నా ఐరోపా యాత్ర - 30 (ముగింపు)Back to list

నా ఐరోపా యాత్ర - 30 (ముగింపు)

నిన్న రాత్రి వచ్చిన పీడకల తలుచుకుంటూ ఈ రోజు పడుకోకుండా ఉండలేము. ఎంత మంచి కల వచ్చినా అందులోనే ఉండిపోయి నిద్ర లేవకుండా ఉండలేము. మనిషి గమనమైనా అంతే, ఎక్కడా దేనికోసం మనం ఆగలేము. మనకోసం ఏదీ ఆగదు. వుయ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే. దాదాపు 14 నెలల  యూరోప్ వాసాన్ని , అనుభవాలని మూటగట్టుకుని మరో మజిలీ కోసం బయలుదేరాల్సి వచ్చింది. వచ్చే ముందు రోజు అక్కడున్న ఇండియన్స్ అంతా మాకు వీడ్కోలు పలకటానికి మా ఇంటికి వచ్చారు. మేము గడిపిన ఆ రోజులన్నీ నెమరు వేసుకుని ఉల్లాసంగా గడిపాం. ఎక్కడికైనా టూర్ ప్లాన్ చెయ్యాలంటే నేనే ముందు ఉండేవాడిని. భార్గవి అక్కడ 3 నెలలే ఉన్నా అందరికీ చాలా దగ్గర అయ్యింది. ఇప్పటికీ మాకు వారితో ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది.

మాకు బాగా దగ్గర అయిన శశి అయితే మేము వచ్చే రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు. మార్చిన్ దంపతులు మింజు జేర్జ్ నుండి 400 కిలోమీటర్లు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు సాగనంపటానికి వచ్చారు. మేము బోర్డింగ్ లోకి వెళ్తుంటే మార్చిన్ , కాషా పరుగున వచ్చి మమ్మల్ని వాటేసుకుని ఏడ్చేసారు. జీవితకాలానికి సరిపడిన సంతోషాన్ని , అనుభవాలని ఇచ్చిన పోలాండ్ కి వీడ్కోలు పలుకుతూ మే 20, 2013 న పోలాండ్ రాజధాని వార్సా నుండి మధ్యాహ్నం 2.45 నిమిషాలకి దుబాయ్ వెళ్ళే విమానం ఎక్కాం. అప్పటినుండి ఈరోజు వరకు దుబాయ్ లోనే నివాసం. ఇక్కడికొచ్చాక ఉద్యోగ భాధ్యతలు పెరగటంతో నేను యూరప్ నుండి వచ్చేసిన 2 సంవత్సరాలకి కాని ఈ రచనని పూర్తీ చెయ్యలేకపోయాను. నేను అసలు రచయితనే కాదు. నాకు సంప్రదాయక తెలుగు సాహిత్యం అంటేనే తెలియదు. కేవలం చిన్నపటినుండి చదివిన పాఠకానుభవంతో, ఒక పాఠకుడిగానే ఈ నా అనుభవాలు రాశాను. చాలా చోట్ల నాకు తెలియకుండానే నేను చదివిన రచనల ప్రభావం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని నియంత్రించలేకపోయాను అనటం కంటే అంతకుమించి నేను రాయలేకపోయాను అనటం కరేక్టేమో. చరిత్ర గురించిన జిజ్ఞాస, కొత్త ప్రదేశాలు చూడాలన్న ఉత్సాహం, నాకు తెలిసింది పదిమందికి చెప్పాలన్న ఆకాంక్షే నన్ను నడిపించింది. ఒక పక్క వృత్తి కి న్యాయం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఈ రచనని కొనసాగించాను. 

                   ​నేను సందర్శించిన దేశాల గొప్పతనాన్ని , అద్భుతాలని , క్రమశిక్షణ ని , అక్కడి వ్యవస్థలని వివరించేటప్పుడు" అదే మన దేశంలో అయితేనా" అంటూ పోల్చి మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎక్కడా చెయ్యలేదు. నేను అక్కడి వ్యవస్థలని చూసి గొప్పగా చెప్పినట్లే ఇతర దేశాల వాళ్ళు భారతదేశం గురించి అంత కన్నా గొప్పగా రచనలు చేశారు.  ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునే ప్రతి దేశంలో ఉన్న వ్యవస్థలు , సౌకర్యాలు , అద్భుతాలు మనకీ ఉన్నాయి. కాకపొతే అవి చివరి వ్యక్తి వరకు చేరటంలోనే వైఫల్యం చెందుతున్నాం. ఇన్ని దేశాలు చూసిన తర్వాత నాకనిపించింది ఏమిటంటే మన దేశంలో కేవలం రెండు వ్యవస్థలు సక్రమంగా పని చేస్తే ప్రపంచంలో మరే దేశం మనతో పోటీ పడలేదు. ఒకటి ట్రాఫిక్ , రెండు పరిశుభ్రత. ఈ రెండూ కూడా ప్రభుత్వం ప్రజలు కలిసి పూనుకోవాల్సిన విషయాలు, స్వచ్ఛ భారత్ పిలుపుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే త్వరలోనే స్వచ్చ భారతాన్ని చూడగలం. ట్రాఫిక్ పట్ల , డ్రైవింగ్ లైసెన్సుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే క్రమశిక్షణతో వెళ్ళే ట్రాఫిక్ వల్ల 50 కోట్ల ప్రజల విలువైన సమయం ట్రాఫిక్ జామ్ ల వల్ల రోడ్ల మీద వృధా కాకుండా ఉంటుంది. లక్షలాది ప్రాణాలు రోడ్ల ఆకలికి ఆహుతి కాకుండా ఉంటాయి. అలాగే ప్రజలు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకుంటే మన అభివృద్ధి వేగానికి ఇక ఆకాశమే హద్దు. 

