స్వచ్ఛ నాయకుడుBack to list

స్వచ్ఛ నాయకుడు

నేను ప్రతి రోజు ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యగానే నా న్యూస్ ఫీడ్ లో మసక చీకట్లో చీపుర్లు , పారలు పట్టుకుని కొంతమంది రోడ్లు శుభ్రం చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవుతుంటాయి. మొదట్లో నలుగురైదుగురు మాత్రమే ఆ ఫోటోలలో కనిపించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఫోటోలలో జనాలు పెరుగుతూ వచ్చారు. మసక చీకట్ల దృశ్యాలతో పాటు పగటి కాంతుల్లో ధగ ధగ లాడుతున్న సుందరవీధులు , పచ్చటి మొక్కలు కనపడసాగాయి. ఆ ప్రాంతాల్ని గుర్తుపట్టటానికి ఒక్కో ఫోటో నాలుగైదు సార్లు చూడాల్సి వచ్చేది. ఎందుకంటే ఫోటోలలో కనిపిస్తున్న వీధిని కాని ఆ రోడ్డు ని కాని ఎప్పుడూ అలా చూడలేదు , చూస్తానని కూడా అనుకోలేదు. గత 299 రోజులుగా ఒక్క రోజు కూడా కూడా పొల్లు పోకుండా నేను చూస్తున్న దృశ్యాలు అవి. ఇంతకీ ఏమిటి ఆ ఫోటోలు ? ఎక్కడివి ఆ దృశ్యాలు ? 
 
​1997 లో మా బంధువు ఒకావిడ అస్వస్థతతో ఉంటే చూడటానికి మా అమ్మతో పాటు ​మొట్టమొదటిసారి నేను చల్లపల్లిలో ఉన్న పద్మావతి హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ హాస్పిటల్ అప్పుడే కొత్తగా నిర్మించారు. చల్లపల్లి మెయిన్ రోడ్డు నుండి 2 ఫర్లాంగులు లోపలకి పచ్చటి  పొలాల మధ్యలో ఆ బిల్డింగ్ అత్యంత ఆధునికంగా కనిపించేది. కాని ఆ బిల్డింగ్ ని చేరుకోవటానికి  మాత్రం ఆ 2 ఫర్లాంగులు ముక్కు మూసుకుని నడవాల్సి వచ్చేది.​ దాదాపు 18 ఏళ్ల తరువాత ​ 2014 జులై లో ​కూడా మళ్ళీ అదే హాస్పిటల్ కి​ అదే రోడ్డు లో ముక్కు మూసుకునే వెళ్ళాల్సి వచ్చింది.​
 
రోడ్డు మొదట్లో మాత్రం గ్రామ పంచాయితీ పెట్టిన ఒక బోర్డు ఉంది ,ఈ రోడ్డులో మల విసర్జన చెయ్యవద్దు అని. ఈ ​18​ ఏళ్లలో ఆ హాస్పిటల్ చుట్టూ ఉన్న పొలాలు మాయమై అత్యాధునిక బిల్డింగ్ లు , రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొచ్చాయి.​ కాని వాటికి వెళ్ళే ఆ రోడ్డు మాత్రం మారలేదు. బహిరంగ మలవిసర్జన అనేది సాంఘిక దురాచారం ​అని ప్రతి రోజూ ప్రసార మాధ్యమాల్లో మొత్తుకుంటున్నా చల్లపల్లి లాంటి ఊర్లో ఇంకా అది కొనసాగటం బాధాకరం అనిపించింది. అది కూడా రోజూ కొన్ని వందలమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవాలయం లాంటి హాస్పిటల్ ఉన్న రోడ్డులో. 

