కమ్మవారంతా చౌదర్లేనా ???Back to list

 

కమ్మవారంతా చౌదర్లేనా ???

చాలా కాలం నుండి నా మనసులో ఉన్న ప్రశ్న ఇది. నాకు సమాధానం దొరికి చాలా రోజులే అయినా ఇప్పటివరకూ ఎక్కడా చర్చించాల్సిన అవసరం రాలెదు. మొన్నామధ్య గ్రామానికి వెళ్ళినప్పుడు విజయవాడలో ఇంజినీరింగ్ చదువుకునే మా బంధువుల అబ్బాయిని ఇంటికి ఆహ్వానిస్తే, తనకి C పార్టీ ఉంది కాబట్టి అది అయ్యాక వస్తాను అని చెప్పాడు. అంటే కాలేజి లో ఉన్న కమ్మ విద్యార్ధులు మాత్రమే జరుపుకునే పార్టీ అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇటీవల గ్రామానికి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దల దగ్గర దగ్గర ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు, నాకు ఉన్న సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యాక అందరికీ కూడా ఇది తెలిస్తే బావుంటుంది అనిపించింది. మన గ్రామానికి సంభందించినంతవరకూ నేను ఎరిగిన కుటుంబాల్లో అత్యధికంగా చౌదరి అనే పేరు చివర పెట్టుకున్న కుటుంబం గొర్రెపాటి నరసింహం గారిది. గ్రామంలో వీరిని బోళ్ళపాడు మునసబు గారి కుటుంబం అంటారు. పడమట వీధి చివర్లో ఉంటుంది వీరి ఇల్లు. దాదాపు 70 సంవత్సరాల క్రితమే వీళ్ళ కుటుంబంలో వారి పేర్ల వెనుక చౌదరి అనే నామం కూడా ఉండేది. వారంతా తమ తాత ముత్తాతల పేర్లు తమ పిల్లలకి పెట్టుకునేటప్పుడు అవి మోటుగా ఉంటాయేమో (పేరయ్య చౌదరి,బసవయ్య చౌదరి) అని ఆ పేర్ల చివర చౌదరి అని తగిలించారేమో అనే ఆలోచనలోనే నేను ఉండేవాడిని.  గ్రామంలో మిగతా వాళ్ళెవరూ పెద్దగా ఆ హోదాని తగిలించుకునట్లు కనబడలేదు.
 

గొర్రెపాటి నరసింహం గారి ఇల్లు 
 
సహజంగానే కృష్ణా జిల్లాలో ఉన్న కులజాడ్యం వల్ల స్కూల్స్ లోనూ కాలేజీల్లోనూ,ఇప్పుడు బెజవాడ లో ఇంజినీరింగ్ చదివే వాళ్ళంతా తమ పేరు చివర చౌదరి అనే ఒక తోక ని తగిలించుకుంటున్నారు.( తల్లిదండ్రులు తమకి ఆ పేరు పెట్టకపోయినా,వారే సొంతగా తగిలించు కుంటున్నారు. ) అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాము జరుపుకునే కమ్మ పార్టీలకి "C" పార్టీ అని పేర్లు పెట్టుకుంటున్నారు. చౌదర్లు మాత్రమే పాల్గొనే పార్టీలన్న మాట. 
 
