​ఒక హంబర్ సైకిల్ ముచ్చట​Back to list

 అయ్యా,అమ్మా!

“స్నేహ” పుస్తకంలో నా పూర్వీకుల సమాచారం చదివిన తరువాత నా ముచ్చట్లు కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
 
నేను 40 ఏళ్ల క్రితం హంబర్ ఫ్యాక్టరీలో తయారయ్యాను. కార్లలో బెంజి కార్లకు ఎంత గౌరవం  ఉండేదో, అప్పట్లో నాకు సైకిళ్ళలో అంత గౌరవం ఉండేది.
 
నన్ను కొన్న టీచర్ 3 సంవత్సరముల తరువాత ఇప్పటి ఓనర్ రామ్మోహనరావు గారికి అమ్మేశారు. ఈయన డ్రిల్ మాస్టారు. రోజూ ఆయన్ని స్కూల్ కి తీసుకెళ్లడం, తీసుకురావడం నా పని. నాకప్పుడు స్కూల్లో చాలా మంది స్నేహితులు ఉండేవారు(తోటి సైకిళ్ళు) తరువాత వారి పెద్దబ్బాయి మెడికల్ కాలేజీలో చేరిన తరువాత నన్ను తీసుకువెళ్ళి, మెడికల్ కాలేజికి హాస్టల్ కి తిప్పేవాడు. ఆతరువాత వారి చిన్నబ్బాయి దావణగిరిలో ఇంజనీరింగ్ చేరినప్పుడు మళ్లీ అక్కడికి వెళ్ళాను. 4 సంవత్సరాలు ఆయనకు సేవ చేశాను. మళ్లీ తిరిగి  డ్రిల్లు మాస్టారి వద్దకు చేరి, ఆయనకు సేవ చేస్తున్నాను. తరువాత వారి మనుమడు (ఈయన డాక్టరే) ఈ ఊరు వచ్చినప్పుడల్లా నన్ను వాడుతూ వున్నాడు. ఇలా మూడు తరాలకు సేవ చేసిన నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ఈ నలుబది ఏళ్లల్లో నా మిత్రులంతా కనుమరుగైపోయారు.
 
ఈ మాస్టారుకి 80 సంవత్సరాలు రావడంతో నన్ను పక్కన పెట్టి, కార్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ మధ్యన ఆయనకు ఇద్దరు కవల మునిమనుమళ్ళు పుట్టారు. ఇక వారిద్దరూ ఎప్పుడు పెద్ద అయి నన్ను ఉపయోగిస్తారో అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేనింకా ఫిట్ గానే వున్నాను కదా!
 
ఇట్లు
40 ఏళ్ళు ఉన్న హంబర్ సైకిల్
   చల్లపల్లి
ది. 23.06.2012
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
ముబైల్ – 9885051179
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి – 521126
కృష్ణాజిల్లా