మరి ఈ 20 ఏళ్లలో ఎన్ని వేలమంది పేషంట్లు ఎన్ని లక్షల సార్లు ఆ హాస్పిటల్ కి వెళ్లి ఉంటారు ? ప్రతి రోజూ ఆ హాస్పిటల్ డాక్టర్లు , నర్సులు ఆ దారి  వెంటే నడుస్తున్నారు.ఈ సమస్య కి ఒక్కరికి కూడా పరిష్కారం కనిపించలేదా అనే ఆలోచన కూడా కలిగింది. అయితే ఆ రోడ్డుని మార్చటానికి డాక్టర్ DRK ప్రసాద్ దంపతులు చేయని ప్రయత్నం లేదు. చుట్టుపక్కల వారందరికీ ఎన్నో సార్లు అవగాహన కలిగించే ప్రయత్నాలు చేశారు. కాని రోడ్డు బాగు చేసిన  కొన్ని రోజులకి మళ్ళీ అదే పరిస్తితి . చివరికి 2014 నవంబర్ లో  ప్రభుత్వం మొదలు పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆ రోడ్డు గతిని దానితో పాటు మొత్తం ఊరు పరిస్థితినే మార్చేసింది. ఊర్లో అందరి రోగాల్ని బాగుచేసే ఆ హాస్పిటల్ డాక్టర్లు ఊరిని కూడా బాగు చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. అదే స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ,ఆ డాక్టర్ దంపతులు శ్రీ DRK  ప్రసాద్ , శ్రీమతి పద్మావతి. వారికి ఆసరాగా నిలిచిన సంస్థ జనవిజ్ఞాన వేదిక.
 
సమాజంలో పేరుకుపోయిన మూఢ నమ్మకాలని , సాంఘిక దురాచారాలని రూపు మాపే లక్ష్యంతో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ స్థానిక అధ్యక్షులుగా ఉన్న శ్రీ DRK  ప్రసాద్ గారు ఇన్నేళ్ళ పాటు సాగించిన ఉద్యమం ఒక ఎత్తు అయితే స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ఆయన జీవన సాఫల్య కార్యక్రమం.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రోజులనుండి తెల్లవారుఝామున  4 గంటల నుండి 7 గంటలవరకు  స్వచ్ఛ సైన్యం చల్లపల్లి రోడ్లని శుభ్రం చేస్తూనే ఉంది. ఈ సైన్యంలో విద్యాధికులున్నారు, విశ్రాంత ఉద్యోగులున్నారు, సామాన్య ప్రజలున్నారు. వీళ్ళందరికీ స్ఫూర్తినిచ్చిన స్వచ్చ నాయకుడు శ్రీ DRK ప్రసాద్ సైనికుడిలా వాళ్ళతోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ సైన్యంలో చేరదామా అని నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంది. సెలవులకి ఇండియా వెళ్ళినపుడు అక్కడ ఉన్నన్ని రోజులు స్వచ్ఛ చల్లపల్లి లో భాగస్వామిని కావాలని చాలా సార్లు అనుకున్నాను.
 
నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ప్రారంభించి ఒకరోజు చీపురు పట్టుకుని ఢిల్లీ వీధుల్ని ఊడ్చి జాతికి స్వచ్ఛ భారత్​ వైపు ​ దిశా నిర్దేశం ​​చేశారు. రెండు రోజుల తర్వాత కొందరు కుహనా మేధావులు మీడియా ముందుకు వచ్చి మోడీ ఫొటోలకి ఫోజులు ఇచ్చి పోయారని ఎద్దేవా చేశారు. అంటే ఈ దేశ ప్రధాని పాలన వదిలేసి చీపురు పట్టుకుని రోడ్లు ఊడవాలన్నది వారి ఉద్దేశమేమో. నాయకుడు అనే వాడు  ప్రజల్ని ఉత్తేజపరిచి లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా ​ప్రేరేపిస్తాడు. ఆ లక్ష్యం వైపు తాను తొలి అడుగు వేసి ప్రజల్ని ఆ అడుగు జాడల్లో నడపటం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాడు, జాతిని ఆ లక్ష్యం వైపు చేరుస్తాడు. కాని ఇక్కడ స్వచ్ఛ నాయకుడు ప్రజలతో నడుస్తున్నాడు , కొన్ని వందలమందికి స్పూర్తి నిస్తున్నాడు. తన ఊరుని దేశ పటంలో నిలబెడుతున్నారు. 30 ఏళ్లుగా ఆ ఊరులో వైద్య వృత్తిలో ఉన్న ఆ వైద్యుడు , తన గ్రామ ప్రజలకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు.

