నా ఐరోపా యాత్ర - 28 ( నెదర్లాండ్స్ )Back to list

 

ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు మాత్రమే కాదు, స్వలింగ సంపర్కులకి సంభందించిన ఏదో ముఖ్యమైన రోజు. అక్కడున్న మీటింగ్ పాయింట్ దగ్గర మగవాళ్ళంతా చేరి ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బిగ్గరగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే భార్గవి భయపడింది. మాక్సిం చిన్న వాడు కావటంతో మార్చిన్ దంపతులు కూడా అటు వైపు చూడకుండా తీసుకొచ్చేసారు. నాకు దీని గురించి తెలియటంతో పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా " గే " వివాహాలని చట్టబద్దం చేసిన దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2001 న దీనికి సంభందించిన చట్టాన్ని ఆమోదించారు. కాబట్టి ఇలాంటి దృశ్యాలు ఇక్కడ కనబడటం చాలా కామన్. తరువాత అమ్ స్టర్ డాం లో మేము నడిచిన దారిలో పింక్ పాయింట్ పేరుతో చాలా షెల్టర్స్ కనిపించాయి. లెస్బియన్లు , గే లు కలుసుకునే ప్రదేశాలు అవి.

మనకి నచ్చని పనులని , మన సంస్కృతి కి విరుద్ధమైన పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే ఛీ ఛీ అనటం భావ్యం కాదు. మనం చేసే పనులు మనకి నచ్చినట్లే , అవతలవాళ్ళకి తాము చేసే పనులు వాళ్ళకీ నచ్చుతాయి. మన సంస్కృతి మనకెంత గొప్పదో, అవతలి వాళ్ళకి వాళ్ళ సంస్కృతి అంతే గొప్పది. ప్రతి మనిషిలోను కొన్ని విపరీతమైన భావాలు ఉంటాయి.వాటి మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదని నేను భావిస్తాను.మనం చెయ్యని , చెయ్యలేని కొన్ని పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే విమర్శించే సంస్కృతి మంచిది కాదు. ఆడవాళ్ళు జీన్స్ వేసుకుంటేనే నోళ్ళు నొక్కుకునే సంప్రదాయం నుండే మనం ఇంకా బయట పడలేదు. ఇక ఇలాంటి వాటిని మన దేశంలో చట్ట బద్దం చేసినా ప్రజలు ఆమోదించాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.అక్కడికి దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అప్పటికే సమయం 9 గంటలు అయింది , అప్పుడప్పుడే చీకటి పడుతోంది. మేము ఆ ఇండియన్ రెస్టారెంట్ లోనే డిన్నర్ చేసేసి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగ్మొండ్ అనే ప్రాంతానికి బయలుదేరాం. నేను కావాలనే అక్కడ హోటల్ బుక్ చేశాను. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఒడ్డున పొలాలు, గుర్రపుశాలల మధ్యలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. అమ్ స్టర్ డాం నుండి 45 నిమిషాలు ప్రయాణించాక ఎగ్మొండ్ ప్రాంతానికి చేరుకున్నాం.అప్పటికే చీకటి పడింది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మ్ హౌస్ లు గుర్రపు శాలలు ఉన్నాయి. అదొక చిన్న పల్లెటూరులా ఉంది. మేము విడిది చేసిన హోటల్ పేరు " స్టే ఓకే ". మేము వెళ్ళే సరికి కౌంటర్ లో ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. ఇంటర్నెట్ లో బుక్ చేసిన పేపర్ చూపించగానే మాకు రూం కీస్ ఇచ్చాడు. కింద లాంజ్ లో రెస్టారెంట్ , బార్ ఉన్నాయి. రూం కి వెళ్లి ఫ్రెష్ అయిన తరువాత నేను మార్చిన్ కిందకి వచ్చాము. ఆ కుర్రవాడిని అడిగాను నువ్వు ఇక్కడ ఎన్నిరోజులనుండి పని చేస్తున్నావ్ అని. తానొక కాలేజి స్టూడెంట్ అని పగలు కాలేజికి వెళుతూ రాత్రి వేళ ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పాడు. నెలకి 600 యూరోలు జీతం వస్తుంది , దానితో నా చదువు , ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆహ్లాదకరమైన ప్రకృతి మమ్మల్ని కనువిందు చేసింది. మాతో పాటు హోటల్ లో ఉన్న టూరిస్టులు ,పిల్లలు అందరూ బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆడుతున్నారు. కొంతమంది జాకీలు గుర్రాలతో ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో పిల్లలంతా ఆ గుర్రాలతో ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా కాసేపు వాళ్ళని చూస్తూ కాలం గడిపాం. తరువాత మాక్సిం తో కలిసి మేము కూడా ఒక ఫోటో దిగాం.
అప్పటికి ఉదయం 10. 30 నిమిషాలు అయ్యింది. మార్చిన్ ఒకసారి అట్లాంటిక్ సముద్రం చూద్దాం అన్నాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాం. అసలు ఆ నీళ్ళలో కాళ్ళు పెడితే గడ్డ కట్టేలా ఉన్నాయి. నేను చచ్చినా దిగను అని చెప్పా. మాక్సిం సముద్రం చూడగానే ఒకటే ఉత్సాహంతో పరుగులు పెడుతుంటే వాడితోపాటు భార్గవి ,మార్చిన్ ,కాషా కూడా కాసేపు ఆ నీళ్ళలో ఆడుకున్నారు. ఎంతసేపటికీ వాళ్ళు కదలకపోవటంతో నేనే తొందరపెట్టి తులిప్ తోటలకి వెళ్దాం అని అక్కడినుండి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చాను.
 
