ఇద్దరు రత్నాలుBack to list

                                                           ఇద్దరు రత్నాలు 

 

ఘంటసాలలో హరిజన దేవాలయ ప్రవేశం గురించి చదివినప్పుడల్లా నా మనసు ఎంతో ఉప్పొంగేది. కులవివక్ష ని ప్రేరేపించింది, అలాగే కుల వివక్ష కి వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా అగ్ర వర్ణాలనబడే ఆ సామాజిక వర్గాల వారే అవ్వటం నాకెప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది.1933 లో దళిత నాయకుడు  శ్రీ వేముల కూర్మయ్య గారి ఆధ్వర్యంలో ఘంటసాలలో జరిగిన హరిజన దేవాలయ ప్రవేశ ఘట్టానికి నాయకత్వం వహించింది  శ్రీ ఘంటసాల లక్ష్మీ నరసింహం పంతులు , శ్రీ గొట్టిపాటి బ్రహ్మ్మయ్య , శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటి బ్రాహ్మణ , కమ్మ కులాలకి చెందిన పెద్దలే. 1933 లోనే అటువంటి విశాల భావాలు కలిగిన మహాత్ములకి జన్మనిచ్చింది మన ఘంటసాల గడ్డ అని నాకు చాలా గర్వంగా ఉండేది. నా వరకు నేను కుల వివక్ష కి వ్యతిరేకం. స్వకులాభిమానం తప్పు కాదు, కాని కులం పేరుతొ ఒక మనిషిని వెలివేయటం,చులకనగా చూడటం లాంటి వాటికి నేను బద్ధ వ్యతిరేకిని.ఈ విషయంలో నా కులస్తులే నన్ను వ్యతిరేకించినా నేను లెక్క చెయ్యలేదు. మొన్న తెలుగు మాస్టారు విశ్వేశ్వరరావు గారిని అడిగాను. ఫేస్బుక్ లో మీ పేరుకి ఇంటి పేరు తగిలించలేదే అని. అది పెడితే నా కులం తెలుస్తుంది అందుకే పెట్టను అన్నారు.ఇంకా ఘంటసాలలో అభ్యుదయ వాదులు ఉన్నారని మనసులో అనుకున్నాను. 
ఈ మధ్య ఘంటసాలలో ఓ ప్రముఖ గాయకుడు విచ్చేసినపుడు ఒక ఇంట్లో ఆయనకి భోజనం ఏర్పాటు చేశారు.నేను కూడా ఆయనతో పాటు ఆ విందులో ఉన్నాను. ఆ ఇంటికి నేను వెళ్ళటం అదే మొదటిసారి.మంచి ఎండలో వెళ్ళిన నాకు ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఎ /సి లేకపోయినా చాలా చల్లగా అనిపించింది.మా భోజన ఏర్పాట్లన్నీ చూస్తూ ఆ ఇంటి యజమానురాలు పాపా పాపా అంటూ ఒక చిన్న పిల్ల మీద ఆధారపడటం చూశాను. చివరికి మాతో మాట్లాడటానికి కూర్చునప్పుడు కూడా ఆ పాప ని తన పక్కనే కూర్చోబెట్టుకోవటం గమనించాను. ఇంతలో ఆ గాయకుడు ఎవరమ్మా ఈ పాప అని అడిగారు. ఇక ఆ ఇల్లాలు ఆ పాప గురించి చెప్పటం మొదలుపెట్టింది, నా దగ్గరే ఉంటుంది బాబూ, నా ఆలనా పాలనా తనే చూస్తుంది, 12 ఏళ్ల నుండి మాతోనే ఉంది. పాప లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవదు. కనీసం అది పక్కన లేకుండా కూడా నేను మాట్లాడలేను అని ఆ తల్లి గుక్క తిప్పుకోకుండా చెబుతోంది. అప్పటిదాకా చిన్న పిల్ల అనుకున్న నాకు ఆ అమ్మాయి మానసికంగా తప్ప శారీరకంగా ఎదగలేదని అర్ధం అయ్యింది. ఆ తల్లి తన వాక్ప్రవాహాన్ని