నిర్జనవారధి - IIBack to list

 

నిర్జనవారధి - II

ఈ ఆత్మకదలో నాకు ఆసక్తి కలిగించిన మరో అంశం, మన గ్రామానికి చెందిన శ్రీ  వేమూరి నాగేశ్వరరావు, శ్రీమతి శాంతమ్మ దంపతులతో కోటేశ్వరమ్మ గారి అనుబంధం. ఇది చదువుతున్నపుడు, ఈ వెబ్సైట్ రూపకల్పనలో విషయ సేకరణ కోసం హైదరాబాదులో వేమూరి నాగేశ్వరరావు గారితో గడిపిన సాయంత్రాలు గుర్తొచ్చాయి. ప్రతి రోజూ సాయంత్రం ఆఫీసు అయిపోగానే వారింటికి వెళ్ళిపోయేవాడిని. 92 ఏళ్ళ  వయసులో కూడా నేను అడిగిన ప్రశ్నలకి ఎంతో వివరంగా చెప్పిన ఆయన ఓపికకి హాట్సాఫ్ అనిపించేది. వారి సతీమణి శాంతమ్మ గారు కొన్ని విషయాల్లో వారిస్తున్నా సరే ఆనాటి సంఘటనలని కళ్ళకి కట్టినట్లు వివరించేవారు. అలాగే కొందరు వంశస్తులు ఘంటసాలకి ఎలా వచ్చారనే ఆసక్తి కరమైన అంశాలు ఆయన దగ్గరే తెలుసుకున్నాను. తదనంతర కాలంలో నాగేశ్వరరావు గారు  వేమూరి వారి చరిత్ర పేరిట ఒక గ్రంధాన్ని కూడా వెలువరించారు.ఆ పుస్తకం ఇదే వెబ్సైట్ లో ఈ బుక్స్ లో చూడవచ్చు.

 

ఇక విషయంలోకి వస్తే , జైలునుంచి విడుదలైన సీతారామయ్యని మనవరాళ్ళు (కరుణ కుమార్తెలు) ఇంటికి తీసుకు వచ్చారు. సీతారామయ్యని చూడడానికి ఆమె ముందు నిరాకరించినా, కాళోజీ నారాయణరావు, కాట్రగడ్డ నారాయణరావు, మహీధర రామ్మోహనరావుల ప్రోద్బలంతో ఆమె సీతారామయ్యని చూడ్డానికి వెళ్ళింది. అన్నేళ్ళ తర్వాత చూస్తున్నప్పుడు సీతారామయ్య ఆమె కళ్ళకి మామగారిలా కనబడ్డాడే కానీ సీతారామయ్యలా కనపడలా! మతిస్థిరత్వం తగ్గిన సీతారామయ్యని చూడడం బాధగా అనిపించి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో జీవించటం మొదలు బెట్టింది. కొన్నాళ్ళకు సీతారామయ్యకూడా మరణించాడు. ఎనభయ్యేళ్ళ జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం ధారపోసిన మనిషి చనిపోతే చూడ్డానికి కూడా పార్టీ వాళ్ళెవరూ రాలేదు. “కోటేశ్వరమ్మను సీతారామయ్య తనకి అనుకూలంగా లేదని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను పార్టీ వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?”

“భూత భవిష్యత్తులకు పట్టుకొమ్మగా నిలిచి, అటు తల్లి తరానికీ, ఇటు బిడ్డల తరానికీ బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటు ఒకరు, ఇటు ఒకరు వెళ్ళిపోతే… కోటేశ్వరమ్మ నిర్జనవారధిగా మిగిలిపోయింది” అన్నారట కవి సోమసుందర్. ఎందరి బలవంతంచేతనో ఆమె వ్రాసిన ఆత్మకథకు సోమసుందర్ మాటనే శీర్షికగా ఎంచుకున్నారు కోటేశ్వరమ్మ.

ఈ కథలో ముఖ్యపాత్రలు ముగ్గురు – కోటేశ్వరమ్మ, ఆమె తల్లి అంజమ్మ, సీతారామయ్య. భర్త వద్దంటున్నా, ఊరు కాదంటున్నా, పట్టు పట్టి కూతురికి పునర్వివాహం చేయించింది అంజమ్మగారు. తాను చనిపోయేవరకూ కూతురికీ, కూతురు బిడ్డలకూ అండగా నిలబడింది ఆవిడ. అనేక సందిగ్ధసమయాల్లో అంజమ్మగారి కామన్ సెన్స్ సలహాలే కోటేశ్వరమ్మకి దశానిర్దేశాన్ని చేశాయి. కూతురి కుటుంబంతో పాటు, ఆమె పార్టీ అభివృద్ధికీ, కార్యకలాపాలకీ -ముఖ్యంగా రహస్యపు రోజుల్లో – ఆమె చాలా కృషి చేసింది. చనిపోవటానికి వారం రోజులముందు ఆవిడ వెల్లడించిన చివరి కోరిక -ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలిసి పనిచేయమని. ఉభయపార్టీలవారికి ఆమె గుర్తుగా చెరొక వేయి రూపాయలివ్వటానికి ఏర్పాట్లు చేసి మరీ చనిపోయింది ఆవిడ. ఆ రెండువేల రూపాయలు వేమూరి నాగేశ్వరరావు గారి దగ్గరే దాచింది.
 
