కువైట్ లో మనఘంటసాల వారుBack to list

కువైట్ లో మనఘంటసాల వారు

ఉద్యోగ నిర్వహణలో భాగంగా పలు దేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో పోలండ్లో పని చేసినపుడు దాదాపు అన్ని ఐరోపా దేశాల్లో పర్యటించాను. కొంతకాలంగా దుబాయ్ లో పని చేస్తుండటంతో మా సంస్థకి సంభందించిన వ్యాపార కార్యకలాపాలు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఒమన్ , కువైట్ , ఖతర్ , సౌదీ అరేబియా , బహ్రెయిన్ లలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడికి  బిజినెస్ ట్రిప్ వెళ్ళినా స్వామి కార్యం , స్వ కార్యం రెండూ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఆఫీసు పనులయ్యాక కనీసం ఒక్క రోజు ని అక్కడి విశేషాలని , చారిత్రక అంశాలని తెలుసుకోవటానికి పెట్టుకుంటాను. ఈ మధ్య అలాగే మొదటి సారి కువైట్ వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్ నుండి కువైట్ సరిగ్గా గంట నలభై నిమిషాలు ప్రయాణం. కువైట్ లో రెండు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దేశీయ , అంతర్జాతీయ విమానాలు కూడా వస్తాయి. కేవలం ఒక టెర్మినల్ మాత్రమే ఉన్న అతి చిన్న ఎయిర్పోర్ట్ అల్ సాద్. మధ్య ప్రాచ్య దేశాల నుండి వచ్చే చిన్న విమానాలు అల్ సాద్ ఎయిర్ పోర్ట్ కే వస్తాయి. దుబాయ్ రెసిడెన్స్ వీసా కనుక ఉంటే గల్ఫ్ కౌన్సిల్ దేశాల్లో ఆగమానంతర వీసా తీసుకోవచ్చు. అల్ సాద్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. ఫ్లైట్ దిగగానే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ పక్కనే వీసా తీసుకునే సదుపాయం ఉంది. వీసా ఖరీదు 3 కువైట్ దినార్లు. ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ కువైట్ దినార్. మన డబ్బుల్లో ఒక దీనార్ కి 210 రూపాయలు వస్తాయి. మన  గ్రామానికి చెందిన శ్రీ మూల్పూరి వెంకటేశ్వరరావు గారు గత ఎనిమిదేళ్లుగా కువైట్ లోనే పని చేస్తున్నారు.ఈ వెబ్ సైట్ ద్వారానే నాకు ఆయనకీ పరిచయం.నేను వస్తున్నా అని చెప్పగానే ఆయన తీసుకున్న శ్రద్ధ అనిర్వచనీయం. నేను మొదటి సారిగా అక్కడికి వెళ్తున్డటంతో ఆయనే ఎయిర్ పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు.నేను అక్కడ ఉన్న రెండు రోజులు ఆయన ఆదరణ , ఆప్యాయత అపూర్వం. ఆయనతో పాటు మనగ్రామానికే చెందిన మరో మూడు కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. గతంలో మన ఊరి టెలిఫోన్ ఎక్స్చేంజి లో లైన్ మెన్ గా పనిచేసిన గొర్రిపర్తి కృష్ణమూర్తి గారి అబ్బాయి సుధాకర్ , దేవరకోట గ్రామానికి చెందిన శ్రీమతి వేమూరి లక్ష్మి , తుమ్మల వెంకటేశ్వరరావు దంపతులు అక్కడ నేను కలిసిన వారు. ఇక రుద్రవరం గ్రామానికి చెందిన శ్రీ ఎనిగళ్ళ  బాలకృష్ణ గారు ఇక్కడ మన వారందరికీ పెద్ద దిక్కు. కువైట్ లో స్థాపించిన తెలుగు కళా సమితికి 2 సార్లు అధ్యక్షులుగా పని చేశారు. ఘంటసాల కి చెందిన స్వర్గీయ గొర్రెపాటి పాపన్న మాస్టారి కుమార్తె ని ఆయన వివాహం చేసుకున్నారు. గత 22 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు.   
 
