ఆకాశానికి ఆధారంBack to list

 

 ఆకాశానికి ఆధారం

ఒకసారి ఒక వ్యక్తి కి ఒక సందేహం వచ్చింది. చిన్న పందిరి నిలబడాలన్నా నాలుగు స్తంభాలు కావాలి కదా, మరి అంత పెద్ద ఆకాశం ఎటువంటి ఆధారం లేకుండా ఎలా నిలబడింది అని. సత్యాన్వేషణ కోసం తపస్సు చేసాడు. దేవుడు ప్రత్యక్షమవగానే తన సందేహాన్ని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఒక 100 ఇళ్ళకి భిక్షాటన కి వెళ్లిరా, ఆ తర్వాత నీ సందేహానికి సమాధానం చెప్తాను అని చెప్పాడు. కానీ భిక్ష అడిగేటప్పుడు కోపం గా తిడుతూ అడుగు అని చెప్పి పంపాడు. అలాగే అని ఆ వ్యక్తి భిక్షాటన కి బయలుదేరాడు. కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టబోయారు,మరికొంతమంది కొట్టారు. ఇక ఆఖరి ఇంటికి వెళ్లి యధాప్రకారమే తిడుతూ భిక్ష అడిగాడు, కొంతసేపటికి ఆ ఇల్లాలు బయటికి వచ్చి ఎంత ఆకలి తో ఉన్నావో నాయనా నీ కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను అని చెప్పి భిక్ష వేసింది. ఆ వ్యక్తి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. అప్పుడు దేవుడు నవ్వి నీకు భిక్ష వేసిన ఇల్లాలు లాంటి సహనశీలురు ఇంకా భూమి మీద ఉన్నారు కనుకే ఆకాశం కింద పడకుండా ఉంది, ఆకాశాన్ని కింద పడకుండా ఆపుతున్న స్తంభాలు అలాంటి వ్యక్తులే అన్నాడు. అలాంటి మహనీయుల పూనికకి నిదర్శనమే మన గ్రామం లో ఉన్న జలధీశ్వరాలయ పునర్వైభవం.

 

 1993 లో జరిగిన పంచాయితీ 75 సంవత్సరాల పండుగ వజ్రోత్సవాల అనంతరం 2002 వరకు గ్రామం స్తబ్ధం గా ఉండిపోయింది. ఎటువంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి కానీ, విశేషాలు కానీ లేవు. కానీ జలధీశ్వరాలయానికి ఉన్న వాస్తు దోషాలని తొలగించటం మొదలు పెట్టాకే ఈ తొమ్మిదేళ్ళలో ఎంతో అభివృద్ధి ని మనం చూడగలిగాం.బౌద్ధ స్తూపం మ్యూజియం, తహసీల్దార్ నూతన భవనం, కళ్యాణ మండపం, పలు జీర్ణ దేవాలయాల అభివృద్ధి, హైస్కూల్ నూతన భవనాలు, పది పడకల ఆసుపత్రి , ఘంటసాల పురాతన నగరం గా ప్రభుత్వ గుర్తింపు ఇలా ఎన్నో విషయాలు ఈ మధ్య జరిగిన అభివృద్దే. హేతువాదులు ,నాస్తికులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేసినా జలధీశ్వరుడు మన గ్రామానికి ఉన్న అపురూప వరం. పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తున్న వాటిల్లో ఒకటి.


                     ఎవరో ఒకరు ఎపుడో అపుడు అన్నట్లు ఈ విషయం లో ముందుగా నడిచింది ఇద్దరు వ్యక్తులు. ఒకరు గొర్రిపర్తి శ్రీనివాసరావు మరొకరు గొర్రెపాటి వెంకట రామకృష్ణ. పార్టీ పరం గా ఇద్దరివి వైరుధ్య భావాలే అయినా, దేవాలయ అభివృద్ధి విషయం లో కలిసి నడిచారు. విమర్శల్ని కలిసి కట్టుగా ఎదుర్కొన్నారు. తమ స్వహస్తాలతో దేవాలయాన్ని శుభ్రం చేయటంతో మొదలు పెట్టిన ప్రక్షాళనతో అప్పటిదాకా అందరి అలక్ష్యానికి గురైన దేవాలయం క్రమ క్రమంగా వెలుగులోకి రావటం మొదలైంది. కానీ దీని వెనుక ఎంతటి కృషి ఉందో ఎంత మంది మహానుభావుల దాతృత్వం దాగుందో ఎవరికీ తెలీదు. దేవాలయ గర్భగుడిని శుభ్రం చేస్తున్నపుడు గొర్రిపర్తి శ్రీనివాసరావు గారికి దొరికిన కొన్ని వస్తువులు ఇక్కడ రాయటానికి కూడా వీలు లేనివి. అంతటి నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయటం ఒక ఎత్తు అయితే దాని చుట్టూ ఉన్న నిర్మాణాల్ని వాటికి ఉన్న వారసత్వపు భావోద్వేగాల్ని సమన్వయపరిచి అందరిని ఒప్పించటం ఒక ఎత్తు.ఈ విషయం లో గొర్రెపాటి రామకృష్ణ గారు వ్యవహరించిన తీరు ఆది లో విమర్శలకి గురైనా దేనికీ వెరవకుండా తన సంకల్ప బలం తో ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి విమర్శించిన వ్యక్తుల చేతనే శభాష్ అనిపించుకున్నారు. తనకున్న రాజకీయ పలుకుబడి తో దేవాలయం ముందు సిమెంట్ రోడ్డు, కళా మందిర నిర్మాణానికి పాటుబడ్డారు గొర్రిపర్తి  శ్రీనివాసరావు. ఇక ఈ దేవాలయానికి రాజపోషకులుగా తమ విరాళాల్ని అందించిన మహనీయుల గురించి రాయటానికి ఈ కాలమ్ సరిపోదేమో. దాదాపు 70 లక్షల రూపాయల్ని ఈ దేవాలయ అభివృద్ధి కి వెచ్చించారు. వారి గురించి మున్ముందు ప్రస్తావిస్తాను.
 

Dated : 09.10.2011

This text will be replaced