వెళ్ళినపుడు 19 వ తేదీన కోటేశ్వరరావు గారి మరణ వార్త తెలిసింది. జూన్ 20 వ తేది ఉదయం కడసారి ఆయన పార్ధివ దేహాన్ని చూడటానికి బందరులో వారింటికి వెళ్లాను. ఒక పక్క బాధ మరో పక్క ఆఖరి చూపుకి నోచుకోగలిగానన్న ఆత్మతృప్తి తో ఆయన అంతిమ యాత్ర వెంట నడవటం నా అదృష్టంగా భావించాను. ఆయన మీద నాకున్న గౌరవ ప్రపత్తులే నాకు కడసారి చూపుని అందించాయని ధృడంగా నమ్ముతున్నాను
 
జాతి గర్వించదగిన దేశభక్తుడు 
తెలుగుజాతి రుణపడే పత్రికాసంపాదకుడు 
అహరహం తెలుగువిద్యార్ధి కోసమే కృషిచేస్తూ 
విద్య ద్వారా సామాజిక సేవ సాధ్యమని నిరూపించిన ధీశాలి 
కుటుంబం ,పత్రిక రెండు కళ్ళుగా
పత్రికా నిర్వహణ,అభివృద్ధి ఊపిరిగా 
రావూరి భరద్వాజ,మునిమాణిక్యం వంటి ఎందరో రచయితల తొలి రచనలు 
ప్రచురించి ప్రోత్సహించిన సాహిత్యాభిమాని,స్నేహశీలి 
ఆశావహ ధృక్పధం కలిగిన నిత్య చైతన్యస్పూర్తి మన కొల్లూరి...
 
Dated : 26.07.2014

 

This text will be replaced