నేనెరిగిన 'మండలి'Back to list

 నేనెరిగిన 'మండలి'

రాజకీయ నాయకుల ప్రసంగాలని కేవలం ఎన్నికల ప్రచార సమయంలోనో లేక టి.వి లో స్టేట్మెంట్ల రూపం లోనో తప్ప సాహితీ చర్చల్లో, తెలుగు భాష పరిరక్షణా వేదికలపై వినటం కద్దు. మొట్ట మొదటి సారి ఆ ప్రసంగాన్ని విన్న సందర్భం గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారి జీవిత చరిత్ర నా జీవన నౌక పుస్తక ఆవిష్కరణ సమయంలో శాసన మండలి జూబ్లి హాలులో. మండలి బుద్ధ ప్రసాద్ గారిని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా లేదా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. నాకు, ఈ సైట్ కి సంభంధించినంత వరకు అది అనవసరం, అప్రస్తుతం. మొట్ట మొదటిసారి నేను మండలిని కలిసింది 2004 ఎలక్షన్ల సమయంలో అవనిగడ్డ లోని వారి సొంత ఇంటిలో. ఆ ఎలక్షన్ల నుంచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రక్రియ ప్రారంభం అయింది. అప్పట్లో నేను పనిచేసే సంస్థ, డమ్మీ ఓటింగ్ యంత్రాలని తయారు చేసి ప్రతి ఓటింగ్ బూత్ దగ్గరా ఆయా అభ్యర్ధులు ఓటింగ్ పై ఓటర్లకి DEMO ఇస్తారనే కాన్సెప్ట్ తో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అభ్యర్డులకి వాటిని విక్రయిస్తూ మన ప్రాంతంలో ఆ భాధ్యత ని నాకు అప్పగించారు. ఆ సందర్భంలోనే వారిని కలిసే అవకాశం కలిగింది. ఆ ఎలక్షన్లో వారు గెలవటం మంత్రిగా పనిచెయ్యటం అందరికి తెలిసిన విషయాలే. ఆ పదవీ కాలంలోనే ఆయన దివిసీమ ఉత్సవాలని ఘనంగా నిర్వహించారని వినటం తప్ప నాకు ఆ కార్యక్రమం గురించి వివరాలు తెలియదు. నేను ప్రత్యక్షంగా ఆయన్ని మళ్లీ కలిసిన సందర్భం 09.08.2010 న  శాసనమండలి జూబ్లి హాలులో ఒక ప్రేక్షకుడి గా.(ఇక్కడ క్లిక్ చెయ్యండి) ఆరోజు ఆయన ప్రసంగం నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. చరిత్ర మీద, సాహిత్యం మీద, ఆనాటి వ్యక్తుల పట్ల ఆయనకున్న అపరిమిత అవగాహన ఆయనొక రాజకీయ నాయకుడన్న విషయాన్నే మర్చిపోయేలా చేసింది. అత్యంత వివరణాత్మకంగా, నిండైన సమాచారంతో, సమగ్ర అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న గొప్ప సాహితీ ప్రేమికుడిగా ఆ క్షణం ఆయన నాకు కనిపించారు.
 
మన గ్రామాన్ని బౌద్ధ క్షేత్రంగా ప్రభుత్వం తరపునుంచి గుర్తించబడటానికి ఆయన చేసిన కృషి మనం మరువలేనిది. ఈ సందర్భంలో మన గ్రామం తరపునుంచి కృషి చేసిన వేమూరి విశ్వేశ్వరావు గారిని కూడా గుర్తుచేసుకోవటం మన కర్తవ్యం. మన జిల్లాలో ఉన్న ప్రతి ప్రాంతం మీద బుద్ధ ప్రసాద్ గారికున్నచారిత్రక అవగాహన అమోఘం అనిర్వచనీయం. ఘంటసాల చరిత్ర పుస్తకాన్ని పునర్ముద్రించాక ఆయనకి ఒక కాపీ ఇవ్వాలని అమీర్ పేటలో అయన ఇంటికి వెళ్ళాను. ఆయన రావటం ఆలస్యం అవ్వటంతో కొంత సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆక్రమంలో నేను ఆ హాలులో ఉన్న ప్రతి వస్తువూ చూసినపుడు ప్రతి ఒక్కటీ ఆయన సాహిత్యాభిలాషని ప్రతిబింబించింది. అది ఒక రాజకీయ నాయకుడి ఇల్లులా అనిపించలేదు. ప్రతి వస్తువు అక్షరాలని పలికించింది. షోకేసుల్లో కొలువుదీరిన మెమెంటోలన్ని సాహితీ సదస్సుల సువాసనల్నే గుభాళిస్తున్నాయి. నేను తిరిగి వచ్చేటపుడు అయన నాకిచ్చిన అపురూపమైన బహుమతి కృష్ణాజిల్లా సర్వసం అనే అపురూప గ్రంధం. తానే సంపాదకుడిగా కొన్ని వేల ఏళ్ల జిల్లా చరిత్ర ని క్రోడీకరించి గ్రంధస్థం చేయించిన అయన కార్య దీక్ష కి ఎన్ని ప్రసంసలు కురిపించినా అవి చంద్రుడికో నూలు పోగు లాంటివే. ప్రస్తుతం తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మండలి ఆ పదవికి నూటికి వెయ్యి శాతం అర్హులని అనటంలో అతిశయోక్తి లేదు..నేనుండేది యూరప్ లో కావటంతో జులై 14 ,15 తేదిల్లో లండన్లో జరిగిన తెలుగు చరిత్ర మహా సభలకి వెళ్ళాలని ఎంతో ఆరాట పడ్డాను. కానీ అప్పటికే సమయం తక్కువగా ఉండటంతో వీసా దొరకటం కష్టం అయ్యింది. నేను వెళ్ళాలని ఆరాట పడటానికి 50 శాతం కారణం ఆ సభలకి మండలి బుద్ధప్రసాద్ గారు అధ్యక్షత వహించటం ఆయితే, మరో యాభయి శాతం బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న మన చారిత్రక సంపదని చూడాలనుకోవటం. కొంతమంది అడుగుతున్నట్లుగా తెలుగు భాషాభివృద్ది కి ప్రత్యేక అభివృద్ధి 'మండళ్ళు' ఏమీ అవసరం లేదు, ఇలాంటి 'మండలి' లు ఉంటే చాలు....
 
Dated : 22.07.2012
 
 

This text will be replaced