లాల్ సలాంBack to list

 

లాల్ సలాం
కమ్మ,రెడ్డి కలిస్తే కామ్రేడ్ అని ఒక కమ్మాయన చెప్పినప్పుడు, నిజమే కదా అనుకున్నా. బడుగు వర్గాల కోసం పాటుబడే కమ్యునిష్టు నాయకులు రెండు అగ్రకులాలకి చెందిన వారే అవ్వటం మన రాష్ట్రం లో ఉన్న పెద్ద వింత. వారసత్వ రాజకీయాలు లేని, వారసులు ఏ మాత్రం రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి కనబరచని ఏకైన పార్టీ ఉందంటే అది  కమ్యునిష్టు పార్టీలే. ఒకప్పుడు మన ఊరు నిడుమోలు నియోజక వర్గం లో ఉండేదనే విషయం చాలా మందికి తెలిసిందే. చిన్నప్పుడు జరిగిన రెండు మూడు ఎలక్షన్లు నాకు బాగా గుర్తు. ఎప్పుడు చూసినా మన నియోజకవర్గానికి పాటూరి రామయ్య కమ్యునిష్టు పార్టీ తరపున పోటీ చేసేవారు. అది సి.పి.ఐ లేక సి.పి.ఎమ్ పార్టీ నో గుర్తు లేదు. కత్తి, సుత్తి, కొడవలికే మీ ఓటు అంటూ ప్రచారం జరుగుతూ ఉండేది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినపుడు గుడి ముందు ఉన్న కమ్యునిష్టు దిమ్మ దగ్గర కూర్చునేవాళ్ళం.
మన గ్రామం లో ఒకప్పుడు కరడు గట్టిన కమ్యునిష్టులుగా ఉన్నఅగ్రకులాల వారంతా ఎన్.టి.ఆర్ పార్టీ పెట్టగానే తెలుగు దేశం లో చేరిపోయారు. మిగతా సామాజిక వర్గాల వారు మాత్రం కమ్యునిష్టులు గానే చెలామణి అవుతూ ఉండేవారు. సోవియట్ భూమి అని రష్యా లో రెపరెపలాడుతున్న ఎర్ర సామ్రాజ్యపు విశేషాలతో 1989 వరకు దళసరి కాగితంతో, రంగుల్లో వచ్చే కమ్యునిష్టు పత్రిక పిల్లల నోటు పుస్తకాలకి అట్టలు వేసుకునే కాగితంగా మారిపోయింది. నేను కూడా ఆ పత్రిక ని అట్టలు వేసుకోవటానికి ఉపయోగించిన గురుతులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1999 వరకు ఎప్పుడూ కమ్యునిష్టుల తో పొత్తు పెట్టుకోవటంతో మన నియోజక వర్గంలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశం రాలేదు. అదీ కాక రిజర్వుడు కావటంతో అగ్రకులాధిపత్యం ఉన్న ప్రాంతం అయినా ఆ కులాల వారికి పోటీ చేసే అవకాశం లేకపోయింది. అందుకే పసుపు రంగు లోకి మారిన కమ్యునిష్టులంతా ఎరుపు రంగు పార్టీ సానుభూతి పరులుగానే ఉండేవారు. నాకు ఊహ తెలిసే నాటికే కమ్యునిజం దాదాపు కనుమరుగవుతున్న దశ లో ఉంది. కానీ అనుకోకుండానే ఆ చరిత్ర కి సంభందించిన పుస్తకాలు ఎక్కువ చదివే అవకాశం కలిగింది. అలా అని విధానాల పట్ల ఆసక్తి మాత్రం కాదు. ఆ సాహిత్యం,చరిత్ర ఆసక్తి కరంగా ఉండటంతో కనపడ్డ ప్రతి పుస్తకం చదివేవాడిని. మలి తెలంగాణా ఉద్యమ ప్రారంభం,నేను హైదరాబాదుకి మకాం మారటం ఒక్కసారే జరిగాయి. తెలంగాణా సాయుధ పోరాటం,స్వతంత్రం వచ్చాక ఆ ప్రాంతం లో జరిగిన పోలీసు చర్య,నిజాం కి వ్యతిరేకం గా కామ్రేడ్లు సాగించిన అలుపెరగని పోరాటం, విప్లవ రచయితలు కాళోజీ నారాయణ రావు, రావి నారాయణ్ రెడ్డి ల గురించి తెలుసుకున్నచిన్న చిన్న సంగతులు ఆసక్తి కరంగా ఉండటంతో వాటికి సంభందించిన పుస్తకాల కోసం అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర బుక్ హౌస్ కి వెళ్లి మరీ ఆ పుస్తకాలు కొనుక్కుని చదివే వాడిని. ఆ క్రమంలోనే  తెలంగాణా రాలిన రత్నాలు వంటి పలు రచనలు చదివే అవకాశం కలిగింది. కేవలం నల్లగొండ,వరంగల్ జిల్లాలోనే అత్యంత ప్రాబల్యం ఉన్న పార్టీ గా తెలిసిన నాకు మన ప్రాంతంలో ఉన్న కమ్యునిష్టుల చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ. వృత్తి రిత్యా ముద్రణ రంగంలో పని చేస్తుండటంతో ఒక రోజు మిత్రుడిని కలవటానికి ఓ ప్రెస్ కి వెళ్ళినపుడు వారొక పుస్తకం అచ్చు వేస్తున్నారు. దాని పేరు చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం. ఇదెప్పుడు జరిగింది అసలు, ఎవరు రాసారు ఇది అని ఆశ్చర్యంగా అడగటంతో ఆఫీసు లో కూర్చున్న ఒక ఎనభై పైబడిన పెద్దాయన్ని చూపించారు. ఆయనే కావూరి కుటుంబరావు గారు. హైదరాబాదులో మాదాపూర్ వెళ్ళేటప్పుడు వాటర్ ట్యాంక్ పైన కనిపించే కావూరి హిల్స్ అనే పదాల్లో మొదటి మూడక్షరాలు ఆయన మీద గౌరవంతో పెట్టుకున్నవే అని చాలామందికి తెలియకపోవచ్చు.ఆ పుస్తకాన్ని ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు.ఈ వెబ్ సైట్ లో e-books విభాగం లో మొట్ట మొదట పెట్టిన పుస్తకం కూడా అదే.
 