 
15వ శతాబ్దంలో అభివృద్ధి చేసిన కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్ (Keukenhof) ప్రపంచంలో అతిగొప్ప ఉద్యానవనం. దీనినే ‘‘గార్డెన్ ఆఫ్ యూరోప్’’ అంటారు. దాదాపు 79 ఎకరాల విస్తీర్ణంలో  ఎటూ చూసినా పచ్చదనం, దానిమీద రంగురంగుల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. దీన్ని చూసేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ మూడు నెలల్లో సందర్శకులతో తులిప్ గార్డెన్స్ కళ కళ లాడుతాయి. మేము బస చేసిన ఎగ్మొండ్ నుండి కూకెన్‌హఫ్ 60 కిలోమీటర్లు. మేము అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం 1 అయింది. కార్ పార్కింగ్ దొరకటానికే చాలా సమయం పట్టింది. గార్డెన్ లోకి ఎంట్రీ టికెట్ 16 యూరోలు. ప్రతి సంవత్సరం నవంబర్లో నెదర్లాండ్స్ రాజు ఈ గార్డెన్ లో తోలి మొక్కని నాటటం ద్వారా ఈ గార్డెన్స్ ని ప్రారంభిస్తారు.3 నెలలలో మొక్క పెరిగి పూవులు పూసాక దీని జీవిత కాలం మూడు నెలలు మాత్రమే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ తోటలు ఉంటాయి.
మేము మే 5 న ఇక్కడికి వెళ్ళాము. మే 16 కల్లా ఈ గార్డెన్ మూతబడిపోతుంది.టికెట్ తీసుకుని లోపలి వెళ్ళగానే రకరకాల తులిప్ పూలు మాకు స్వాగతం పలికాయి. అసలు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో కూడా చెప్పలేము. అక్కడ మాకు చాలామంది ఇండియన్స్ , అందునా తెలుగు వారు కనిపించారు. సాఫ్ట్ వేర్  ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన మన కుర్రాళ్ళతో పాటు తెలుగు జంటలు బానే కనిపించాయి. 
మేము గార్డెన్ అంతా 2 గంటల పాటు తిరిగాము కాని మనం సినిమాల్లో చూసినట్లు పెద్ద పెద్ద తోటలు మాత్రం కనపడట్లా. ఒక్కో రంగు పువ్వులు 100 గజాల స్థలంలో పెంచబడి అలా ఆ గార్డెన్ అంతా దాదాపు 500 రకాల పుష్పాలు కనిపించాయి. తులిప్ గురించిన విశేషాలు , వాటికి సంభందించిన సాంకేతిక విశేషాల గురించి మ్యూజియం కూడా లోపల ఉంది.అంతా తిరిగాం కాని ఆ పెద్ద పెద్ద తోటలు చూడలేకపోయామే అనుకుంటూ అసంతృప్తిగా బయటకి వచ్చి కార్ లో మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఈసారి గార్డెన్ వెనుక నుండి కార్ వెళుతోంది. ఒక్కసారిగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్న తులిప్ తోటలు కనిపించాయి. అచ్చం మన సినిమాల్లో పాటల్లో కనిపించినట్లే ఉన్నాయి. ఒక్కసారిగా అందరం మళ్లీ వెళ్దాం అని గట్టిగా అరవగానే మార్చిన్ కార్ వెనక్కి పోనిచ్చాడు. అయితే ఆ పొలాలకి దగ్గరగా కార్ పార్కింగ్ లేదు. దాదాపు కిలోమీటర్ ముందు పార్క్ చేసి నడుచుకుంటూ ఆ తోటల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేదు , అందరూ ఆ తోటల మధ్యలోకి వెళ్లి ఫోటో లు వీడియోస్ తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట వెడ్డింగ్ డ్రెస్ లోనే ఆ తోటల్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. 