                        ఎనిగళ్ళ బాలకృష్ణ గారి కుటుంబంతో వారింట్లో
వెళ్ళిన మొదటి రోజు ఆఫీస్ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని మరుసటి రోజు కువైట్ నగరాన్ని చూడాలని నిశ్చయించుకున్నాను. ఈ దేశం పేరు వినగానే నాకు మొదట గుర్తొచ్చేది 1990 లో జరిగిన గల్ఫ్ యుద్ధం. అప్పటికి నా వయసు తక్కువే అయినా అప్పటి వార్తలు నా మదిలో అలాగే ఉండి పోయాయి. నా ఆసక్తిని గమనించిన మూల్పూరి  వెంకటేశ్వరరావు గారు మరుసటి రోజున సెలవు పెట్టి మరీ నాకు అక్కడి విశేషాలని చూపించటానికి వచ్చారు. కువైట్ లో రెండు నేషనల్ మ్యూజియం లు ఉన్నాయి. ఒక మ్యూజియం లో ఒకప్పటి కువైట్ నిర్మాణం , అప్పటి ప్రజల జీవన విధానం. నౌకల ద్వారా భారత దేశంతో జరిగిన వాణిజ్యం తో పాటు, తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువులు ప్రదర్శనకి ఉంచారు. 1958 లో తోలి అరబ్బీ పత్రిక ఇక్కడినుండే వెలువడింది. ఈ మ్యూజియం పక్కనే సైన్స్ ప్లానిటోరియం ఉంది. మేము వెళ్ళినపుడు కొన్ని స్కూల్ బస్సుల్లో పిల్లలు ప్లానిటోరియం చూడటానికి వచ్చారు. దీనికి దగ్గరలోనే ఈ దేశపు పార్లమెంట్ ఉంది. 1961 లో బ్రిటీష్ పాలన నుండి విముక్తి చెందాక 1963 లో కొత్త ముసాయిదా రాజ్యాంగాన్ని , పార్లమెంట్ ని ఏర్పరచిన మొట్టమొదటి గల్ఫ్ దేశం కువైట్.కువైట్ కి సౌదీ అరేబియా మరియు ఇరాక్ పొరుగు దేశాలు, రోడ్డు మార్గం ద్వారా ఈ రెండు దేశాలకి వెళ్ళవచ్చు. 1980 నుండి 1988 దాకా జరిగిన ఇరాక్ - ఇరాన్ యుద్ధంలో కువైట్ ఇరాక్ పక్షాన నిలబడింది. షట్ ఆల్ అరబ్ అనే  నది ఇరాన్, ఇరాక్ ల సరిహద్దు గుండా ప్రవహించి పర్షియల్ గల్ఫ్ లో కలుస్తుంది. ఈ నది గుండా వెళ్ళే జల రవాణా మార్గంపై హక్కుల వివాదం వల్లనే ఇరాన్, ఇరాక్ ల మధ్య ఎనిమిది సంవత్సరాలు యుద్ధం నడిచింది. 1980 కి ముందరి పరిస్ధితి యధాతధంగా కొనసాగాలన్న ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది.

కాని విచిత్రంగా 2 ఏళ్ల తర్వాత తమకి మద్దతు ఇచ్చిన కువైట్ పైనే ఇరాక్ దాడి చెయ్యటం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1990 నాటికి 18 ప్రావిన్సులు ఉన్న ఇరాక్ కి 19 వ ప్రావిన్సు గా కువైట్ ఏర్పడుతుందని సద్దాం హుస్సేన్ ప్రకటించాడు. స్వతంత్ర దేశంగా ఉన్న కువైట్ ని ఇరాక్ లో ఒక రాష్ట్రం గా కలుపుకోవాలన్నది సద్దాం కోరిక. కువైట్ గర్భం లో అపారంగా నిక్షిప్తమైన చమురు సంపద కూడా ఈ ఆశ కి కారణం.  ఆగస్టు 2 వ తేది 1990 ఉదయాన్నే, ఇరాక్ , లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది. ఆ యుద్ధానికి సంభందించిన విశేషాలన్నీ ఒక మ్యూజియం లో భద్ర పరిచారు. దీనిని కువైట్ హౌస్ ఆఫ్ నేషనల్ మ్యూజియం అని సద్దాం మెమోరియల్ అని కూడా పిలుస్తారు.కువైట్  హిస్టారికల్ మ్యూజియం చూశాక దానికి కొద్ది దూరంలోనే ఉన్న ఈ మ్యూజియం కి చేరుకున్నాం. అక్కడి గైడ్ మన తెలుగువాడే. చిత్తూరు కి చెందిన ఇస్మాయిల్ ఈ మ్యూజియం కి గైడ్. ఇక మా పని మరింత సులువు అయింది. ఇరాక్ ఆక్రమణ ని , ఆ తరువాత ఆరు నెలల పాటు సాగిన ఆ యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆ ఉదంతాలన్నిటిని బొమ్మల రూపంలో పొందు పరిచారు.
 
మనం ఒక్కో ఘట్టాన్ని చూస్తున్నపుడు వాటి తాలూకు శబ్దాలన్నీ బాక్ గ్రౌండ్లో వినిపిస్తూ అక్కడ నిజమైన యుద్ధమే జరుగుతోందా అనే భావన ని కలుగ జేస్తుంది. ఒక్కో సంఘటన ఇస్మాయిల్ చెప్తుంటే మాకు ఒళ్ళు జలదరించింది. 1966 లో స్థాపించిన కువైట్ యూనివర్సిటీ ఈ దాడి లో పూర్తిగా ద్వంసం అయింది. ఆ సమయంలో యూనివర్సిటీ లో పాఠాలు చెప్పే టేబుల్ పైన పడిన ఒక బాంబు ని అక్కడ యధా తధంగా ఉంచారు. ఈ ఆక్రమణ లో వేలాది మంది కువైట్ పౌరులు మరణించారు. చాలా మంది జాడ తెలియలేదు. అమెరికా తో పాటు ఇతర దేశాలన్నీ ఈ ఆక్రమణ ని వ్యతిరేకిస్తూ తమ సైన్యాన్ని కువైట్ కి మద్దతు గా రంగంలోకి దించాయి. ఈ ధాటికి తట్టుకోలేక ఫిబ్రవరి 28, 1991 న ఇరాక్ దళాలు వెనక్కి మళ్ళాయి.అందుకే ఈరోజుని లిబరేషన్ డే గా కువైటీలు జరుపుకుంటారు. నేటికి యుద్ధం ముగిసి 24 ఏళ్ళు అయ్యింది. అయినా ఆనాటి సంఘటల్ని కువైటీ లు ఎన్నటికీ మర్చిపోరు. 