 
కాని చౌదరి అనేది కమ్మవారికి ప్రత్యామ్నాయ పదం కానే కాదు. కేవలం కృష్ణా,గుంటూరు జిల్లాల్లో తప్ప రాయలసీమలో,తెలంగాణాలో కమ్మవారు తమ పేర్ల వెనుక చౌదరి అని పెట్టుకోలేదు. అక్కడి వారంతా నాయుడు అని పెట్టుకున్నారు. కాని అక్కడ కూడా నాయుడు అని పెట్టుకున్న వాళ్ళంతా కమ్మవారు కాదు. కమ్మ నాయుడు అంటేనే వారు కమ్మవారు. భూస్వాములు జమీందార్లు తమ పేరు వెనుక చౌదరి అని పెట్టుకుంటారని చాలామంది పొరబడతారు. చల్లపల్లిని పాలించిన యార్లగడ్డ వంశీకులు, ముక్త్యాల ని పాలించిన వాసిరెడ్డి వంశస్తులు ఎవరూ తమ పేర్ల వెనుక ఈ చౌదరి ని తగిలించుకోలేదు. పేరుకి ముందు రాజా అని లేదా పేర్లకి చివర నాయుడు అనే తగిలించుకున్నారు. అంటే వారంతా చౌదర్లు కాదా? కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కమ్మవారు కూడా అందరూ చౌదరి అని పెట్టుకోలేదు. ఇటీవల కమ్మవారంతా దీనిని ఒక గౌరవ నామంగా, హోదాని సూచించే గుర్తుగా వాడటం ఎక్కువైంది. కాని కమ్మలంతా చౌదర్లు కాదు. 1579 లో కుతుబ్ షాహిలు కొండవీడుని జయించినప్పుడు, కుతుబ్ షాహిల దగ్గర పనిచేసే రాయరావు అనే మరాఠా సేనాని కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఉన్న 497 గ్రామాలకి పన్నులు వసూలు చేసేవారిగా కమ్మవారిని నియమించాడు. మహారాష్ట్రలో ఆదాయంలో పావు వంతుని పన్నుగా వసూలు చేసేవారు. మరాఠా లో ఆదాయంలో పావు వంతుని చౌత్ అంటారు. ఆ చౌత్ ని వసూలు చేసేవారు కాబట్టి ఆ కుటుంబాల వారిని చౌదరి అన్నారు. అలా ఆ పదం వాడుక లోకి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ, బెంగాల్,బీహార్ లలో పన్నులు వేలం వేసి అక్కడి జమిందార్లకి అప్పగించేవారు. వాళ్ళు అక్కడి నాలుగో వంతు భూమికి హక్కుదార్లు అనే అర్ధం లో వారికి చౌధురి,రాయ్ చౌధురి అని బిరుదులు ఇచ్చేవారు. కాని ఈ చౌధుర్ల లో అన్ని కులాల వాళ్ళు కనబడతారు. వారు దానిని ఇంటిపేరుగా కూడా కొనసాగించారు. కాని మన వాళ్ళు ఇంటిపేరు కొనసాగిస్తూనే పేరుకు చివర ఇది కూడా తగిలించటం మొదలు పెట్టారు.  ఉత్తరాదిన ఉండే ఈ చౌదర్లకి మన ప్రాంతం లో ఉండే చౌదర్లకి సంభంధమే లేదు. ఇక్కడ కేవలం కమ్మవారినే పన్నులు వసూలు చెయ్యటానికి నియమించటం వల్ల చౌదరి అనేది కమ్మకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు తప్ప చౌదరి అనేది  హోదాని లేదా కులాన్ని సూచించే పేరు కాదు. తర్వాత కాలంలో ఈ పన్ను వసూలు దార్లు కొంతమంది మునసబులుగా, జిల్లాలో ఉన్న కమ్మ జమిందార్ల దగ్గర సముద్దార్లు గా పనిచేశారు. వారసత్వంగా అది వారి పిల్లలకి సంక్రమించింది. కాబట్టి చౌదర్లంటే 16 వ శతాబ్దం లో నియమించబడ్డ ఆ 497 కమ్మ కుటుంబాల వారు మాత్రమే. మీ తాత,ముత్తాతలెవరైనా ఆ 497 కుటుంబాలకి చెందినవారైతేనే మీరు చౌదరి అని పెట్టుకోవటం లో అర్ధం ఉంది . చౌదరి అంటే పదవిని సూచించే నామమే తప్ప కులాన్ని సూచించేది కాదు. నేను పైన ఉదహరించిన ఆ కుటుంబంలో వాళ్ళు తమ తాత ముత్తాతలంతా పన్నులు వసూలు చేసేవారని చెప్పటం వల్ల వారి పేర్ల చివర చౌదరి అని పెట్టుకుని ఉండవచ్చు. కాబట్టి చౌదర్లంతా  కమ్మవారే కాని ,కమ్మవారంతా చౌదర్లు కాదు.

ఇప్పుడు ఇది తెలిశాక చౌదరి అని పెట్టుకోవటం మానేస్తారని కాని, మానేయాలని కాని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పదం ఇప్పటికే కమ్మవారికి ప్రత్యామ్నాయం గా మారిపోయింది. కాని వాస్తవాలు తెలుసుకోవటం అవసరం కాబట్టి దీని వెనుక కధ ని వివరించటం జరిగింది. 
 
Dated : 12.03.2013
 

This text will be replaced