మూడేళ్ళ ముచ్చట్లుBack to list

 

మూడేళ్ళ ముచ్చట్లు

మూడేళ్ళ ప్రయాణం, మూడింతల సంతోషం. 2010 జనవరి 14 న ప్రారంభమైన ఈ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలకి వేదిక అయ్యింది. అసలు వెబ్ సైట్ అనే పదాన్ని పలకటం రాక వెబి సైటు అని పిలిచే వెనకటి తరం చేతనే "ఆ డాట్ కామ్ లో పెట్టమని చెప్పండ్రా" అమెరికాలో అబ్బాయిలు చూస్తారు అనిపించింది ఈ మూడేళ్ళ ప్రయాణం. ఇదెన్నాళ్ళు నడుస్తుందిలే అనుకున్న వాళ్ళ చేత బాగా అప్ డేట్ చేస్తున్నారుగా అనిపించింది ఈ మూడేళ్ళ ప్రయాణం. ఊర్లో ఎవరైనా చనిపోతే ఫోన్ కాల్ కంటే ముందే తెలియచేసి, చాలా మందికి చనిపోయిన వారి ఆఖరి చూపుని అందించింది ఈ మూడేళ్ళ ప్రయాణం.వెబ్ సైట్ లో చనిపోయిన వారి సమాచారం తెలుసుకుని వారి బంధువులని పరామర్శించటానికి వెళ్ళిన వాళ్ళున్నారు.అరె మీకెలా తెలిసింది విషయం అని ఆశ్చర్యపోతే ఉందిగా మన ఊరి టివి 9 అనే సమాధానాలు చెప్పించింది ఈ మూడేళ్ళ ప్రయాణం.
ఒక్క క్లిక్ తో ఊర్లో పెళ్లిని ఖండాలు దాటించి, కంప్యూటర్ మానిటర్ మీద అక్షతలు జల్లి తమ ఆప్తుల్నిఆశీర్వదించిన ఉద్వేగపూరిత క్షణాలకి వేదిక అయ్యింది ఈ మూడేళ్ళ ప్రయాణం. దాదాపు గ్రామంలో జరిగిన పదికి  పైగా వివాహాలని లైవ్ ద్వారా అందించాము.ఇప్పుడు నెట్ లో లైవ్ అనేది గ్రామంలో పెళ్లి వీడియో ప్యాకేజిలో ఒక భాగం.ఇంతకుముందే నగరాల్లో ఈ సంస్కృతి ఉన్నా,గ్రామం లో దీనిని పరిచయం చేసిన ఘనత మాత్రం మాకే దక్కింది.
 
 
14.01.2010 న వెబ్ సైట్ ఆవిష్కరణ సందర్భంగా మనఘంటసాల టీమ్
 
 
 