కొనసాగిస్తూనే పాప రోజూ వేరే గదిలో పరుపు వేసుకుని పడుకునేది. మొన్న మా అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు బాబూ,అలా పడుకున్న పాపని ఎత్తుకొచ్చి నా గదిలో మంచం మీద పడుకోబెట్టాడు. ఏమ్మా నీ ఆలనా పాలనా చూడటానికి అడ్డు రాని కులం నీ పక్కన పడుకోవటానికి అడ్డం వచ్చిందా అని అడిగాడు. అప్పుడు మా బంధువులు, సమాజం ఏమనుకుంటుందో  నేను కొంచెం అబిరి తిబిరి అయ్యాను. పొద్దున్న లేవగానే పాపకి తను ఎక్కడ ఉందో అర్ధం కాలేదు. క్షమించమ్మా తెలియక పడుకున్నాను అని చెప్పింది. మేమెవ్వరం ఏమి మాట్లాడలేదు. మరుసటి రోజు కూడా ఇదే జరిగింది, పాప పడుకోగానే మళ్ళీ మా అబ్బాయి ఎత్తుకుని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టాడు.మా అబ్బాయి అలా చేసేటప్పటికి నాకూ ధైర్యం వచ్చింది.అప్పటినుండి నేను కూడా నా మంచం మీదే నా పక్కనే పడుకోబెట్టుకుంటాను. మా రెండో అబ్బాయి ,మా బంధువులు అందరూ కూడా నాకేది తెచ్చినా పాప కి కూడా తెస్తారు. తను మా ఇంటి ఆడపడుచు గానే అందరూ భావిస్తారు.పండగైనా, పబ్బమైనా మా పాపకి అందరూ బట్టలు తెస్తారు.నాకు పాప లేకుండా ఏమీ తోచదు.మాకెంతో నమ్మకస్తురాలు అంటూ ముగించింది. ఆ తల్లి అలా చెప్తున్నపుడు నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. అక్కడ ఎ /సి లేకపోయినా ఎందుకంత చల్లగా ఉందో అప్పుడర్ధం అయ్యింది. ఆ చలువరాతి మేడలో చల్లదనం ఆ రాయిలో లేదు ఆ ఇంటి మనుషుల మనస్సులో ఉంది అని. ఆ తల్లి కూడా తన బంధువులు, సమాజం ఏమనుకుంటుందో అని భయపడింది తప్ప తనకి ఆ వివక్ష ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదు.చివరికి వారి బంధువులంతా కూడా అదే భావాలు కలిగి ఉండటంతో తన మనసు కుదుటపడింది. ఆ పాపతో వారికున్న అనుభందాన్ని విన్నాక చెమ్మగిల్లిన మనసుతో అక్కడినుండి వచ్చేటపుడు, అమ్మా తప్పుగా అనుకోకు మీది ఏ కులం అని ఆ పాపని అడిగాను.ఆ పాప చెప్పింది. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయాక కూడా కులాల పేరుతో అడ్డుగోడల్ని నిర్మించుకునే దశ నుండి గత 100 సంవత్సరాలుగా మనం ఎదగలేకపోయాం. సప్త సముద్రాలు దాటి మరో దేశానికి వెళ్లి కూడా కుల ప్రాతిపదిక మీద సంఘాలు పెట్టుకుని ఈ జాడ్యాన్ని అక్కడికి కూడా వ్యాపింపచేసే ప్రయత్నంలో మాత్రం చాలా త్వరగా ఎదిగాం. ఆ ఇంటి నుండి వచ్చేశాక చాలా సేపు ఆ సంఘటన నన్ను వెంటాడింది.కుల వివక్ష కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎందరో మహానుభావులు పుట్టిన ఘంటసాల గ్రామం మరో ఇద్దరు "రత్నాల"కి జన్మనిచ్చింది. ఒకరు రాజ"రత్నం" మరొకరు "రత్న"శేఖరం. 
 
dated : 06.04.2016

This text will be replaced