శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారుBack to list

మన ఊరి ప్రముఖులు

శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు

ఘంటసాల గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోయినా,ఘంటసాల గ్రామంతో రాజకీయంగానూ వ్యక్తిగతం గానూ విడదీయలేని అనుభంధం ఉన్న వ్యక్తి వేమూరి వెంకట కృష్ణారావు గారు. నేను ఆరవ తరగతి హైస్కూల్ లో చదువుకునేటప్పుడు స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి గా వచ్చారు. ఆ సంవత్సరం నాకు ఇంగ్లిష్ లో ఫస్ట్ ప్రైజ్ రావటం తో ఆయన చేతులమీదుగా ఆ బహుమతిని అందుకున్న జ్ఞాపకాలు నాకున్నాయి.
 

 
ఘంటసాలపాలెం  గ్రామంలో రామాలయం ఎదురుగానే వారి నివాసం.1929 జూన్ లో వేమూరి వెంకయ్య గారి సంతానంగా ఘంటసాల పాలెం గ్రామంలో జన్మించారు. ఈయన కంటే ముందు జన్మించిన వెంకయ్య గారి కుమార్తె మహాలక్ష్మమ్మ గారిని మన గ్రామానికి చెందిన గొర్రెపాటి బాపనయ్య గారికిచ్చి వివాహం చేశారు. స్త్రీ వాద రచయిత్రిగా,  అభ్యుదయవాదిగా, ఆధ్యాత్మిక జ్ఞానసమాజ స్థాపనలో మహాలక్ష్మమ్మ గారి కృషి అనిర్వచనీయం. ప్రస్తుతం గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కోశాధికారిగా ఉన్న గొర్రెపాటి చంద్రశేఖరరావు గారు వీరి కుమారుడు. ఘంటసాల మాజీ ప్రెసిడెంట్ తెలుగుదేశం నాయకులు దివంగత శ్రీ వేమూరి నాంచారయ్య గారు కృష్ణారావు గారు అక్కా చెల్లెళ్ళ బిడ్డలు.
 