 
కొండపల్లి సీతారామయ్య వ్యక్తిత్వమూ, జీవిత పరిణామాలూ ఈ పుస్తకంలో ఆవిష్కృతమౌతాయి. వివాహపు తొలిరొజుల్లోనూ, పార్టీ నిర్మాణక్రమంలోనూ, నిషేధపు రోజుల్లోనూ ఆదర్శ జీవితాన్ని గడపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ధీరోదాత్త త్యాగమూర్తిలా ప్రకాశిస్తాడు (సంపన్నుడు కాకపోయినా త్యాగ సంపన్నుడు అని ఒకసారి కోటేశ్వరమ్మే అనుకొంటుంది, అతని ఆస్తిని కమ్యూనిస్టు పార్టీకి రాసిచ్చేసిన సంఘటనను గుర్తుచేసుకొని). పార్టీతో గొడవలు పెట్టుకుని, కోటేశ్వరమ్మని ఒంటరిగా వదిలేసి, ఆవిడ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు మొండివాడిగా, నిర్దయుడిగా, దుర్మార్గుడిగా కనిపిస్తాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రజలకూ, ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేస్తే, ఆ ప్రజలూ, ఉద్యమమూ మతిస్థిమితం తప్పి ఆసరా అవసరమైన రోజుల్లో అతన్ని పట్టించుకోకుండా వదిలేశారు. చివరికి మనుమరాలు చేరదీసి సేవ చేయవలసి వచ్చిన దైన్యావస్థ చూస్తే జాలి వేస్తుంది. “అతను కూడా సుఖంగా బతుకలేదు. అతడు దుర్మార్గుడు కాడు. అతని బలహీనతలు చూడకుండా అతనిలో ఉన్న ఉద్యమకారుణ్ణీ, త్యాగనిరతినీ చూసి, గౌరవించ”మనే వారి మాటను తోసివేయలేము.

కోటేశ్వరమ్మవంటి నాయికను ఏ రచయితైనా సృష్టిస్తే అబ్బురపడుతూ ఆ కథను చదువుతాం. ఎంతటి చిత్రమైన జీవితం? ఇంత జరిగినా ఆమె ఎవరిగురించీ కోపంతో, ద్వేషంతో, కసితో రాయలేదు. క్షమించే తత్వం పుష్కలంగా ఉంది ఆమెలో. సీతారామయ్య చివరిరోజుల గురించి మాట్లాడుతూ, ఆయనంటే, “అప్పటికి నాకే ఆసక్తీ లేదు. ప్రేమా లేదు, ద్వేషమూ లేదు! మొదట్లో ఇంత దుర్మార్గమా అనుండేది కానీ ఆ తరవాత, ఏమోలే, అతను మాత్రం ఏం సుఖపడ్డాడు అనుండేది” అంటారు. సీతారామయ్యని చూడడానికి, కలవడానికి ముందు నిరాకరించినా, తర్వాత జాలిపడి కలత చెందారు. అతనికి తానేమీ సేవలు చేయలేదని చెప్తూనే, తన పిల్లలకు వండి పంపినట్లే అతనికి ఇష్టమైన కూర వండి పంపేదాన్నంటారు. సీతారామయ్య మృతదేహాన్ని చూసినప్పటి ఆమె ఆలోచనలు చదివితీరాలి. అతని ముఖం ఆఖరుసారిగా చూసినప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది అతను తనకు చేసిన అన్యాయం కాదు, 1940 మేడే నాడు గొంతెత్తి ఎగరాలి ఎగరాలి మా ఎర్రజెండా అంటూ అతను పాడటం.

జీవితక్రమంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, జీవితమంతటా ఆమె తనను ఉద్యమకారిణిగా, కార్యకర్తగానే భావించుకుంది, అలానే జీవించింది. ఆర్థికంగా కష్టాలు పడుతున్న రోజుల్లో, ఆమెకు సహాయపడటానికి సిద్ధమైన ఆప్తులను సున్నితంగా తిరస్కరించడానికి ఎంతటి ఆత్మాభిమానం, మనోధైర్యం కావాలి? ఉద్యమనాయకురాలిగా, కళాకారిణిగా జేజేలు అందుకున్న మనిషి ముప్పైఏడేళ్ళ వయసులో పదో తరగతి పాఠశాలలో చేరటానికి ఎంతటి ధైర్యం కావాలి?

సీతారామయ్య విడిపోయి వెళ్లిపోవటానికి కారణాలు, అప్పటి సంఘటనల క్రమం సరిగా అర్థం కాలేదు (సరిగా వివరించలేదు). పుస్తకంలో మరెక్కడా చూపని దాపరికం, తమ వివాహంలో మూడో వ్యక్తి ఐన ‘ఆమె’ విషయంలో చూపారు ఎందుకో. ‘ఆమె’ గురించి ఎక్కడా ఒక్కమాట కూడా విమర్శనాత్మకంగా వ్రాయకపోవడాన్ని కోటేశ్వరమ్మగారి సంస్కారానికి నిదర్శనంగా అర్థం చేసుకున్నాను.

రెండేళ్ళుగా కోటేశ్వరమ్మ విశాఖపట్నంలో మనవరాండ్ర దగ్గర ఉంటున్నారు. హైదరాబాదులో పుస్తక ఆవిష్కరణకి కూడా ఆవిడ రాలేదు. రచయిత రాకుండా ఆవిష్కరించబడ్డ పుస్తకంగా ఈ నిర్జన వారధి మిగిలిపోయింది.
 

 

Date : 13.10.2012

 

 

This text will be replaced