బాల్యాన్ని ప్రేమించే పెద్దలారా – నాకో సలహా ఇవ్వరూ!Back to list

 ఏప్రిల్ 21, 2012 ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడినది

 
బాల్యాన్ని ప్రేమించే పెద్దలారా – నాకో సలహా ఇవ్వరూ!
 
1978లో అట్లూరి పురుషోత్తం గారు “మాతృభాష లోనే ప్రాధమిక విద్య” జరగాలని రాసిన పుస్తకం చదివాను. పిల్లలు తమ సొంత భాషలో మాత్రమే తెలియని విషయాలను తెలుసుకుంటారని, తెలియని భాషలో తెలియని విజ్ఞానం తెలుసుకోవడం సాధ్యం కాదనీ ఆ పుస్తకంలో ఆయన నిరూపించారు. ఆడుతూ పాడుతూ గడపవలసిన బాల్యాన్ని పరభాషలో చదువుకోవలసి రావడం వలన “శిక్షణ” కాకుండా “శిక్ష”గా మారి సృజనాత్మకత కోల్పోతున్నారని ఆయన పడ్డ వేదన సహేతుకంగా అనిపించింది.
 
ఒక పల్లెటూళ్ళో డాక్టరు వృత్తిలో ఉన్న నాకు నా చుట్టుప్రక్కల ఊళ్ళలోని పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా గమనించాను. నా పిల్లలిద్దర్ని 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివించుకున్నాను.
 
గత మూడు దశాబ్దాలుగా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చదివించాలని (మన పిల్లల సొంత భాష తెలుగు కాబట్టి) ప్రచారం చేస్తూనే ఉన్నాను.
 
పిల్లలు
- 15 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ తల్లిదండ్రుల దగ్గరే పెరగాలనీ,
- సొంతభాషలోనే పాఠశాల విద్యను చదువుకోవాలనీ,
- ఆటపాటలతో బాల్యాన్ని గడుపుతూ మానసిక వత్తిడి లేకుండా చదువుకోవాలనీ,
- ఇంగ్లీషును ఒక భాషగా 3వ తరగతిలో మొదలుపెట్టి 10వ తరగతి వరకూ బోధించాలనీ నమ్మాను.
పెద్దలారా ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. నాకు 2 సంవత్సరాలు నిండిన మనవరాలు ఉంది. చక్కటి వాక్య నిర్మాణంతో తెలుగులో భావవ్యక్తీకరణ చేస్తోంది. హైదరాబాదులో తల్లిదండ్రుల వద్దే పెరుగుతోంది. (మొదటి అవసరం నెరవేరినట్లే).
 
మరో సంవత్సరంన్నర తర్వాత బడిలో చేర్పించాలి. ఏ బడిలో మానసిక వత్తిడి లేకుండా చదివిస్తారో తెలుసుకునే ప్రయత్నాలు పిల్ల తల్లిదండ్రులిద్దరూ చేస్తున్నారు. చైల్డ్ సెంటర్ద్ ఎడ్యుకేషన్ కు పేరున్న ఒక పాఠశాలకు వెళ్తే వారు ఇంగ్లీషులో తప్పితే మాట్లాడడం లేదట. పిల్లలకు కూడా ఇంగ్లీషులోనే పాఠాలు చెబుతారట. తెలుగులో బడిలో ఎవ్వరూ మాట్లాడే వీలు లేదట. తెలుగును ఒక సబ్జక్టుగా 3వ తరగతిలో మాత్రమే మొదలు పెడతారట.
 
కంట్లో పుల్ల గుచ్చుకుంటే తన టీచరుకు ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలియక సాయంత్రం ఇంటికి వచ్చేదాకా తన తల్లికి చెప్పుకోలేక పోయిన సంఘటన ఆంద్రజ్యోతిలో “అరుణ పప్పు” గారు రాసింది గుర్తుకు వస్తోంది. తెలుగులో మాట్లాడనందుకు వాతలు పడేటట్లు దెబ్బలు తిన్న కుర్రవాడి చిత్రం దినపత్రికలలో చూసి బెంబేలు పడిపోయాను.
 
7వ సంవత్సరం వచ్చేటప్పటికి సొంతభాషలో పునాదులు పడతాయి, ఆ తర్వాత మాత్రమే మరో భాషను పరిచయం చేయాలని భాషా శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు.
 
ఇప్పుడు మా కుటుంబ సభ్యులందరకు ఒకటే దిగులు, తెలుగులో ఎంతో చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తున్న పాపాయి ఒక్క తెలుగు ముక్క కూడా వినపడని ఆ ఇంగ్లీషు బడికి వెళ్ళి ఎంత శిక్ష అనుభవిస్తుందో గదా అని!
 
అయ్యలారా! మా పాపాయి తన బాల్యాన్ని సంతోషంగా ఆడుతూ పాడుతూ తన సొంత భాషలో విజ్ఞానాన్ని సంతరించుకోగల ఒక బడిని (తెలుగు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో) సూచిస్తారా! మీకు ఎంతో ఋణపడి ఉంటాను.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి హాస్పిటల్
చల్లపల్లి, కృష్ణా జిల్లా
సెల్ – 9885051179