                     నేను మొదటిసారి దేశం దాటి దుబాయ్ వచ్చినప్పుడు అక్కడి రాచరిక వ్యవస్థ వల్ల జరిగిన అభివృద్ధి చూశాక ఇండియాలో ప్రజాస్వామ్యం వల్లే అభివృద్ధి జరగటం లేదనే అభిప్రాయం ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని దేశాల నియంతలని చూశాక ఆ అభిప్రాయం తప్పని అనుకున్నాను. మరికొన్నాళ్లకి అత్యధిక జనాభా, వైశాల్యం వల్ల మన దేశం త్వరగా అభివృద్ధి చెందటం లేదనే అభిప్రాయానికి వచ్చాను. చైనా సాధించిన ప్రగతి చూశాక ఆ అభిప్రాయం కూడా తప్పని అనుకున్నాను. నేను చూసిన దేశాల అభివృద్దిలో ప్రభుత్వ భాగస్వామ్యం కంటే ప్రజల భాగస్వామ్యమే ఎక్కువ. ప్రభుత్వం అంటే వాళ్లకి భయం కాదు, తమ దేశం అంటే భాధ్యత. అర్ధరాత్రి 2 గంటలకి నిర్మానుష్యంగా ఉన్న ఒక చిన్న రోడ్డులో రెడ్ సిగ్నల్ పడినప్పుడు, మిగతా మూడు దిక్కులనుండి వాహనాలు రావు అని తెలిసినా ఒక పోలిష్ జాతీయుడు 90 సెకండ్ల పాటు ఆ సిగ్నల్ దగ్గరే నిరీక్షించటం నేను పక్కనుండి చూశాను. అదే మనం అయితే ఒక్క సెకండ్ కూడా ఉండకుండా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతాం. రోడ్డు మీద చాక్లెట్ తిని ఆ కాగితం పారేయటానికి డస్ట్ బిన్ కోసం ఫర్లాంగు దూరం నడిచివెళ్ళిన వ్యక్తుల్ని చూసాను. విచిత్రం ఏంటంటే ఇలాంటి క్రమశిక్షణ మన దేశం నుండి ఆయా దేశాలలో స్థిరపడిన ప్రతి భారతీయుడుకి ఉంటుంది. అది ఆ ప్రభుత్వం అంటే భయం కాదు, పక్కవాడు చులకనగా చూస్తారేమో అని భయం. మన దేశంలో లోపించింది అదే. ప్రభుత్వాలు చట్టాలు చెయ్యగలవు తప్ప వాటిని ప్రతివారు పాటిస్తున్నారా అని సమీక్షించలేవు. చట్టాలని గౌరవించటం వాటిని పాటించటం ప్రజల భాధ్యత.  

            ప్రభుత్వ పనితీరు మారాలని ప్రజలు, వ్యవస్థ మారాలని మేధావులు, మనలో మార్పు రావాలని సామాజిక ఉద్యమ కారులు, ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలం గడిపే కంటే ముందు మనం చెయ్యగలిగింది చేస్తే మిగతావన్నీ కలిసి వస్తాయి.

నా ఈ రచనలో ఎక్కడైనా తప్పులు కనిపించినా, అపరిపక్వమైన భావాలు అనిపించినా , ఆ తప్పు నా వయసుదే కాని నాది కాదు. ఏమో ఇంకో పదేళ్ళు గడిచాక నేను రాసిన ఈ  పుస్తకం చదువుతుంటే నాక్కూడా అలాగే అనిపించవచ్చు. నా ఈ పుస్తకం కొంతమందికైనా విజ్ఞానాన్ని అందిస్తే అదే పదివేలు. నా తోలి ముద్రిత రచనని సహృదయం తో ఆదరిస్తారని ఆశిస్తూ... 

Dated : 24.11.2015