దుబాయ్ రామస్వామిBack to list

 హైస్కూల్ లో చదువుకునేటప్పుడు నేనంత మంచి విద్యార్ధిని కాదు.క్లాసులో మార్కుల పరంగా చూస్తే గొప్ప చదువరిని కూడా కాదు.ఆ వయసులో చేసే కొన్ని కొంటె పనుల వల్ల చుట్టు పక్కల వాళ్ళ విమర్శలు వినాల్సి వచ్చేది. ఏదో సంఘటన జరిగినప్పుడు నన్ను అందరూ ఇలాగే విమర్శిస్తుంటే ఓ రోజు మా ఇంటి పక్కావిడ,ఈ వయసులో అందరూ అలాగే ఉంటారు.ఆ వెంకట్రాయులు గారి రామస్వామి వీడి కన్నా తెగ అల్లరి చేసేవాడు, అసలు ఏమవుతాడో అనుకునేవాళ్లు, కాని ఎమ్ టెక్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు.ఇవాళ వాడి కన్నా బుద్ధిమంతులు ఉన్నారా ? అని నన్ను సమర్ధిస్తూ చెప్పింది. ఇది 1994 లో నేను 9 వ తరగతి చదువుతున్నపుడు మొట్ట మొదటిసారి రామస్వామి అనే పేరు విన్న సందర్భం.

 సరిగ్గా పదేళ్ళ తరువాత 

 2004 వ సంవత్సరం చివర్లో అనుకుంటా,  ఒక సాయంత్రం చీకటి పడుతున్న వేళలో కుమ్మరి గుంట ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి మా నాన్న నన్ను వెంటపెట్టుకుని తీసికెళ్లారు. అది వేమూరి వెంకట్రాయులు గారి ఇల్లు. అప్పటికే నాకు దుబాయ్ లో ఉద్యోగ అవకాశం వచ్చింది. వీసా కోసం ఎదురు చూస్తున్న రోజులవి. ఆ రోడ్డులో చాలా సార్లు వెళ్ళినా ఎప్పుడూ ఆ ఇంటి గురించి అంత ఆరా ఉండేది కాదు.అప్పటికే  నా మిత్రులు కొంతమంది దుబాయ్ లో ఉన్నా, మా నాన్న తన తృప్తి కోసం సెలవలకి ఇంటికి వచ్చిన రామస్వామి గారిని కలవటానికి తీసికెళ్లారు.నాకొచ్చిన అవకాశం గురించి చెప్పి , అక్కడ ఎలా ఉంటుంది అని వివరాలడిగి, చివరిగా మా అబ్బాయిని కొంచెం చూస్తూ ఉండు అని నన్ను అప్పగింతలు పెట్టినంత పని చేశారు. ఏమి పరవాలేదు బాబాయ్ అక్కడ మన వాళ్ళు బానే ఉన్నారు, ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటానులే అని భరోసా ఇచ్చి పంపారు.ఇది నేను రామస్వామి గారిని మొట్ట మొదట సారి కలిసిన సందర్భం.అమెరికాలో అయితే మన ఊర్లో చెప్పుకోటానికి చాలామంది ఉన్నారు. సగటున గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలో ఉన్నారని మన వాళ్ళ అంచనా. మరి దుబాయ్ లో అయితే మన గ్రామంలో గుర్తొచ్చే ఏకైక వ్యక్తి వేమూరి రామస్వామి. నేను దుబాయ్ వెళ్తున్నా అని తెలిసి, ఒరేయ్ మన వెంకట్రాయులు గారి అబ్బాయి రామస్వామి ఉండేది అక్కడేగా అంటూ సాయంకాలం అరుగుల మీద కూర్చునే పెద్దవాళ్ళంతా అడుగుతుండేవాళ్ళు.1993 లో దుబాయ్ లో ఉన్న మిత్సుబిషి లో ఇంజినీర్ గా చేరారు రామస్వామి. తన చదువు పూర్తయ్యాక ఇప్పటివరకు మన కరెన్సీలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. కొంత కాలం క్రితం వరకు గ్రామంలో ఈ రికార్డు రామస్వామి గారిదే. ఇప్పుడు మన వాళ్ళంతా చదువుకోసం అమెరికాకి వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మొదటి జీతం డాలర్స్ లో నే ఉంటుంది.2005 మార్చ్ 23 న నేను దుబాయ్ వచ్చాక కొన్ని నెలలకి మా బంధువు,ఘంటసాల కి  పొరుగు గ్రామం కొత్తపల్లికి చెందిన కృష్ణమూర్తి గారు షార్జా లో ఉన్న రామస్వామి గారి ఇంటికి తీసికెళ్లారు. వారి సతీమణి నీలిమ కొత్తపల్లి గ్రామానికి చెందిన అవిర్నేని వారి అమ్మాయి. ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నేను 2005 నుండి 2007 వరకు అక్కడ ఉన్న రెండు సంవత్సరాల కాలంలో ఆ ఒక్కసారే ఆయన్ని కలిసిన సందర్భం. నాకున్న పని ఒత్తిడి వల్ల , కొంత దూరాభారం వల్ల కూడా మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు.చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ దుబాయ్ లో స్థిరపడ్డాను. గత సంవత్సరం మా అబ్బాయి హన్స్ ఉయ్యాల ఫంక్షన్ కి సతీ సమేతంగా విచ్చేసి ఎంతో ఆత్మీయంగా మాతో గడిపారు. 

 

 

రామస్వామి గారు మితభాషి, ఎక్కువ భావోద్రేకం కాని , కృతకంగా కనిపించే ఆప్యాయత కాని అయన పరిచయంలో కనిపించవు. గ్రామంలో జరిగే ప్రజోపయోగ కార్యక్రమాలకి తనవంతు పాత్ర నిర్వహిస్తూనే ఉంటారు.ఐ టి ఐ కాలేజి ముందు ఉన్న బస్ స్టాప్ విశ్రాంతి మందిరం ఆయన కట్టించిందే. అవసరమైన సందర్భాల్లో తన ఉదారతని గోప్యంగా కూడా ప్రదర్శిస్తుంటారు.ఘంటసాల పరిసర ప్రాంతాలనుండి  ఎవరు దుబాయ్ వచ్చినా తన పడవంత కార్ వేసుకుని వాలిపోతారు. వారు దుబాయ్ నుండి వెళ్ళేవరకు ఆ భాద్యతలన్నీ ఆయనవే.ఆయన పేరులో దేవుడున్నా దైవం పట్ల అసలు నమ్మకం లేని మనిషి.తన పేరుకి తగ్గట్లు ఆ శ్రీరామస్వామిని కాకుండా త్రిపురనేని రామస్వామి అడుగుజాడల్ని అనుసరిస్తుంటారు.

Dated : 04.08.2017

This text will be replaced