      ప్రధమ,ద్వితీయ వార్షికోత్సవ దృశ్యాలు 
 
కిరాణా కొట్టు రామయ్య గారు, మందుల షాపు గోపాలకృష్ణ గారు, పాలవాను చిట్టియ్య గారు, కారెవరూ వెబ్ సైట్ లో అక్షరాలకి అనర్హులు,మనం నెమరు వేసుకునే మధుర జ్ఞాపకాలకి ఆనవాళ్ళు. వెబ్ సైట్ లో గుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో,మనం పట్టించుకోని స్మశానానికి అదే ప్రాముఖ్యత. పేరు వినటం తప్ప ఎప్పుడూ చూడని సత్రం విశేషాలని,చిత్రాల్ని అందించాం. ప్రభుత్వ స్కూల్లో సౌకర్యాల లేమి పై విజ్ఞాపన , ప్రైవేటు విద్యనందించిన స్కూల్ ని మరువని విజ్ఞత. కాలం చెల్లిన కమ్యూనిష్టులు కాలమ్ కెక్కారు, నయా కాపిటలిస్టులు కూడా కధనాల్లో భాగం అయ్యారు. గ్రామంలో మగ్గం నేస్తున్న నేతన్న, ఆరుగాలం పండించే రైతన్న,ఇద్దరూ ఈ అంతర్జాల చిత్రాల్లో ఒదిగిపోయారు. మనుషుల వైద్యులని, పశువుల వైద్యులని ఒకే గాటన కట్టేశాం. కొడాలిలో కత్తుల విన్యాసాలే కాదు, కత్తి లాంటి మన ఊరి ఆడపడుచుల గడుసుదనమూ మన కబుర్లకి తోడైంది. కొంతమంది అడుగుతున్నట్లుగా తెలుగు భాషాభివృద్ది కి ప్రత్యేక అభివృద్ధి 'మండళ్ళు' ఏమీ అవసరం లేదు, ఇలాంటి 'మండలి' లు ఉంటే చాలు...అని మండలి బుద్ధప్రసాద్ గారి గురించి నా అనుభవాలు రాసిన మూడు నెలలకే ఆయన తెలుగు భాషాభివృద్ది మండలి చైర్మన్ అయ్యారు.ఇది నా నోటి మహిమ అని చెప్పను కానీ,ఆ మాట నిజమైంది అని చెప్పచ్చు. గ్రామానికి సంభంధం లేని "నిర్జనవారధి" పుస్తక సమీక్షని ఈ వెబ్సైట్ లో చూసి ఆ పుస్తకాన్ని కొనుక్కుని చదివిన వాళ్ళున్నారు.ఈ ఊరు గొడవలు నీకెందుకురా, అంత దూరం వెళ్ళినా వదలవా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, ఇవన్ని నీకేమి ఉపయోగపడవు అని ప్రేమగా మందలించిన శ్రేయోభిలాషులు. వివాదాస్పద విషయాలకి చోటు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించే సలహాదారులు. ఇవన్నీ ఈ మూడేళ్ళ ప్రయాణానికి సోపానాలు. నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఉన్న సమాచారంలో ఈ వెబ్ సైట్ లో పెట్టింది కేవలం ముప్పై శాతమే.ఇక ఈ సంవత్సరం ఎక్కువమంది చదివిన కధనం మాసిపోతున్న జ్ఞాపకాలు. బాగా పాపులర్ అయిన ఆర్టికల్ అమ్మో ఘంటసాల అమ్మాయిలా!! వార్తల్లో ఎక్కువమంది చదివింది బండి వెంకటేశ్వరరావు హత్య. ఈ సంవత్సరం మొత్తం సందర్శకుల సంఖ్య 7776.మన దేశాన్ని మినహాయిస్తే సందర్శకుల సంఖ్య లో అమెరికాదే అగ్రస్థానం.తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ,లండన్ ఉన్నాయి.ఇక ఈ సంవత్సరం కధనాలతో పాటు వెనుక నా వాయిస్ ఓవర్ కూడా ఉండటం గమనించే ఉంటారు.దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.కొంతమందికి తెలుగు మాట్లాడటం వచ్చు కాని, చదవటం రాదట. నాకేమో ఇంగ్లీష్ లో రాయటం రాదు.భావ వ్యక్తీకరణకి మాతృభాషని మించింది లేదు. కామాలు, ఫుల్ స్టాప్ లు మిస్ అయినా, వాయిస్ లో ఆ పదాల అర్ధం సరిగ్గా తెలుస్తుందనే ఈ ప్రయత్నం. మరొక కారణం, ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఆ కధనాన్ని వింటూ వేరే పని కూడా చేసుకునే సౌలభ్యం. ఇక్కడ మీరు చూస్తున్న వ్యాఖ్య దీనికి నిదర్శనం..
 

 
ప్రతి వార్షికోత్సవానికి ఏదో ఒక కార్యక్రమం చెయ్యటం రివాజు గా ఉండేది. మొదటి సంవత్సరం ఈ బుక్స్ ఆవిష్కరణ. రెండవ సంవత్సరం కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము.కాని ఈ సంవత్సరం ఏమీ చెయ్యటానికి వీలు లేకపోయింది.కారణం మీకు తెలుసు,నేను ఇండియాలో లేకపోవటమే.
మీ ఆదరణ, అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ...అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఊరి విషయాలే కాకుండా అప్పుడప్పుడు నా స్వోత్కర్ష ని కూడా భరిస్తున్నందుకు వీక్షకులకి ధన్యవాదాలు.
 
Dated : 13.01.2013
 
 

 

This text will be replaced