గ్రహానుగ్రహంBack to list

 గ్రహానుగ్రహం 


మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే వాళ్ళలో నేను కూడా ఒకడినే. కష్టం వచ్చినపుడు తప్ప మామూలు సమయాల్లో దేవుడిని తలుచుకోని స్వార్ధజీవుల్లో నాక్కూడా స్థానం ఉంది. జ్యోతిష్యాన్ని, దేవుడి మహిమల్ని అస్సలు నమ్మని వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎప్పుడో అమ్మతో పాటు లేక బంధువులతోనో గుడికి వెళ్ళటం తప్ప, నా అంతట నేను సంకల్పించుకుని వెళ్ళిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అలా అని నేను హేతువాదినో, కమ్యూనిస్టునో కాదు. మంచి జరిగితే నా గొప్ప, చెడు జరిగితే దేవుడి మీద తోసేసే అజ్ఞానులలో నేను కూడా ఒకడినే. కాని ఏదన్నా గుడికి చారిత్రక నేపధ్యమో లేక ఏదైనా వింత కలిగించే విషయం ఉంటే మాత్రం కల్పించుకుని మరీ వెళతాను. దైవ భక్తీ తో కాదు సుమా...ఆ చారిత్రక నేపధ్యాన్ని తెలుసుకోవాలనే ఆత్రుత,ఆ వింత మీద రంధ్రాన్వేషణ చేసి దానికి సైన్సుకి ఏమన్నా లింక్ ఉందేమో కనిపెట్టటానికి. మనం ఒక వృత్తం లోపల నిలబడి చూస్తే ఒక పక్క చూడగలం. కాని ఆ వృత్తం బయట నిలబడి చూస్తే వృత్తం మొత్తాన్ని చూడగలం. 2005 లో నేను దుబాయ్ కి ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. ఇండియా లో ఉన్నప్పటి ఆలోచనల కంటే బయట నుంచి ఇండియాని చూస్తుంటే చాలా కొత్తగా కనిపించింది. నేను ఇండియాలో ఉన్నపుడు ఎదురవ్వని ఎన్నో ప్రశ్నలు, అక్కడికి వెళ్ళగానే ఎదురయ్యాయి. హిందూ దేవుళ్ళందరూ తమ మహిమల్ని భారతదేశంలోనే చూపిస్తారా లేక దుబాయ్ లో కూడా చూపిస్తారా? రామాయణం కధ నిజంగా జరిగితే ఆ టైంలో మిగతా దేశాల్లో ఏమి జరుగుతోంది? దేవుళ్ళందరూ లోక పాలకులు అంటారు కదా, దుబాయి ని కూడా హిందూ దేవతలే పాలిస్తున్నారా? రాశి ఫలాలు మనదేశంలోనే పని చేస్తాయా లేక ఇక్కడ కూడా పని చేస్తాయా? ఒకవేళ దుబాయ్ లో పెళ్లి చేసుకుంటే ముహూర్తం ఇండియా టైంలో పెడతారా లేక దుబాయి టైంలోనా? ఇవన్నీ వింటుంటే వీడెవడో పిచ్చోడిలా ఉన్నాడనుకుంటున్నారా, కాని అప్పుడు నాకు 22 ఏళ్ళు. ఈ సందేహాలకి సమాధానం చెప్పేంత జ్ఞానం ఉన్నవాళ్లు అప్పుడు నాకు దొరకలేదు. నాతోటి వాళ్ళంతా ప్రశ్నలకి ఆశ్చర్య పడేవాళ్ళు తప్ప సమాధానం చెప్పేవాళ్ళు కాదు. నా మిత్రుడు ఇర్ఫాన్ అని నాతొ పాటు చదువుకున్నాడు, అలాగే నాతొ పాటు దుబాయ్ లో కూడా పని చేశాడు. వాడి ద్వారా ఇస్లాం గురించి కొంత తెలుసుకున్నాను. వాడిని కూడా ఇలాంటి వెధవ లాజిక్ లు  అడుగుతుంటే, ఒక్క మాట చెప్పి నా నోరు మూయించాడు. దేవుడు మనకి కొంతవరకే ఆలోచించే శక్తి ఇచ్చాడు. అంటే దానర్ధం ఇంతకన్నా ఎక్కువ ఆలోచించకు అని. అందుకే అల్లా కనపడడు,రూపం లేదు. నీకు నా మాట చాలు నా గురించి ఇంకా ఎక్కువ ఆలోచించకు అనే దానికి అర్ధం కోసమే అల్లాకి రూపం లేదు. మేము అల్లాకి ఎందుకు రూపం లేదు అనే లాజిక్ జోలికి వెళ్ళము అని చెప్పాడు.కాని ఆ సమాధానం నన్ను సంతృప్తి పరచలేదు. కోనేట్లో డబ్బులు వేస్తే మనసులో కోరికలెలా తీరతాయండి అని ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ అడిగిన లాజిక్ లాంటివి నా బుర్రలో కూడా అప్పుడప్పుడు తొలుస్తూ ఉంటాయి. దీనికి ఆసినిమాలో మరో పాత్రధారి దీనికి సమాధానం చెపుతూ పాలల్లో పంచదార వేస్తేనే తియ్యగా ఎందుకు ఉంటాయండి, ఉప్పు వేస్తే ఎందుకు విరిగిపోతాయి..కొన్నిటికి లాజిక్ లు ఉండవు మనం నమ్మాలి అంతే అంటాడు. ఈ సమాధానం కూడా నాకెందుకో అంత సంతృప్తినివ్వలేదు. మనిషి సంఘజీవి కాబట్టి సన్నిహితుల మనోభావాల కోసం వితండవాదం చెయ్యకుండా కొన్ని మనలోనే అట్టిపెట్టుకుంటాం.

