అసమర్ధుడి సంపాదకీయంBack to list

అసమర్ధుడి సంపాదకీయం

ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతుండగా ఓ వ్యక్తి అటుగా వచ్చి చూస్తున్నాడు.అతడు చెక్కుతున్న శిల్పం లాంటిదే మరోటి పక్కన ఉండటం చూసి ఆ శిల్పిని అడిగాడు. మళ్లీ అలాంటి శిల్పమే చెక్కుతున్నావేమిటి అని. దానికా శిల్పి బదులిస్తూ అందులో చిన్న లోపం ఉండిపోయింది అందుకే మరోటి చెక్కుతున్నాను అని. ఆ వ్యక్తి ఆ శిల్పాన్ని మళ్లీ పరీక్షగా చూసాడు తనకి అందులో లోపం ఏమిటో కనపడలేదు. మళ్లీ శిల్పిని అడిగాడు ఇందులో లోపం ఏమి లేదుగా అని. ముక్కు దగ్గర కొద్దిగా తేడా ఉంది అని చెప్పాడు. మళ్లీ పరీక్షగా చూసాడా వ్యక్తి. దగ్గరగా చూస్తే తప్ప కనపడని లోపం అది. ఇది ఎవరికీ కనపడదు,తెలియని లోపమే కదా దీనికోసం మళ్లీ ఇంకోటి చెక్కాల్సిన అవసరం లేని లోపమే కదా అన్నాడు. లోపం ఉందని నాకు తెలుసు కదా అని బదులిచ్చాడా శిల్పి. ఇందులో నీతి ఏంటంటే మనం చేసే పనిలో లోపం ఉందని తెలిసినా ఎవరికీ తెలియదు అని కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఆ లోపం మనకి తెలుసు. ఈ వెబ్ సైట్ లో లోపం కూడా నాకు తెలుసు. కానీ అది వాంచితంగా చేస్తోంది కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది నా అసమర్ధత. ప్రతి విషయాన్ని కులంతోనూ,వర్గాలతో నూ ముడిపెట్టి చూడటం మన దేశంలో,రాజకీయాల్లోనూ ఉన్న సంస్కృతి. కులప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక, రాజకీయ సమీకరణాలు, చివరకి వినోదం పంచే సినిమా పరిశ్రమ కూడా కులప్రాతిపదికనే బలా బలాల్ని అంచనా వేస్తారన్నది జగమెరిగిన సత్యం. అలాంటిది మన గ్రామమేమి దానికి అతీతం కాదు. వెబ్ సైట్ పెట్టేటప్పుడు కూడా కులాల వారిగానే సమాచారాన్ని, చరిత్రని పొందు పరచాలనే సదుద్దేశంతోనే ప్రారంభించాం.
  కానీ నేను చిన్నప్పటినుంచి పెరిగిన వాతావరణం, నా సామాజిక వర్గం గురించి నాకున్న అవగాహనతో పెద్దగా కష్టపడకుండానే ఆ సమాచారాన్ని పొందుపరిచాం. నాకున్న పరిచయాలు, సామాజిక సంభందాల దృష్ట్యా ఆ సమాచారం అంతా నాకు చేరుతోంది. మిగతా సామాజిక వర్గాల పై నాకు పట్టు లేకపోవటం, వారితో అంతగా సంభంధాలు లేకపోవటం నాలోని అసమర్ధత. అలాంటి అవకాశం కూడా ఎప్పుడూ నాకు రాలేదు. జీవిత ప్రయాణంలో గిరి గీసుకుని ఇలానే ఉండాలి, ఫలానా వాళ్ళతోనే ఉండాలి అని ఎప్పుడూ భావించలేదు. అలా అని నేనేమీ పాతికేళ్ళ అనుభవం ఉన్నవాడిని కాదు. మూడు పదులు నిండని వాడికి ఏదో చెయ్యాలనే ఆరాటం తప్ప అన్నిటిమీదా అవగాహన ఉండే వయసు కాదు అనేది విజ్జ్ఞులకి తెలిసిన సత్యం. అయినా నా వంతుగా స్వయంగా తిరిగి అన్ని సామాజిక వర్గాల ఫోటోలు ఎప్పుడో సేకరించి పెట్టాను.
గడచిన మూడు సంవత్సరాల్లో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఏ ఒక్కరూ నాకు సమాచారాన్ని అందించిన దాఖలాలు లేవు. ఎవరైనా అందించిన సమాచారాన్ని నేను తిరస్కరించిన దాఖలాలు అస్సలు లేవు. నా అంతట నేను తిరిగి సేకరిద్దామన్నా,సంభందిత వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియని అవగాహనా రాహిత్యం. నాకే కాదు మిగతా సామాజిక వర్గాల వాళ్లకి తమ గురించి తెలిసినంతగా మిగతా సామాజిక వర్గాల చరిత్ర తెలియదని కూడా నా గట్టి నమ్మకం. ఎందుకంటే ప్రతి వ్యక్తి తనదైన సమాజంలో తన వాళ్ళతోనే సింహ భాగం గడుపుతాడు.సమాజం లో సంభంధాలు, పెద్దల పరిచయాలు కూడా సామాజిక వర్గాల ఆధారం గానే ఏర్పడతాయి. కానీ బాహ్య ప్రపంచాన్ని చూసిన అనుభవజ్ఞులు, రచయితలూ మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ రచనలు ఎన్నో ఆలోచనల కలబోత, జీవితాన్ని కాచిన వడబోత. అంతటి విశాల దృక్పధం, సమాజం పట్ల లోతైన అవగాహన, ఆలోచన, నాకు కచ్చితంగా లేవు. ఇలా అని తప్పించుకుంటే పైన చెప్పిన కధలో లోపం ఉన్న శిల్పంలా ఈ వెబ్సైట్ మిగిలిపోతుంది. అందుకే ఇది ఓ అసమర్ధుడి సంపాదకీయం.....
 
Dated : 09.06.2012
 

This text will be replaced