రోజు రోజుకీ ఆ సైన్యం పెరుగుతూనే ఉంది దానితో పాటు చల్లపల్లి రూపు రేఖలు మారుతూనే ఉన్నాయి. 100 రోజులకి ఒకసారి 200 రోజులకి ఒకసారి 300 రోజులకి ఒకసారి స్వచ్ఛ సైన్యం తమ విజయాల్ని నెమరు వేసుకుంటోంది. ఇది ఇలాగే సాగాలని కోరుకుంటోంది. కాని నేను మాత్రం ఇది ఇలా సాగాలని కోరుకోవట్లేదు. చల్లపల్లి జనాభాలో 1 శాతం కంటే తక్కువమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా ఎన్నాళ్ళని ఇలా రోడ్లు ఊడుస్తూ , అందరి మల మూత్రాలని ఎత్తుతూ ఉంటారు? సామాజిక భాధ్యత అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. చల్లపల్లి ప్రజలు మొత్తం ఒక్క రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అది ఇప్పుడు చేస్తున్న వారి 1000 రోజుల పనికి సమానం. 

అంతెందుకు ప్రజలందరిలో అవగాహన వస్తే , వీళ్ళు ఈ ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుండే అందరూ చెత్తని కుండీలలో వేస్తూ ప్రతి ఇంటి ముందు తామే ఒక మొక్కని నాటి రోజూ సంరక్షిస్తే ఈ ఉద్యమం మొదటి 100 రోజులకే ముగిసిపోయేది.

విదేశాల్లో ఉండే మాలాంటి వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద చాక్లెట్ కాగితం వెయ్యటానికే భయపడి చస్తాం. అక్కడ విమానం దిగగానే కొంతమందికి ఎక్కడ లేని స్వాతంత్రం వచ్చేస్తుంది. అక్కడ దాచుకున్న అవలక్షణాలన్ని ఇండియా రాగానే బయటకి వచ్చేస్తాయి. విదేశాలు చూసి అక్కడ పరిస్తితుల మీద అవగాహన ఉన్న వాళ్లే  అలా చేస్తుంటే , అవగాహన లేని వాళ్ళు శుభ్రతని ఎలా పాటిస్తారు ?

 చల్లపల్లి దివిసీమలో ఇప్పుడిప్పుడే పట్నంగా మారుతున్న మెగా పల్లెటూరు​. అటు పల్లెటూరుకి ఎక్కువ పట్నం కి తక్కువగా మధ్యస్తంలో ఉండిపోయిన ​​ ప్రాంతం. చుట్టుపక్కల 6 మండలాలకి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో విద్య , వైద్యం ,వినోదం అందుబాటులో ఉన్న ప్రాంతం. చల్లపల్లిలో అపార్ట్మెంట్లు కడతారని కొన్ని సంవత్సరాల క్రితం అసలు మన ఊహకైనా అందని​ ఆలోచన​.​ ​అలాంటిది ఏకంగా గేటెడ్ కమ్యూనిటీ లే నిర్మాణమవుతున్నాయి. ​భవిష్యత్తులో నగరంగా ఎదగటానికి అన్ని అవకాశాలు ఉన్న చల్లపల్లిని ఇప్పటినుండే అందుకు సిద్ధం చేస్తున్న స్వచ్ఛ నాయకులు శ్రీ DRK  ప్రసాద్ , శ్రీమతి పద్మావతి గారికి వారి వెంట నడుస్తున్న స్వచ్ఛ సైన్యానికి నా సెల్యూట్.
 
చల్లపల్లితో చిన్నప్పటినుండి ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. కొత్త సినిమాలు చూడాలంటే సైకిల్ వేసుకుని ఘంటసాల నుండి ఒక్క ఉదుటున చల్లపల్లిలో వాలిపోయేవాళ్ళం. టికెట్ కౌంటర్ల దగ్గర తోపులాటలు, హీరో తెర మీద కనపడగానే ఈలలు అవన్నీ మధురానుభూతులే. కోమలా టాకీస్ , సాగర్ టాకీస్ , కమల్ టాకీస్ లకి ఇప్పుడు వెళ్ళినా ఆ  విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాం. కాలేజి బస్సు పాస్ లు కట్టటానికి బస్ స్టాండ్ కౌంటర్ లో లైన్ లో నిలబడ్డ జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉన్నాయి. అన్నిటినీ మించి ఘంటసాల నాకు జన్మనిచ్చిన ఊరు అయితే , చల్లపల్లి నాకు పిల్లనిచ్చిన ఊరు. జై స్వచ్ఛ చల్లపల్లి.  

Dated : 04.09.2015

Watch the Video here 

  

This text will be replaced