ఫలానా రాయి ఉంగరం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని కొందరు జ్యోతిష్కులు చెపుతూ ఉంటారు. శాటిలైట్ ఛానల్స్ వచ్చాక కార్పోరేట్ జ్యోతిష్కులు, ఇంటర్నెట్ వచ్చాక ఆన్ లైన్ జాతకాలు కూడా వచ్చేశాయి. అసలు ఉంగరంలో రాయికి మనం చేసే పనులకి ఎదురయ్యే ఫలితాలకి సంభంధం ఏంటో నాకు అర్ధం అయ్యేది కాదు. పెళ్ళికి జాతకాలు చూస్తారనే విషయం నాకు సంభంధాలు చూడటం మొదలు పెట్టాకే తెలిసింది. ప్రతి మనిషిలోనూ 36 గుణాలు ఉంటాయని మనం పుట్టిన సమయం, ప్రాంతం, ఆధారంగా ఆ గుణాలు లెక్కించబడతాయని, అమ్మాయి, అబ్బాయిలలో ఇద్దరివీ కనీసం 18 గుణాలు కలిస్తేనే వారిద్దరూ సుఖంగా ఉంటారని తెలుసుకున్నాను..నాకు ఇదో పెద్ద వింత. మరి ఇటీవల కావాలని చేయించుకుంటున్న సిజేరియన్ బేబిల జాతకం ఏంటో? ఫలానా డాక్టర్ చెయ్యి పట్టుకుంటే 1000 ఫీజు వసూలు చేస్తాడని వింటుంటాం కదా..ఇప్పుడు ఫలానా జ్యోతిష్కుడు చెయ్యి చూస్తే 10000 తీసుకుంటాడట! ఇది కొత్త ఉవాచ. హెల్త్ డాక్టర్లు పోయి ఇప్పుడు హెల్త్ & వెల్త్ డాక్టర్లు వచ్చారు. జాతకాలకి సాఫ్ట్ వేర్లు, అవి చెప్పే వాళ్లకి బెంజ్ కార్లు.

ఇవన్నీ ఒకెత్తు. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్, న్యూమరాలజీ, మనకి మంచి జరగాలంటే కేవలం ఆస్ట్రాలజీ మాత్రమే సరిపోదు అంకెల లంకెలు కూడా సరిగా కలవాలి. ఆ గణాంకాల లెక్కలు, నంబర్ల విన్యాసాలు వింటుంటే మతి పోవాల్సిందే. మన చేతిలో లేని మన జన్మదిన తేది మన జీవితంలో వర్తమాన, భవిష్యత్తులని చెపుతుంది అంటే నిజంగా ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా ఉన్న సందేహాలకి తోడు నాకు మళ్లీ ఇదొక సత్యాన్వేషణ. మంగళవారం ప్రయాణాలు మంచిది కాకపొతే ఈ బస్సులు, ట్రైన్లు ఎందుకు తిరుగుతున్నాయి? ఒకవేళ ఈ జ్యోతిష్యం నిజమే అయితే ముందు జరిగే చెడు అంతా తెలుసుకుని దానిని జరగకుండా ఆపెయ్యచ్చు కదా? ఈ తర్కానికి నేను సత్యాన్వేషణ అని పేరు పెట్టుకున్నా, నా చుట్టూ ఉన్నవాళ్ళకి మాత్రం ఇది రంద్రాన్వేషణ.