 

ఇంతకుముందు మ్యూజియం సందర్శించిన అనుభవాల దృష్ట్యా భార్గవి , కాషా నాతో పాటు ఎక్కడికోచ్చినా మ్యూజియంకి మాత్రం రాము అని చెప్పేయటంతో అమ్ స్టర్ డాంలో  కొన్ని మ్యూజియాలు చూద్దామనుకుని కూడా ఆ ఆలోచన విరమించుకున్నాను. కాకపొతే అన్నే ఫ్రాంక్ మ్యూజియంకి మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. నేను ఒక్కడినే వెళ్లి చూసి రావాలని, తామంతా బయటే ఉంటామనే ఒప్పందంతో ఆ తోటల మధ్యకాసేపు గడిపి అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడటానికి మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఒక పక్క సమయం అయిపోతుందేమో అనే ఆందోళనతో నా మనసు అంతా కంగారుగా ఉంది. ఎందుకంటే నా వరకు నాకు అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడకపోతే నా యాత్రకి పరిపూర్ణత లేదు. అంతలా నన్ను కదిలించింది ఆ డైరీ అఫ్ యంగ్ గర్ల్ కధ. 
 
నా అదృష్టం కొద్దీ మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎంట్రీ ఉంది. కాషా, భార్గవి , మాక్సిం కార్ లోనే ఉంటామన్నారు. మార్చిన్, నేను కలిసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. లోపల ఫోటోలు నిషేధం. ఆశ్విత్జ్ కాంప్ లో లానే ఇక్కడ కూడా అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సన్నటి ఇరుకు మెట్ల గుండా ఆ ఇంటి పైభాగానికి చేరుకున్నాం. మన ఇళ్ళలో అటక మాదిరిగానే ఆ ఇంటి పై అంతస్తులో చెక్కతో కట్టిన అటక మీద అన్నే ఫ్రాంక్ కుటుంబం 25 నెలలు గడిపింది. యుద్ధం ముగియటానికి కేవలం మూడు నెలల ముందే ఒక ఆగంతకుడు నాజీలకి సమాచారం ఇవ్వటంతో ఒక రాత్రి పూట నాజీలు దాడి చేసి అన్నే ఫ్రాంక్ కుటుంబాన్ని కాన్సంట్రేషన్ కాంపుకి తరలించారు.యుద్ధం ముగిసేలోపే అన్నేఫ్రాంక్ తండ్రి తప్ప కుటుంబం అంతా మరణించారు. 1980 వరకు అన్నే ఫ్రాంక్ తండ్రి బతికే ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ ఇంటిని మ్యూజియం గా మార్చి అన్నే ఫ్రాంక్ వస్తువులని , ఆ అరలని అలాగే ఉంచి పరిరక్షిస్తోంది. లోపల అన్నే రాసిన డైరీ , అన్నే తో పాటు కాంపులో కొన్నాళ్ళు గడిపిన తన మిత్రుల జ్ఞాపకాలతో కూడిన వీడియో చూడవచ్చు. ఆ ఇంటికి బయట కొద్ది దూరంలోనే అన్నేఫ్రాంక్ విగ్రహం ఉంది.హౌస్ అంతా చూశాక బరువెక్కిన హృదయంతో బయటకి వచ్చాం. 
 
అక్కడినుండి  IAMSTERDAM అనే అక్షరాలతో కూడిన ఒక బోర్డ్ ఉన్న చోటుకి వెళ్ళాం. సందర్శకులంతా అమ్ స్టర్ డాం ని సందర్శించిన గుర్తుగా అక్కడ ఫోటో దిగుతారు. మేము కూడా అక్కడికి వెళ్లి ఫోటో తీసుకున్నాం.అప్పటికి సమయం సాయంత్రం 9.30 నిమిషాలు అయ్యింది. 
 
చీకటి అప్పుడప్పుడే పడుతోంది. మేము మింజు జేర్జ్ కి వెళ్ళాలంటే అక్కడినుండి 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొందరపడకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ మే 6 వ తేది ఉదయానికి పోలాండ్ చేరుకున్నాం. 

Dated : 24.11.2015