మన ఊరి శ్రీమంతుడుBack to list

మన ఊరి శ్రీమంతుడు

టైటిల్ వినగానే ఇదేదో గ్రామంలో ఆస్తి పరుల గురించిన కధనం అనుకోకండి. మొన్నే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు చూశాను. గ్రామం నుండి సిటీకి వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించిన తర్వాత మళ్ళీ సొంత ఊరుని దత్తత తీసుకుని అభివృద్ది చెయ్యటం అనే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు అందులో హీరోగా మహేష్ బాబు కనపడలేదు. యాదృచ్చికం గానే సినిమాలో మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామం పేరు దేవరకోట. కృష్ణా జిల్లాలో వెనుకబడిన ఊరు అంటే సమర్ధనీయంగా ఉండదేమో అని కాబోలు సినిమాలో ఇది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నట్లు చూపించారు. సినిమాలో మహేష్ బాబు ఊరుకి రావటం దగ్గరనుండి అనుక్షణం నా కళ్ళముందు కనిపించిన వ్యక్తి శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారు. శిధిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ ని పునర్నిర్మించటంతో మొదలైన సేవా కార్యక్రమం చూడగానే మన హైస్కూల్లో రంగనాధబాబు బాబు గారు పదేళ్ళ క్రితమే కట్టించిన హైస్కూల్ బిల్డింగ్ గుర్తొచ్చింది. నీళ్ళు లేక ఎండిపోతున్న పొలాలని కాపాడటానికి చెరువు నీళ్ళని మళ్ళించి రైతులని కాపాడాలని ప్రయత్నించిన హీరోని చూసినపుడు , 8 ఏళ్ల క్రితమే గుండేరు మీద బెడ్ రెగ్యులేటర్ నిర్మించి చివరి ఎకరం వరకు నీరందించిన రంగనాధబాబు గారి భగీరధ ప్రయత్నం గుర్తొచ్చింది. మహేష్ బాబు కబడ్డీ ఆడుతున్నపుడు , ప్రతి సంక్రాంతికి మన గ్రామంలో గొర్రెపాటి విద్యా ట్రస్ట్ నిర్వహించే కబడ్డీ పోటీలు , ముగ్గుల పోటీలు , ఎడ్లపందాలు గుర్తొచ్చాయి. ఊరికి రోడ్డు వేస్తున్నపుడు , గ్రామంలో ఎన్ ఆర్ ఐ ల సాయంతో వేస్తున్న సిమెంట్ రోడ్లు కళ్ళ ముందు కదిలాయి. 

రాజేంద్రప్రసాద్ కారక్టర్ ని చూసినపుడు మన ఊరులో ఉన్న చాలామంది పెద్దలు గుర్తొచ్చారు. రంగనాధబాబు గారి సంకల్పానికి వెన్నుదన్నుగా నిలబడి ఆయన చేపట్టిన సేవాకార్యక్రమాలని నిస్వార్ధంగా నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్ లాంటి మనుషులు మన గ్రామంలోనూ చాలామంది ఉన్నారు. ఇలా ఒకటేమిటి ప్రతి సన్నివేశంలోనూ నాకు మన గ్రామం , మన శ్రీమంతుడు రంగనాధబాబు గారే గుర్తొచ్చారు. రంగనాధ బాబు గారితో పాటు మన గ్రామం నుండి విదేశాల్లో , వ్యాపారాల్లో స్థిరపడ్డ చాలామంది వదాన్యులు తమ తమ వదాన్యతని పలు సందర్భాల్లో చాటుకుంటూనే ఉన్నారు. జలదీశ్వరాలయ పునర్నిర్మాణంలో , రుద్రభూమి నిర్మాణంలో , స్కూల్ అభివృద్ధి లో , మన ఊరికి చాలామంది శ్రీమంతులే ఉన్నారు. తప్పకుండా వారందరి సేవలని తలుచుకోవటం మన భాద్యత.

అయితే ఈ కాన్సెప్ట్ కి 28 సంవత్సరాలకి ముందే ఆద్యులుగా  శ్రీ రంగనాధబాబు గారినే చెప్పుకోవాలి. ప్రతిభ ఉండి చదువుకోవటానికి తగిన ఆర్ధికస్తోమత లేని విధ్యార్ధులను ప్రోత్సహించాలని 1987 లో  శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యాట్రస్టు ని నెలకొల్పి ,అప్పట్లో లక్ష రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వాటి పై వచ్చే వడ్డీ తో హైస్కూలు విధ్యార్ధులకు బహుమతులు మరియు మెరిట్ స్కాలర్ షిప్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. నేను వ్యక్తిగతంగా ఆయన్ని కలిసినపుడు, విద్య లేకపోవటం వల్లే వెనకబాటు తనం వస్తుందని బలంగా నమ్మటం వల్ల, ఆ విద్యని అందరికీ అందించాలనేదే తన సంకల్పం అని చెప్పారు. ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టటానికి కారణం, వెనకబడిన వర్గాలు చదువుకోగలిగింది ప్రభుత్వ పాఠశాలలోనే.అందుకే మన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా శిధిలమవుతున్న ప్రభుత్వ పాఠశాలల భవనాల పునర్నిర్మాణాన్ని చేపట్టారు.

కాలం గడుస్తున్న కొద్దీ ఆయన సేవా కార్యక్రమాల విస్తృతి పెరిగింది. కేవలం విద్యా సంభంధమైన విషయాలే కాకుండా గ్రామీణ పరిశుభ్రత మెరుగు పరచాలనే సంకల్పం తో స్వచ్చంధంగా మరుగు దొడ్లు నిర్మించుకునే వెనకబడిన తరగతుల వారికి ఆర్ధికసాయం అందించారు. శివారు గ్రామాల్లో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం, పాఠశాలల తరగతి గదుల నిర్మాణం చేపట్టి ఆయా గ్రామాల అభ్యున్నతి కి కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ లు,అర్హులైన వారికి వైద్యసాయం,వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారు. ఈ 28 ఏళ్లలో దాదాపు 3 కోట్ల రూపాయలకి పైగా గ్రామాభివృద్ధికి వెచ్చించారు. ఊరు మొదట్లో కనిపించే హైస్కూలు నుండి ఊరు చివర నిర్మించిన బెడ్ రేగ్యులటర్ వరకు ఆయన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఛాయలు మనకి అడుగడుగునా మన కళ్ళకి సజీవ సాక్ష్యాలుగా కన్పిస్తాయి. బడి , గుడి , రోడ్లు , వ్యవసాయం , నీరు , ఇలా ఒకటేమిటి గ్రామంలో ప్రతి చోట గొర్రెపాటి విద్యా ట్రస్ట్ ముద్ర కనిపిస్తుంది. రంగనాధబాబు గారి స్ఫూర్తితోనే మిగతా వారంతా తమ వంతు బాధ్యతగా నిర్మించిన రుద్రభూమి , కళ్యాణ మండపం , జలధీశ్వరాలయ పునర్నిర్మాణం , సిమెంట్ రోడ్లు, మన గ్రామంలోని శ్రీమంతుల దత్తతకి , జన్మభూమి మీద వారికున్న భాధ్యతకి నిదర్శనాలు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ , మన శ్రీమంతుడు శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారికి, ఆయనకీ అండగా నిలిచిన వారి సోదరులు , శ్రీ పట్టవర్ధన్  , శ్రీ నవనీత కృష్ణ , శ్రీ సురేంద్ర గార్లకు మరియు వారి కుటుంబాలకి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. 

Dated : 14.08.2015

 

This text will be replaced