మన గ్రామంలో ఒకప్పుడు ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వాళ్ళు, విగ్రహారాధనని వ్యతిరేకించే చాలామంది ఇప్పుడు పూర్తి భక్తి మార్గంలో మునిగిపోవటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. నాకు చొరవ ఉంది కాబట్టి ఒకాయన్ని అడిగా, ఒకప్పుడు రాళ్ళకి మొక్కే వాళ్ళని పిచ్చోళ్ళు అన్న మీరే ఇప్పుడు పొర్లుడు దండాలు పెడుతున్నారేంటి అని. కర్మ సిద్ధాంతాన్ని తప్ప అసలు దేవుడిని, విగ్రహారాధనని నమ్మని కమ్యూనిస్టులు తమ పంధాని మార్చుకున్నారు అనటానికి ఉదాహరణ మంగళాపురంలో వెలసిన సాయిబాబా గుడి. మంగళాపురం అంటే మన ప్రాంతపు ఎర్రకోట..గుళ్లని దేవుళ్ళని నమ్మని ఎర్రకోట కూడా భక్తి మార్గం పట్టింది. కొన్ని స్వీయానుభవాలు, కొన్ని కాలం నేర్పిన పాఠాలు ఎంతటి వాడినైనా మారుస్తాయి. ఇవన్ని చూశాక మనిషిలో  దైవ చింతన, ఆధ్యాత్మికత, జాతకాలు పట్ల నమ్మకం ఏర్పడటానికి రెండు కారణాలు కనిపించాయి. 1. వయసు వల్ల, అనుభవాల వల్ల వచ్చిన మానసిక పరిణితి, 2. జీవితంలో ఒక దశకి చేరుకున్నసంపాదన.
 
 
పిశుపాటి నరసింహారావు గారు

మన గ్రామంలో పిశుపాటి నరసింహారావు గారు (పిశుపాటి సుబ్బయ్యశర్మ గారి సోదరులు) జ్యోతిష్య శాస్త్రం లో ప్రవీణులు. ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశాక గ్రామస్తులకి సేవ చేయాలనే సంకల్పంతో వివాహ ముహూర్తాలు,జాతక సంభంధమైన విషయాలలో ఉచితంగా తన సేవలని అందిస్తున్నారు. ఈ సందేహాల నివృత్తి కోసం ఓ రోజు ఆయనతో కూర్చున్నాను. గ్రహాలు మనమీద ఎలా ప్రభావాన్ని చూపిస్తాయో,ఉంగరంలో రాళ్ళకి మన జాతకానికి గల సంభందం లాంటి విషయాలు కొన్ని తెలుసుకున్నాను.అయన చెప్పిన వివరణ కొంత సంత్రుప్తినిచ్చినా ఇటీవల కలిగిన కొన్ని స్వీయానుభవాలు కూడా దానికి తోడయ్యాయి. నేను పోలాండ్ లో డ్రైవింగ్ లైసెన్సు కోసం అప్లై చేశాను. మొదటిసారి ఫెయిల్ అయ్యాను. మనకి ఇక్కడ భాష రాదు కాబట్టి మనతో ఒక అనువాదకుడు ఉంటాడు. మళ్లీ రెండోసారి అప్లై చేసినపుడు నాకు 13 వ నంబర్ కంప్యూటర్ ఇస్తూంటే ఆ అనువాదకుడు ఎగ్జామినర్ ని రిక్వెస్ట్ చేసి 14 వ నంబర్ ఇప్పించాడు. నాకు అర్ధం కాలేదు. రెండోసారి పరీక్షలో నేను పాస్ అయ్యాను. పరీక్ష అయ్యాక ఆ అనువాదకుడు చెప్పాడు, పశ్చిమ దేశాలలో 13 ని దురదృష్ట సంఖ్య గా భావిస్తారు ఇంతకుముందు నువ్వు పరీక్ష రాసిన తేది తేది 26, పరీక్ష రాసిన కంప్యూటర్ నంబర్ 13, కరెక్ట్ గా జవాబు రాసిన ప్రశ్నల సంఖ్య 13(పాస్ అవ్వాలంటే 16 ప్రశ్నలు కరెక్ట్ అవ్వాలి) అందుకే నువ్వు పాస్ అవలేదు అని. నాకు ఇదొక కొత్త ట్విస్ట్. మనం అక్కడ జాతకాల్ని నమ్మితే ఇక్కడ వీళ్ళు నంబర్ గేమ్ నమ్ముతారు.

నాకొకటి మాత్రం అర్ధం అయ్యింది. ఏ మతం అయినా, ఎవరు ఏ దేవుడిని  కొలిచినా, ఏ  దేశంలో అయినా ప్రపంచాన్ని నడిపించే అతీతమైన శక్తి ఒక్కటే. దానికి రూపం లేదు. అది ఈ లోకంలో అంతర్లీనంగా నిబిడీకృతమై మనల్ని నడిపిస్తుంది.దానికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రూపాల్ని, నమ్మకాలని ఆపాదించుకుంటారు... 
 
Dated : 02.12.2012
 
 

This text will be replaced