ముఠా కక్షల కారణం 1955 లో పాలెం పంచాయితీ విడిపోయి వేరుగా ఎన్నికలకి వెళ్ళింది. అప్పుడు జరిగిన మొదటి ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా రెండుసార్లు ఎన్నికైన మొదటి మరియు చివరి వ్యక్తి ఈయనే.1985 లో ఘంటసాల మండలం ఏర్పడినప్పుడు తొలి మండల వైస్ ప్రెసిడెంట్ ఈయనే. వీరి మేనమామ దోనేపూడి వెంకటేశ్వర్లు గారిది దేవరకోట గ్రామం.1957 నుండి 1959 మధ్య కాలంలో ఘంటసాల ప్రెసిడెంట్ గా మహా లక్ష్మమ్మ, పాలెం ప్రెసిడెంట్ గా వెంకట కృష్ణారావు గారు, దేవరకోట ప్రెసిడెంట్ గా దోనేపూడి వెంకటేశ్వర్లు గారు ఒకే కాలంలో పని చేశారు. మూడు గ్రామాలకి ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రెసిడెంట్ గా ఉండటం అరుదైన రికార్డు. కృష్ణారావు గారి కుటుంబానికి చల్లపల్లి జమిందారులతో మంచి సంభంధాలు ఉండేవి. వీరి ముత్తాత వేమూరి వెంకట్రామన్న పరగణా పెత్తందారు. జమిందారుకే అప్పు ఇచ్చిన ఘనాపాటీ. ఒక దశలో వీరితో వియ్యమందాలని ఉందని చల్లపల్లి జమిందారు స్వయంగా అడిగారట. కానీ కృష్ణారావు గారి తాత వెంకట కృష్ణయ్య గారు అందుకు సమ్మతించలేదు. కృష్ణారావు గారి హయాం లోనే పాలెం లో మంచినీటి టాంక్, తాగునీటి కుళాయిలు వీధి వీధినా ఏర్పాటు చేశారు. ఆచార్య N.G. రంగా గారంటే విపరీతమైన గౌరవం. సోషలిస్టు పార్టీ నేతగా రంగా గారిని అనుసరించారు. మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు, మరియు తెలుగుదేశం పార్టీ లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన సింహాద్రి సత్యనారాయణ గారు, కృష్ణారావు గారికి ఆప్తమిత్రులు.
ఆయన చనిపోవటానికి కొద్దిరోజుల ముందే ఆయన్ని గురించి కొన్ని అరుదైన విశేషాల్ని యాదృచ్చికం గానే తెలుసుకోవటం జరిగింది. గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఇద్దరు వ్యక్తుల్ని కలవటం మాత్రం నాకు రివాజు. ఒకరు గొర్రెపాటి వెంకట రామకృష్ణ మరొకరు వేమూరి విశ్వేశ్వరరావు. వీళ్ళతో కూర్చుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతుంటాయి. టాపిక్ ఎక్కడ మొదలు పెడితే ఎక్కడికెళ్ళి ఆగుతుందో మాకే తెలీదు. మొన్న శ్రీరామ నవమికి ఊరెళ్ళినప్పుడు ఒక పక్కన కల్యాణం జరుగుతుంటే ఆ పక్కనే ఉన్న ఓ పెంకుటింట్లో విశ్వేశ్వర రావు గారితో భేటీ వేశాం. మాటల సందర్భంలో శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారి విశేషాలు చెప్తూ ఆయన ఆరోజుల్లోనే M.A LLB Lucknow లో చదవటం వెనుక ఒక ఆసక్తి కరమైన సంఘటన చెప్పారు. బందరు హిందూ కాలేజి లో B.A చదివాక దేవరకోటకి చెందిన మేనమామ దోనేపూడి వెంకటేశ్వర్లు గారి రెండవ కుమార్తె సీతారావమ్మ గారిని వివాహం చేసుకున్నారు. సీతారావమ్మ గారి అక్క భర్త పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు లాయర్ . సొంత మేనమామ అయినా, పండుగకి ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు అల్లుళ్ళ మధ్య ఆయన చూపించిన వ్యత్యాసాన్ని అవమానంగా భావించిన కృష్ణారావు గారు అప్పటికప్పుడు లక్నో వెళ్లి MA LLB పూర్తి చేశారు. తెలియని వాళ్ళకి ఆయన అహంభావి గా కనిపించేవారు. కానీ ఆయన స్వాభిమానధనుడు. ఎవరికీ తలవంచని మనస్తత్వం. జీవితపు చివరి అంచుల వరకు ఆ ఆత్మాభిమానాన్ని వీడలేదు.
 
ఇలాంటిదే ఇంకొక సంఘటన చెప్తూ, సింహాద్రి సత్యనారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి పాలెం వచ్చారు. ఆ సభలో ఆయనకి కృష్ణారావు గారు కనపడలేదు.సభ ముగిసాక స్వయంగా ఆయనే వారింటికి వెళ్లారు. కృష్ణారావు గారు లోపల కూర్చుని ఉన్నారు. బయట కనపడిన వ్యక్తిని అడిగారు సత్యనారాయణ గారు,ఒక్కడే ఉన్నాడా ఎవరైనా ఉన్నారా గదిలో అని. చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే ఆశ్చర్యం ఏమిటి ఈయన ఇలా అడుగుతున్నారు అని. ఎవరూ లేరు అని చెప్పాడు ఆ వ్యక్తి. లోపలకి వెళ్ళగానే అమాంతం మిత్రుడిని వాటేసుకున్నారు సత్యనారాయణ గారు. అప్పుడు కూడా కృష్ణారావు గారు, ఏరా నా కొ ...... నువ్వు మంత్రి అయితే నీ దగ్గరికి వస్తా అనుకున్నావా అని దర్పంగా ప్రశ్నించారు. ఒరేయ్ నీ సంగతి నాకు తెలుసురా నువ్వింకా మారలేదు, అందుకే నేనే వచ్చాను నీ దగ్గరికి, అందరి ముందు నువ్వు నన్ను తిడితే పరువు పోతుందని ఒక్కడినే వచ్చానురా అన్నారు అంతే ఆప్యాయంగా. వారిద్దరి అనుభంధం అంత బలీయమైనది. చివరి రోజుల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రశాంత జీవనం గడిపిన వెంకట కృష్ణా రావు గారు.April 15-2012 న ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాల్ని,అయన రాజసపు పనులని, పాలెం గ్రామస్తులు మాత్రం కధలు కధలుగా చెప్పుకుంటూనే ఉంటారు....
 
Dated : 21.04.2012
 
 

 

This text will be replaced