Click on Image to read the Book
చల్లపల్లి లో ఉన్న కోట ని చాలా సార్లు చూసినా,ఆ కోట మాటున దాగిన ఈ చారిత్రక ఉద్యమం గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిది కరెక్ట్ అనేది బేరీజు వేయకుండా ఆనాటి చారిత్రక నేపధ్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత తోనే ఈ పుస్తకాన్ని చదవటం మొదపెడితే ఆ ప్రాంతంతో అనుభంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం తప్పక నచ్చి తీరుతుంది. చరిత్ర యావత్తు పోరాటం కాకపోవచ్చు. కానీ పోరాటం మాత్రం చరిత్రే అంటూ రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు నిజంగా అలరిస్తాయి.ఈ మధ్య అంతే అత్యంత ఆసక్తి గా చదివిన మరో పుస్తకం, ఇలా మిగిలాం. పదండి ముందుకు,పదండి తోసుకు అని జనాల్లో చైతన్యాన్ని రగిలించిన కామ్రేడ్లు ప్రపంచీకరణ తరువాత తామెలా వెనుకబడి పోయారో, కమ్యునిజం పతనానికి కారణాలు వివరిస్తూ చలసాని ప్రసాదరావు గారు రాసిన ఈ పుస్తకం ఆ సిద్ధాంతపు లోతుల్ని ఆవిష్కరించింది.''కమ్యూనిస్టులంటే నిప్పులాంటి వాళ్లనీ, చెప్పేదానికి మనసా, వాచా, కర్మేణా కట్టుబడి ఉంటారనీ ప్రగాఢంగా నమ్మబట్టే గదా ప్రజలు అంతకుముందు పార్టీని అక్కున చేర్చుకుని, ఆపత్కాలంలో కార్యకర్తల్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ కాపాడేరూ, తామూ స్వయంగా కష్టనష్టాల్ని సహించేరూ, దారుణ నిర్బంధాల్ని భరించేరూ! మరి ఆ తర్వాత....? ఆ ప్రజల్ని మనమే విస్మరించినా....లేక వారే మనల్ని విస్మరించనారంభించినాఅందుకు మూలం ఎక్కడుంది?'' అనేక దశాబ్దాల పాటు ఈ దేశంలో అత్యంత పటిష్టమైన నిర్మాణంతో, విరోధులు సైతం మెచ్చుకున్న క్రమశిక్షణతో, ప్రజాహితం తప్ప మరో ధ్యేయంలేని లక్ష్యశుద్ధితో పీడిత ప్రజల ఆశారేఖగా అభివృద్ధి చెందుతూ వచ్చిన కమ్యూనిస్టు పార్టీ - ఆ తరువాతి కాలంలో ఎందుకిలా నీరసించిపోయింది? సిద్ధాంత విభేదాలతోపాటు ఇందుకు కారణమైన క్రమశిక్షణారాహిత్యం, అలక్ష్యం, అలసత్వం, నిర్వ్యాపారత ఎలాంటివి? బాల్యం నుండి కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంస్థలు, పత్రికలు, ప్రముఖుల మధ్య పెరిగి... రచయిత, చిత్రకారుడు, కళా విమర్శకుడు, పత్రికా సంపాదకుడుగా ఎదిగి, ఎందరికో సుపరిచితుడైన చలసాని ప్రసాదరావు రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఉభయ కమ్యూనిస్ట్‌పార్టీ (సిపిఐ, సిపిఎం)ల్లోని స్వీయానుభవాలు,ఎలా ఉండవలసిన వాళ్ళం ఇన్నేళ్ళ - ఇన్ని పోరాటాల తర్వాత ఇలా... ఎలా మిగిలేం అనే ఆవేదనకు ఒక సమాధానం. 'అందరం అద్దాలమేడల్లో ఉంటున్నాం? ఎవరి మీద రాయేస్తం' అని ఆత్మన్యూనతకు గురవుతున్న రచయితలను మేల్కొలిపేందుకు చలసాని ప్రసాదరావుగారి ప్రయత్నమే - ఇలా మిగిలేం
 
 ''చరిత్ర అధ్యయనం చరిత్రను నిర్మించడానికే ఉపయోగపడాలి అని విశ్వసిస్తే, ఈ పుస్తకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.''
ప్రపంచం మారితే ఆ మార్పు ని బట్టి నేను వ్యవహరిస్తాను. అది లెఫ్ట్ సైడ్ వెళుతుంటే నేను లెఫ్ట్ సైడ్ కే వెళతాను. అది రైట్ వైపు వెళుతున్నా నేను మాత్రం లెఫ్ట్ కే ఉంటాను అనే కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఇంకా పాటిస్తూ రేపటి తమ వారసుల కోసం ఆలోచించకుండా తమ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న కామ్రేడ్ల కి జోహార్లు....
 

 Dated : 07.06.2012

 

 

This text will be replaced