మరుగున పడ్డ మాణిక్యంBack to list

                                                      మరుగున పడ్డ మాణిక్యం

రాజధాని పేరు ని అమరావతి గా ప్రకటించిన మరుక్షణమే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా మరియు నెటిజన్లు అమరావతి పేరు వెనుక కధల్ని , దాని యొక్క చారిత్రిక నేపధ్యాన్ని పుంఖాను పుంఖాలుగా ప్రసారం చేశారు, ఇంకా చేస్తున్నారు. మన రాజధాని అమరావతి అని చెప్పుకోవటానికి ఒక ఆంధ్రుడిగా నేనెంతో గర్వపడుతున్నాను. అమరావతి ప్రాశస్త్యం తెలుగు జాతి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. చిన్నప్పుడు చదివిన అమరావతి కధలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు పులకిస్తుంది. బౌద్ధ ఆరామంగా ప్రపంచ స్థాయిలో ప్రసిద్ది గాంచిన అమరావతి ఇప్పుడు మన రాజధాని. 2006 లో బౌద్ధ భిక్షువులతో దలైలామా నిర్వహించిన కాల చక్ర కార్యక్రమం మరొక్క సారి అమరావతి గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఆంధ్ర ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ మత ఆనవాళ్ళు , అవశేషాలు మొత్తం 13 జిల్లాల్లో 22 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వాటిల్లో నాగార్జున కొండ , అమరావతి , గుంటుపల్లి మాత్రమే అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్తూపాలు చూడాలంటే మాత్రమే  టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. మిగతా వాటన్నిటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించలేకపోయినా, కనీసం ఘంటసాల గ్రామం గురించి మాత్రం తప్పకుండా చెప్పగలను. అమరావతికి , ఘంటసాల గ్రామానికి ఉన్న సారూప్యత ఏమిటంటే, బౌద్ధం శైవం రెండూ ఒకేచోట విలసిల్లిన ప్రాంతాలు, అక్కడ బౌద్ధ స్తూపంతో పాటు పురాతన అమరేశ్వర దేవాలయం ఉంటే , ఘంటసాలలో బౌద్ధస్తూపంతో పాటు పురాతన జలధీశ్వర స్వామి ఆలయం ఉంది. 
 
స్తూపం అంటే భౌద్ధంలో చైత్యం అని అర్ధం. ఘంటసాలలో మొత్తం ఇలాంటివి అయిదు స్తూపాలున్నాయి.దక్షిణం వైపు ఉన్న కోటదిబ్బ,పశ్చిమాన ఉన్న ఎర్రంపాళ్ల దిబ్బ,మాలపల్లె లోని గొర్రెపందాల దిబ్బ,ఉర్లోనే ఉన్న కోడిపందాల దిబ్బ. అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు.  కాబట్టి ఘంటసాల మహాచైత్యం.​ ప్రస్తుతం ఘంటసాల లో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ, అమరావతి లో లేదు. అదీ కాక ఈ  స్తూపం 70 శాతం యధాతధంగా ఉంది. అమరావతి, నాగార్జునకొండలలో  స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు . మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరం లో మహదేవుడనే భౌద్ధ భిక్షువు ను దేశంలోని వివిధప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటసాల, నాగార్జునకొండ, అమరావతిలలో నిక్షిప్తం చేశాడని 'దివ్య వాదన 'అనే గ్రంధం లో వివరించబడింది. 
 
2006 లో అమరావతిలో జరిగిన కాల చక్ర కార్యక్రమ సందర్భంలో దలై లామా కి ఘంటసాల బౌద్దారామ విశేషాలని వివరిస్తున్న అప్పటి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి మరియు వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ . 
 
1870లో మొదటిసారిగా ఈ స్తూపం వెలుగులోకి వచ్చింది.అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.ఆ తరువాత 1906 లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.ఈ స్తూపమువంటిది దక్షిణభారత దేశం లోనే లేదని ప్రకటించాడు.ఘంటసాల ఒకప్పటి భౌద్ధ క్షేత్రమని ప్రపంచానికి తెలియ చేసింది ఆయనే. భౌద్ధ మతస్తులు తమ మత స్తూపాలను,సంఘారామములను,సహజ సుందర ప్రదేశములలోనూ విస్తార జలసంపదలున్న ప్రాంతాలలోనూ నిర్మించారు .బుద్ధభగవానుడు సకల భోగాలతో జీవనం సాగించే సమయం లో మానవ జీవితంలో దుఖ నివారణకి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం లో అర్ధరాత్రి వేళ భార్యాపిల్లలను, రాజ్యాన్ని విడిచి ఒక అశ్వము పై ఎక్కి వెళ్ళిపోతాడు.బుద్ధునికి ప్రియమైన ఆ అశ్వము పేరు కంటకము.ఆ కంటకము పేరిట నిర్మించబడిన మన గ్రామము కంటకశైల గా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటసాల గా నామాంతరం చెందింది.
 
బౌద్ధ స్తూప ప్రస్తుత రూపం 
 
ఇప్పుడు రాజధానిగా ప్రకటించాక అమరావతిలో ఉన్న బౌద్ధ స్తూపం గురించి చర్చించుకుంటున్న సమయంలో  అదే విషయంలో సమానార్హత కలిగిన ఘంటసాల గురించి కూడా చర్చ జరగాలి. కాల చక్ర సమయంలో కూడా నిరాదరణ కి గురైన మన ఘంటసాల ఇప్పుడు రాష్ట్ర రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఘంటసాల ఎందుకు మరుగున పడిపోయింది ?  

అమరావతితో పాటు సమాన గౌరవం దక్కటానికి అన్ని అర్హతలు ఉన్న ఘంటసాల దగా పడింది. ఓ మరుగున పడ్డ మాణిక్యం గా మిగిలిపోయింది. 
 
Dated : 25.03.2015

 

This text will be replaced