 యుద్ధం లో పాల్గొన్న ఇతర దేశాల సైనికులు కూడా చాలామంది మరణించారు. వారి ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. వీటన్నిటికంటే మమ్మల్ని ఆకర్షించిన అంశం, చివర్లో ఉంచిన సద్దాం ఛాయా చిత్రాలు మరియు తలభాగం మాత్రమె ఉన్న సద్దాం విగ్రహం. మనలో చాలామందికి 2003 లో  అమెరికా  ఇరాక్ యుద్ధ సమయంలో సద్దాం ని అరెస్ట్ చేశాక నగర మధ్యలో ఉన్న సద్దాం విగ్రహాన్ని కూల్చేసే ఫోటో ఒకటి గుర్తుండే ఉంటుంది. ఆ విగ్రహ తల భాగాన్ని అమెరికా కువైట్ కి కానుక గా ఇచ్చింది. దానితో పాటు సద్దాం కుమారుడి షేర్వాని కూడా ఇక్కడ ఉంచారు. ఇక అక్కడినుండి కువైట్ కి లాండ్ మార్క్ గా భావించే జంట టవర్ల దగ్గరకి బయలు దేరాం. 1979 లో ఆధునిక కువైట్ కి ప్రతి రూపంగా నిర్మించిన ఈ టవర్లు చూడకుండా కువైట్ సందర్శన పూర్తి కాదు. ప్రస్తుతం ఆధునీకరణ జరుగుతుండటంతో మాకు పైకి వెళ్ళే అవకాశం రాలేదు.
 
 
కువైట్ టవర్ల దగ్గర మూల్పురి గారితో 
కువైట్ సిటీ మెయిన్ రోడ్డు  అంతా సముద్రం పక్కనే ఉంటుంది. కువైట్ పూర్తిగా చమురు ఎగుమతుల పైనే ఆధారపడ్డ దేశం. జీడీపీ లో సగం చమురునుండే వస్తుంది. 94% ఆదాయం ప్రభుత్వానికి చమురు ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఇతర దేశాలనుండి వచ్చి ఇక్కడ పని చేస్తున్న వారిలో 80 శాతం మంది పెట్రోలియం పరిశ్రమల లోనే పని చేస్తుంటారు. ఇక్కడ వైద్య ఖర్చు కూడా తక్కువే. ముఖ్యంగా గర్భవతులకి  సిజేరియన్ ఆయినా, నార్మల్ డెలివరీ అయినా హాస్పిటల్ లో కేవలం 3 దినార్లు మాత్రమే వసూలు చేస్తారు. ఇది మన దేశంలో ఒకసారి డాక్టర్ని కలిస్తే అయ్యే ఖర్చు కంటే తక్కువ.1983 లో ఇక్కడ మద్యాన్ని నిషేదించాలని పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇక్కడ తెలుగు వారి జనాభా కూడా ఎక్కువే. దాదాపు లక్ష మందికి పైనే తెలుగు వారు ఇక్కడ నివసిస్తున్నారు. తెలుగు కళా సమితి ద్వారా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తూ ఉంటారు. తెలిసిన వారు ఎవరు వచ్చినా బాలకృష్ణ గారింట చెయ్యి కడగాల్సిందే అని మూల్పూరి గారు చెప్పటంతో శ్రీ ఎనిగళ్ళ బాలకృష్ణ గారిని వారి ఇంట్లోనే కలవటం జరిగింది. ఆయన అనుభవాలు,  చిన్నప్పటి ఊరు సంగతులు చెప్పుకుంటుంటే అసలు సమయమే తెలియలేదు. మన ఊరి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అక్కడి వారందరికీ దగ్గర చేసింది మాత్రం మనఘంటసాల.నెట్ అనటంలో అతిశయోక్తి లేదు. మిగతా వారంతా బాలకృష్ణ గారి ఇంటికే రావటంతో ఘంటసాల వారందరినీ ఒకే చోట కలవటం చాలా ఆనందాన్నిచ్చింది. వారి ఆతిధ్యం స్వీకరించాక అందరూ కలిసి నన్ను ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టటం మర్చిపోలేని అనుభవం.

Dated : 10.03.2015

This text will be replaced