తియ్యటి మనిషిBack to list

 

తియ్యటి మనిషి

హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో మా బంధువు ఒకాయన నన్ను స్కూటర్ పై తీసుకు వెళుతూ ఒక ఇల్లు చూపించి ఇది మీ ఊరు వాళ్ళదే అని చెప్పారు. ఎవరిదీ అని అడిగా,వెంకట్రాయులు గారిది అని చెప్పారు.ఓహొ ఆయన  ఇప్పుడు లేరు కదా  అని చెప్తే, ఎందుకు లేరు? లక్షణంగా ఉన్నారు,భార్య భర్తలిద్దరూ ఇక్కడే ఉంటారు అని చెప్పారు.ఈ సంఘటన జరిగింది 1999 లో.మన గ్రామంలో రంగనాధ బాబు గారు స్థాపించిన గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్ గురించి వినటమే కానీ అంత లోతుగా వారి వివరాలు అప్పటికి తెలియదు.

సహజం గా వ్యక్తుల స్మృతి తోనే ఇలాంటి సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తారేమో అనే అపోహ ఉండేది నాకు. తరువాత నా మిత్రుడు ఆంజనేయులు రంగనాధబాబు గారి సంస్థ లో పని చేస్తుండటంతో వాడి ద్వారా మొట్ట మొదటి సారి ఆయన్ని కలుసుకునే అవకాశం కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వెబ్ సైట్ ని ప్రారంభించాలనుకున్నపుడు రవిసుధాకర్ గారు వారికి బంధువు అవ్వటంతో ఆయన ద్వారా మళ్లీ రంగనాధ బాబు గారిని కలుసుకోవటం జరిగింది.అప్పట్నుంచి వారి ఇంటికి వెళ్ళటం, వెంకట్రాయులు గారిని ఉదయభాస్కరమ్మ గారిని తరచుగా కలవటం జరిగేది.అసలు ఆ ఇంటి వాతావరణానికి వారి జీవన విధానానికి ఎక్కడా పోలిక కనిపించేది కాదు.అతి విలాసవంతమైన ఆ ప్రాంతంలో అత్యాధునిక భవంతిలో పూర్తి సాంప్రదాయబద్ధమైన వస్త్ర ధారణ, అత్యంత అప్యాయంగా వినిపించే పలకరింపు, పల్లెటూరి మర్యాదలు, వయసు ఎనభై దాటినా పనివారి మీద ఆధార పడకుండా, వచ్చిన అతిధులకి తామే మర్యాద చెయ్యాలనే ఆ తాపత్రయం నన్ను ఎంతో ముగ్దుడిని చేసేవి.1969 లో వారి పెద్ద కుమారుడు రంగనాధ బాబు గారు అమెరికా వెళ్ళటం, తదనంతరం మిగతా ముగ్గురు కుమారులు,కుమార్తె కూడా అమెరికాలో స్థిరపడటంతో 1989 లో వెంకట్రాయులు గారి దంపతులు హైదరాబాదుకి మకాం మార్చారు.అప్పట్లో ఫోన్ సౌకర్యం అంతగా లేకపోవటంతో రోజూ వాళ్లతో మాట్లాడటానికి ఇబ్బంది అవుతోంది అని వారి కుమారులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తారు.1990 వ దశకం చివరి వరకు తరచుగా ఇద్దరూ గ్రామానికి వస్తూ వెళుతూ ఉండేవారు.రాను రాను వయసు పెద్దదవటం తో వారి పిల్లలు వచ్చినపుడు మాత్రమే వస్తుండేవారు.

ఆయన చనిపోయారనే వార్త వినగానే మొదట షాక్ అయ్యాను, ఎందుకంటే ఈ సంఘటనకి కేవలం పదిహేను రోజుల ముందే వారింటికి వెళ్లి చూసి వచ్చాను.ఆ రోజుకి కూడా అదే ఉత్సాహం అదే గంభీర తత్త్వం.పలు సందర్భాల్లో రంగనాధ బాబు గారిని కలుసుకున్నపుడల్లా వారి గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలని ముచ్చటించేవారు. పెద్ద రైతు ఆయినా అతి సామాన్యమైన జీవితాన్నే ఆయన కోరుకునేవారు. తమ పిల్లల్ని సమాజానికి మేలు చేయాలనుకునే తత్త్వంతో పెంచారనటానికి నిదర్శనం, ట్రస్ట్ ద్వారా వారు చేపట్టిన సేవా కార్యక్రమాలే. గ్రామంలో వివాదరహితుడి గా రాజకీయాలకి అతీతుడి గా ఆయనకి పేరుంది. తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు మాత్రం ఆ విధానాలకి ఆకర్షితులై కొంతకాలం ఆ పార్టీ కి పని చేశారు. పిల్లల చదువులకి అవసరమైన ఆర్ధిక వనరులని సమకూర్చటమే తప్ప వారేం చేస్తున్నారో ఎంత సంపాదిస్తున్నారు అని అడిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు. గ్రామ అభివృద్ధి కోసం కోట్లు ఖర్చుపెడుతున్నా వాటి గురించి ఏనాడు ఆయన ఆరా తీసిన దాఖలాలు లేవంటారు వారి కుమారులు. కుమారుల మధ్య అన్యోన్యతని అత్యంత అందంగా నిర్మించిన ఘనత ఆ దంపతుల సొంతం. భాద్యతలని మాటల్లో చెప్పటం కాకుండా తమ ప్రవర్తన తోనే పిల్లల్లో కలిగించిన తీరు వారి సమున్నత వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికి చేర్చింది. తండ్రి కాలధర్మం చేసాక ప్రతి కొడుకుని ఆ తండ్రి జ్ఞాపకాలు ఒక్కసారిగా కమ్ముకుంటాయని చాల సందర్భాల్లో విన్నాను.సరిగ్గా అలాంటి జ్ఞాపకాల దొంతర    రంగనాధ బాబు గారి గుండె అరల్ని తడిమిన సందర్భానికి నేను కూడా ఒక సాక్షిని. అన్నిటిని మించి ఒక్క మాటలో ఆ తండ్రి గురించి ఆయన చెప్పిన మాట He is a sweet man  . తమ జీవితాల్ని, వ్యక్తిత్వాలని అత్యంత పటిష్టంగా నిర్మించటానికి వారి తల్లిదండ్రులు ఎటువంటి సూత్రాలు కానీ నియమాలు కానీ పాటించ లేదంటారు ఆయన. కేవలం సహజంగా వారిలా వారు జీవించటమే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెప్తారు...

 

Dated : 27.05.2012

 

 

This text will be replaced